Teachers Transfers: టీచర్లకు గుడ్‌న్యూస్.. బదిలీలకు జీవో జారీ చేసిన తెలంగాణ విద్యాశాఖ..
పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు మార్గం సుగమం కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయులు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం జీవో 5ను జారీ చేశారు.
ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కల నెరవేరబోతున్నది. శుక్రవారం నుంచే టీచర్ల బదిలీలకు జీవో జారీ చేసింది తెలంగాణ సర్కారు. పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు మార్గం సుగమం కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయులు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం జీవో 5ను జారీ చేశారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్‌గా పదోన్నతులు నిర్వహించనున్నారు. శుక్రవారం కేటగిరీ ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాలు ఆన్‌లైన్‌లో ప్రకటించనున్నారు.
ఈ నెల 28 నుంచి 30 వరకు బదిలీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల హార్డ్ కాపీలను ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత టీచర్లు సంబంధిత ఎంఈవోలకు.. మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు.. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డీఈవోకు.. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2లోపు సమర్పించాల్సి ఉంటుంది.
ఫిబ్రవరి 3 నుంచి 6 వరకు దరఖాస్తుల హార్డ్ కాపీలను సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఎమ్ఈవోలు.. డీఈవో కార్యాలయంలో సమర్పణ, పరిశీలన, ఆన్‌లైన్‌లో ఆమోదం జరుగనున్నాయి. ఫిబ్రవరి 7న డీఈవో, ఆర్జేడీ వెబ్‌సైట్లలో బదిలీలు, పదోన్నతుల కోసం సీనియారిటీ జాబితా ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు సీనియారిటీ జాబితాపై మూడు రోజులు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని పరిష్కరిస్తారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో తుది సీనియారిటీ జాబితాల ప్రకటన ఉంటుంది. అయితే, ప్రధానోపాధ్యాయుల బదిలీలకు వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుంది.
మార్చి 4 నాటికి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పూర్తి చేయనున్నారు. మార్చి 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. టీచర్ల నుంచి దరఖాస్తులు అందిన 15 రోజుల్లోపు అప్పీళ్లను పరిష్కరించనున్నట్లు విద్యాశాఖ తాజా షెడ్యూల్‌లో పేర్కొంది. తెలంగాణ సర్కార్ టీచర్ల బదిలీలు, పదోన్నతులకు అనుమతి ఇచ్చిన రోజుల వ్యవధిలోనే వేగంగా ప్రక్రియ చేపట్టింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల నిరీక్షణకు తెరదించినట్లైంది.
ఫిబ్రవరి 13న మల్టీ జోనల్ స్థాయిలో, ప్రధానోపాధ్యాయుల వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్, పునఃపరిశీలన చేపడతారు. ఫిబ్రవరి 14న ఆర్జేడీలు ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు విడుదల చేస్తారు. ఫిబ్రవరి 15న హెచ్‌ఎమ్‌ల బదిలీల అనంతరం మిగిలిన ఖాళీలను ప్రకటిస్తారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం