Telangana EAMCET 2022: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ఖరారు.. పూర్తి వివరాలివే..
తెలంగాణ ఎంసెట్ పరీక్ష తేదీలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. అలాగే ఈసెట్ పరీక్షను జూలై 18వ తేదీన నిర్వహిస్తామన్నారు.
తెలంగాణ ఎంసెట్, ఈసెట్ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తాజాగా విడుదల చేశారు. జూలై 14, 15, 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ పరీక్షను నిర్వహిస్తామన్నారు. జూలై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ ఎగ్జామ్.. జూలై 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ఉంటాయని స్పష్టం చేశారు. అటు ఈసెట్ పరీక్షను జూలై 18వ తేదీన నిర్వహిస్తామన్నారు. కాగా, ఈ పరీక్షలను 28 రీజనల్ సెంటర్స్ పరిధిలోని 105 పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
మొత్తం ఇరు రాష్ట్రాల్లోని 105 కేంద్రాల్లో ఎంసెట్ ను జరపనున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు వారంలో నోటిఫికేషన్లు రిలీజ్ చేనున్నారు. ఎంసెట్, ఈసెట్ రిజిస్ట్రేషన్, ఫీజు ఇతర వివరాలను నోటిఫికేషన్ల సమయంలో అధికారులు తెలియజేయనున్నారు.
తెలంగాణ ఎంసెట్ కోసం రెండు రాష్ట్రాల నుంచి కనీసం రెండున్నర లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు. ఈ సారి ఇంటర్ మొదటి సంవత్సరంలో తప్పిన విద్యార్థులందరినీ కనీస మార్కులతో ప్రభుత్వం పాస్ చేయడంతో భారీ సంఖ్యలోనే ఎంసెట్ కు దరఖాస్తు చేసుకుంటారని అధికారులు అంచనావేస్తున్నారు. కరోనా నేపథ్యంలో 70శాతం సిలబస్ ఆధారంగానే ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంసెట్ పరీక్షలను నిర్వహించనున్నారు.
బీఎస్సీ నర్సింగ్ సీట్లను కూడా ఎంసెట్ అగ్రికల్చర్ విభాగం పరీక్ష ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయాలని కాళోజీ యూనివర్సిటీ ప్రతిపాదిస్తోంది. ఇదే విషయంపై వీసీ కరుణాకర్ రెడ్డి విద్యామండలి ఛైర్మన్ లింబాద్రితో చర్చించి వీటన్నింటినీ పరిశీలించి త్వరలో నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు.
బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ ( బీవోక్) విద్యార్థులూ ఈసెట్ ద్వారా బీటెక్ రెండో ఏడాదిలో ప్రవేశానికి అర్హులేనని ఇటీవల ఏఐసీటీఐ తెలియజేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది.
ఇక పాలిటెక్నిక్ విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్/బీఫార్మసీ రెండో ఏడాదిలో చేరేందుకు ఈసెట్‌ను జులై 13న నిర్వహించనున్నామని చెప్పారు. ఈసెట్‌కు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 25వేల మంది పోటీపడనున్నారు. మరోవైపు లాసెట్, ఎడ్‌సెట్ తదితర పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఛైర్మన్ లింబాద్రి తెలిపారు.