Telangana: అంతా చింతమనేనే చేశారు.. కోడిపందాల కేసులో కీలక వివరాలు వెల్లడించిన డీఎస్పీ
Telangana: పఠాన్‌చెరులో కోడి పందాల నిర్వహణకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు డీఎస్పీ భీమ్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
Telangana: పఠాన్‌చెరులో కోడి పందాల నిర్వహణకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు డీఎస్పీ భీమ్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో కోడి పందాలు నిర్వహిస్తుండగా.. దాడి చేశామని వెల్లడించారు. చింతమనేని ఆధ్వర్యంలోనే కోడి పందాలు నిర్వహిస్తున్నట్టుగా తమ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని వెల్లడించారు డీఎస్పీ. బీదర్‌లోని చించోలి ప్రాంతంలో మొదట కోడిపందాలు నిర్వహించాలనుకున్నారని, అక్కడ పోలీసులతో సమస్య ఉండటంతో.. అక్కడి నుంచి పటాన్‌చెరుకు షిఫ్ట్ అయ్యారని తెలిపారు. చించోలిలో బర్ల సతీష్‌కి సంబంధించిన 140 ఎకరాల ఫామ్ హౌస్‌లో మొదట కోడిపందాలు ప్లాన్ చేశారన్నారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి కోడి పందాలు నిర్వహిస్తున్నారని, గ్రూప్ సమాచారం బట్టే బీదర్ నుంచి ఇక్కడికి మకాం మార్చినట్టు గుర్తించామని వెల్లడించారు డీఎస్పీ.
ప్రస్తుతం చింతమనేని ప్రభాకర్ పరారీలో ఉన్నారని, మూడు బృందాలు ఆయన కోసం గాలిస్తున్నట్లు తెలిపారు డీఎస్పీ. పట్టుబడ్డ 21 మంది చింతమనేని ప్రభాకర్ ఫోన్ చేస్తేనే కోడిపందాలకు వచ్చామని ఒప్పుకున్నారన్నారు. ఇక్కడ తరచుగా కోడిపందాలు నిర్వహిస్తున్న ఆనవాళ్లను తాము గుర్తించామని తెలిపారు డీఎస్పీ. పందెం కోళ్లను ఇక్కడ పెంచుతున్నట్టుగా తెలుస్తోందని చెప్పారు. ‘‘కోడిపందాల సమాచారంతో మఫ్టీలో ప్రైవేట్ వెహికల్స్‌లో మేము కూడా వెళ్ళాం. కానీ వాళ్లు మమ్మల్ని గుర్తుపట్టారు. అప్పటికే కోడిపందాలు ప్రారంభించి చాలా సేపు అయినట్టు తెలుస్తోంది. పందెంలో చనిపోయిన నాలుగు కోళ్ళని గుర్తించాం. చింతమనేని సెల్‌ఫోన్ సిగ్నల్ శంషాబాద్ వైపు వెళ్లి కట్ అయింది. చింతమనేని కోసం మూడు బృందాలు వెతుకుతున్నాయి. చింతమనేని ఆంధ్ర కాకుండా వేరే ఎక్కడో దాక్కున్నాడని అనుమానిస్తున్నాం.’’ అని డీఎస్పీ భీమ్ రెడ్డి తెలిపారు.