AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SDRF: తెలంగాణలో సిద్ధమైన సరికొత్త దళం.. విపత్తు సమయాల్లో ఇక క్షణాల్లో సాయం..!

ఎన్​డీఆర్​ఎఫ్​ తరహాలో సుశిక్షితులైన సిబ్బందితో కూడిన దళం అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించి నిర్ణయం తీసుకున్నారు.

SDRF: తెలంగాణలో సిద్ధమైన సరికొత్త దళం.. విపత్తు సమయాల్లో ఇక క్షణాల్లో సాయం..!
Sdrf Team
Balaraju Goud
|

Updated on: Dec 07, 2024 | 8:40 AM

Share

తెలంగాణలో బలమైన సైన్యం రెడీ అయింది. విపత్తులు సంభవించినప్పుడు కేంద్రంపై ఆధారపడకుండా ఉండేందుకు కొత్త దళాన్ని సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అత్యవసరంగా రక్షణ చర్యలు చేపట్టే లక్ష్యంతో 2000 మందికి వేర్వేరు రాష్ట్రాల్లో శిక్షణ ఇప్పించి మెరికాల్లా మారింది.

తెలంగాణలో సరికొత్త దళం సిద్ధమైంది. జాతీయ విపత్తు స్పందన దళం తరహాలో తెలంగాణ విపత్తు స్పందన దళం సిద్ధమైంది. భారీ అగ్ని ప్రమాదాలు, వరదలు, భూకంపం వంటి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సహాయ చర్యలు చేపట్టడానికి ఈ దళం సిద్ధమవుతోంది. తెలంగాణ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో దాదాపు 2000 మంది సిబ్బందితో ఇది ఏర్పాటైంది.

హుస్సేన్‌ సాగర్‌ దగ్గర ఎస్​డీఆర్​ఎఫ్ టీమ్‌ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రత్యేక బోట్‌లల్లో విన్యాసాలు చేశారు. వీరంతా ఎస్​డీఆర్​ఎఫ్​ ప్రాథమిక కోర్సుల్లో శిక్షణ తీసుకున్నారు. వీరంతా ఎనిమిది వారాల పాటు తమిళనాడు, పుణె, గుజరాత్​, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సహా తదితర ప్రాంతాల్లో ఎన్​డీఆర్​ఎఫ్​ కేంద్రాల్లో శిక్షణ తీసుకున్నారు. ఆ ట్రైనింగ్‌ను ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కళ్లకు కట్టినట్లు చూపించారు.

అగ్నిమాపక శాఖలోని ఫైర్​ స్టేషన్లు ఇక నుంచి ఎస్​డీఆర్​ఎఫ్​ స్టేషన్లుగా మార్పు చెందనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 137 ఫైర్​ స్టేషన్​లలోని దాదాపు వెయ్యి మంది సిబ్బందితో పాటు తెలంగాణ ప్రత్యేక పోలీసు విభాగానికి చెందిన పది కంపెనీలతో కూడిన 1000 మంది సిబ్బంది ఈ దళంలో విధులు నిర్వర్తించనున్నారు. మొత్తంగా 2000 మందితో కూడిన రాష్ట్ర విపత్తు స్పందన దళం సిద్ధమైంది. ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి SDRFను ప్రారంభించారు.

తెలంగాణలో గత జూలై, ఆగస్టు నెలల్లో సంభవించిన భారీ వరదల్లో పలు ప్రాంతాలు నీట మునిగిన క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఎన్​డీఆర్​ఎఫ్​ తరహాలో సుశిక్షితులైన సిబ్బందితో కూడిన దళం అవసరమని భావించి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఎస్​డీఆర్​ఎఫ్​ను తీర్చిదిద్దడంతో పాటు ఆధునీకరించేందుకు ప్రభుత్వం రూ.35.3 కోట్లను గత అక్టోబరులో మంజూరు చేసింది. ఎస్​డీఆర్​ఎఫ్​ అమ్ములపొదిలో బలమైన అస్త్రాలు ఉన్నాయి. విపత్తు నిర్వహణ సిబ్బంది కోసం కొత్తగా 20 బస్సులు, ట్రక్కులు, బొలేరోలతో పాటు 40 వాటర్​ బోట్​లు కొనుగోలు చేశారు. అగ్నిప్రమాదాల్లో సహాయ చర్యల కోసం సిబ్బందికి శిరస్త్రాణాలు, చేతి గ్లౌజ్​లు, కంటి అద్దాలు, రెఫ్లెక్టివ్​ టేప్​లు, సేఫ్టీషూ, మెడికల్​ ఫస్ట్​ రెస్పాండర్​ కిట్​లను సమకూర్చారు. మొత్తంగా వరదలు, అగ్ని ప్రమాదాల్లాంటి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఈ కొత్త వ్యవస్థ ఉపయోగపడుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..