RBI: సైబర్ నేరాలకు చెక్ పెట్టేలా ఆర్బీఐ కీలక నిర్ణయం
సైబర్ కేటుగాళ్ల మోసాలకు చెక్ పెట్టేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరాలకు అడ్డాగా మారిన మ్యూల్ అకౌంట్ల ఏరివేతకు ఆదేశాలు ఇచ్చింది. ఇంతకీ.. ఏంటీ.. మ్యూల్ అకౌంట్స్?.. ఆ అకౌంట్లకు ఆర్బీఐ ఎలా చెక్ పెట్టబోతోంది?...
టెక్నాలజీ యుగంలో సైబర్ నేరగాళ్ల బెడద రోజురోజుకీ పెరిగిపోతోంది. అమాయకులే లక్ష్యంగా సొమ్ములు కొల్లగొట్టి మోసాలకు పాల్పడటమే కాదు.. ఆ సొమ్మును ఫేక్ అకౌంట్లకు మళ్లిస్తున్నారు. ఆయా ఖాతాల నుంచి సొమ్మును తమ అవసరాలకు వాడుకుంటున్నారు. ముఖ్యంగా నిరక్ష్యరాస్యులు, నిరుద్యోగులకు కమీషన్ ఆశ చూపి వారి పేరుతో ఖాతాలు తెరుస్తున్నారు. వీటినే మ్యూల్ అకౌంట్లు అంటారు. ఈ ఖాతాల్లోకి వెళ్లిన సొమ్మును గుర్తించడం, రికవరీ చేయడం కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో మ్యూల్ ఖాతాల ఏరివేతే లక్ష్యంగా ఆర్‌బీఐ మ్యూల్ హంటర్ డాట్ ఏఐని ప్రకటించింది. దీనిలో భాగస్వాములు కావాలని బ్యాంకులకు సూచించింది.
ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సైబర్ నేరాలు, మ్యూల్ అకౌంట్ల అంశాన్ని ప్రస్తావించారు. సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి మ్యూల్ ఖాతాలను వినియోగిస్తున్నారని చెప్పారు. మ్యూల్ ఖాతాలు సహా వివిధ ఆర్థిక మోసాలకు చెక్ పెట్టేందుకు జీరో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ పేరిట ఆర్‌బీఐ హ్యాకథాన్ నిర్వహిస్తోందన్నారు. దాంతోపాటు ఏఐ, మెషిన్ లెర్నింగ్‌తో పనిచేసే మ్యూల్ హంటర్ డాట్ ఏఐ మోడల్‌ను ఆవిష్కరించినట్లు తెలిపారు. ఆర్‌బీఐకి చెందిన రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ దీన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా నిర్వహిస్తోందన్నారు శక్తికాంత దాస్. ఈ మోడల్ మ్యూల్ ఖాతాలను సమర్థంగా గుర్తింస్తుందని చెప్పారు. రెండు పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకులతో కలిసి ప్రయోగాత్మకంగా నిర్వహించిన పరీక్షల్లో సత్ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. మ్యూల్ ఖాతాలకు చెక్ పెట్టేందుకు మిగిలిన బ్యాంకులు కూడా ఇన్నోవేషన్ హబ్‌తో జట్టు కట్టాలని సూచించారు. బ్యాంకులు కూడా సైబర్ సెక్యూరిటీని మెరుగుపరచడంతో పాటు సైబర్ మోసాల నివారణ, లావాదేవీలపై పర్యవేక్షణ ఉంచాలని సూచించారు శక్తికాంత దాస్.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..