Congress: రేపు కాంగ్రెస్ సీనియర్ నేతల కీలక భేటీ.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఇంటికెళ్లి ఆహ్వానించిన వీహెచ్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసమ్మతి రాగాలు పెరుగుతున్న నేపథ్యంలో సీనియర్ నేతలు అలర్ట్ అయ్యారు. తక్షణమే సమావేశమైన కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించారు
Telangana Congress Meet: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసమ్మతి రాగాలు పెరుగుతున్న నేపథ్యంలో సీనియర్ నేతలు అలర్ట్ అయ్యారు. తక్షణమే సమావేశమైన కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే రేపు కాంగ్రెస్ సీనియర్ నేతలు(Congress Senior Leaders) భేటీ కావాలని నిర్ణయించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy)నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న నేతలు మాత్రమే సమావేశమవుతుండటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలోనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Komatireddy Rajgopal Reddy) ఇంటికెళ్లి మరీ, పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు(VH) ఆహ్వానించారు. అలాగే, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి సహా పలువురు సీనియర్ నేతలకు ఆహ్వానాలు పంపారు.
ఒకవైపు, అధికార పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుంటే.. మరోవైపు, బీజేపీ సహా ఇతర పార్టీల నేతలు పాదయాత్రలతో ప్రజలకు చేరువతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు భగ్గుమంటున్నాయి. గత కొంతకాలంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్న నేతలు రహాస్య భేటీలు నిర్వహిస్తున్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సమయం దొరికిన ప్రతిసారి ఆయనపై అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే మరోసారి ఆదివారం సమావేశం కావాలని నిర్ణయించారు. రేవంత్‌రెడ్డితో పాటు తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జీ మాణిక్కం ఠాకూర్ వైఖరిపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అంతకుముందు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు (వీహెచ్) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అవమానం జరిగే చోట వుండలేనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే పార్టీ మారడంపై నిర్ణయం తీసుకుంటానని కోమటిరెడ్డి అన్నట్లు తెలుస్తోంది. పార్టీలో వున్న సమస్యలపై కలిసి మాట్లాడుకుందామని.. లేనిపక్షంలో అధిష్టానం వద్దకు వెళదామని వీహెచ్ బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే, గత వారం చౌటుప్పల్‌లో మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. గౌరవం ఇవ్వని చోట తాను పార్టీలో ఉండనని చెప్పారు. ఎవరి కింద పడితే వారి కింద పని చేయలేనని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారితే తనను నమ్మిన వారు తన వెంట రావొచ్చని కూడా ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేసే పార్టీ ఏదైతే ఆ పార్టీలో ఉంటానని చెప్పారు. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ గట్టిగా పోరాటం చేయడం లేదని భావిస్తే మరో పార్టీలోకి పోతామన్నారు. తాము పదవుల కోసం, డబ్బుల కోసం పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా అవసరమైతే తామే నిలబడుతామని ఆయన చెప్పుకొచ్చారు.
ఇదిలావుంటే, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి కాంట్రాక్టర్ అని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో సీఎల్పీ.. తనకు సరైన మద్దతు ఇవ్వలేదని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నట్లుగా ప్రచారం సాగుతుంది.