AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress: కాంగ్రెస్‌లో ఎంపీ సీటు కోసం భారీగా దరఖాస్తులు.. రాజకీయ వారసులకు టికెట్ ప్రయత్నాలు

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేయాలనుకునే ఆశావహుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో టీ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించింది. నాలుగు రోజుల పాటు గాంధీ భవన్ లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకున్నారు. మొదటి రెండు రోజులు పెద్దగా దరఖాస్తులు రాకపోయినా, చివరి రెండు రోజులు రోజుకు వందకు పైగా దరఖాస్తులు వచ్చాయి.

Congress: కాంగ్రెస్‌లో ఎంపీ సీటు కోసం భారీగా దరఖాస్తులు.. రాజకీయ వారసులకు టికెట్ ప్రయత్నాలు
Telangana Congress
Balaraju Goud
|

Updated on: Feb 04, 2024 | 1:01 PM

Share

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేయాలనుకునే ఆశావహుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో టీ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించింది. నాలుగు రోజుల పాటు గాంధీ భవన్ లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకున్నారు. మొదటి రెండు రోజులు పెద్దగా దరఖాస్తులు రాకపోయినా, చివరి రెండు రోజులు రోజుకు వందకు పైగా దరఖాస్తులు వచ్చాయి. 17 పార్లమెంట్ స్థానాలకు 306 దరఖాస్తులు వచ్చాయని గాంధీ భవన్ సిబ్బంది తెలిపారు. ఓక్కో దరఖాస్తుదారుని నుంచి జనరల్ కేటగిరిలో 50 వేలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి 25 వేల చొప్పున దరఖాస్తు రుసుము వసూలు చేశారు.

జనరల్, రిజర్వుడ్ సీట్లు అనే తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ఖమ్మం సీటు అయితే హాట్ టాపిక్ గా మారింది. ఈ సీటు కోసం ఇద్దరు మంత్రులు తమ కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇప్పించుకునేందుకు తీవ్ర పోటీ పడుతున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి ఇద్దరూ ఖమ్మం టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరే కాకుండా మాజీ ఎంపీ వీహెచ్, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి కూడా ఇదే టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఖమ్మం టిక్కెట్ ఎవరికి ఇస్తారనే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇక సోనియా కూడా ఇదే సెగ్మెంట్ నుండి పోటీ చేయాలని ఆ పార్టీ నేతలు గతంలో రెండు సార్లు తీర్మానం చేశారు.

రిజర్వ్ సీటు అయిన వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, మహబూబాబాద్ లకు కూడా భారీగా దరఖాస్తులు వచ్చాయి. మహబూబాబాద్ టిక్కెట్ కోసం విజయభాయి, బలరాం నాయక్, తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేష్, తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. పెద్దపల్లి టిక్కెట్ కోసం వివేక్ కొడుకు గడ్డం వంశీ, రామిళ్ళ రాధిక, యూత్ వింగ్ నాయకుడు పెరిక శ్యామ్ తో పాటు పలువురు నేతలు దరఖాస్తు చేశారు. సికింద్రాబాద్ టిక్కెట్ కోసం వేణుగోపాల స్వామి, అనిల్ కుమార్ యాదవ్, రోహిణ్ రెడ్డి, అధికార ప్రతినిధి సామ రామ్ మోహన్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.

ఇక మల్కాజిగిరి టిక్కెట్ కోసం సర్వే సత్యనారాయణ, బండ్ల గణేష్, కపిలవాయి దిలీప్ కుమార్, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. భువనగిరి టిక్కెట్ కోసం ఎమ్మేల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూతురు కీర్తి రెడ్డి, చామల కిరణ్, కోమటిరెడ్డి పవన్ రెడ్డి అప్లయ్ చేసుకున్నారు. వరంగల్ టికెట్ కోసం మోత్కుపల్లి నర్సింహులు, సర్వే సత్యనారాయణ, పిడమర్తి రవి, వరంగల్ రవి, సిరిసిల్ల రాజయ్య తదితరులు దరఖాస్తు చేశారు. నల్లగొండ టిక్కెట్ కోసం పటేల్ రమేష్ రెడ్డి, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి అప్లయ్ చేసుకున్నారు. చేవెళ్ల టికెట్ కోసం ఏ.దామోదర్, పారిజాత నర్సింహారెడ్డి, కేఎల్ఆర్ తదితరులు దరఖాస్తు చేశారు. నాగర్ కర్నూల్ కోసం మల్లు రవి, సంపత్ కుమార్, చారగొండ వెంకటేష్ అప్లయ్ చేసుకున్నారు.

వచ్చిన అప్లికేషన్లను సెగ్మెంట్ల వారీగా విభజించి స్క్రూటినీ చేయనున్నారు. వడబోసిన జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపిస్తారు. ఏఐసీసీ నియమించిన హరిష్ చౌదరి నేతృత్వంలోని తెలంగాణ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. 17 స్థానాల్లో కనీసం 15 స్థానాలు గెలవాలని చూస్తున్న కాంగ్రెస్ గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్ ఇవ్వాలని కసరత్తు చేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాలని ప్రయత్నం చేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..