వెయ్యి రోజుల పాలన.. వెయ్యి కిలోల ఉల్లిగడ్డలు పంపిణీ!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్‌లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాజనాల శ్రీహరి వినూత్న కార్యక్రమం చేపట్టారు. వరంగల్ చౌరస్తాలో పేద ప్రజలకు 1000 కిలోల ఉల్లిగడ్డలను ఉచితంగా పంపిణీ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. కొందరు నేతలు వినూత్న కార్యక్రమాలతో చర్చగా నిలుస్తున్నారు. వరంగల్‌కు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వెయ్యి రోజుల పాలనకు జ్ఞాపకంగా 1000 కిలోల ఉల్లిగడ్డలు ఉచితంగా పంపిణీ చేశాడు. పేదలకు వెయ్యి కిలోల ఉల్లి పంపిణీతో చర్చగా నిలిచారు.
వరంగల్ రాజకీయాల్లో తనదైన శైలిలో నిలిచే సీనియర్ నాయకుడు రాజనాల శ్రీహరి రేవంత్ సర్కార్ వెయ్యిరోజుల పాలన జ్ఞాపకంగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చేపట్టారు. విభిన్న కార్యక్రమాలతో వార్తల్లో నిలిచే ఆయన వెయ్యిరోజుల పాలనను వెయ్యి కిలోల ఉల్లిగడ్డల రూపంలో ప్రజలకు తెలిపారు. వెయ్యి రోజుల మైలురాయిని పురస్కరించుకొని వరంగల్ చౌరస్తాలో పేద ప్రజలకు 1000 కిలోల ఉల్లిగడ్డలను ఉచితంగా పంపిణీ చేశారు. నిత్యావసర ధరలు పెరుగుతున్న సమయంలో సామాన్యుడికి ఈ పంపిణీ ఎంతో ఊరటనిచ్చింది..
ఈ సందర్భంగా రాజనాల శ్రీహరి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభీష్టానికి అనుగుణంగా పాలన సాగిస్తోందని అన్నారు.. 1000 రోజుల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, పేద ప్రజల సంక్షేమానికి అనేక విప్లవాత్మక పథకాలను అమలు చేయడం అభినందనీయమన్నారు. వెయ్యి రోజుల పాలన ప్రజలకు వివరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్నో విరుద్ధ కార్యక్రమాలు చేస్తున్నారు.. కానీ వరంగల్ లో రాజనాల శ్రీహరి చేసిన ఉల్లిగడ్డల పంపిణీ ఇప్పుడు జనంలో చర్చగా మారింది. ఉల్లి కోసం సామాన్యులు బారులు తీరడం స్థానికంగా అందరి దృష్టిని ఆకట్టుకుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
