AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఆర్టీవో కార్యాలయంలో కట్టల కొద్దీ నగదు.. కలకలం సృష్టిస్తున్న వీడియో..!

హైదరాబాద్ బండ్లగూడ ఆర్టీవో కార్యాలయంలో అవినీతి ఆరోపణలు, మధ్యవర్తుల ప్రాబల్యంపై ఓ వీడియో కలకలం సృష్టిస్తోంది. కానిస్టేబుల్ తన ఛాంబర్‌లో కట్టల కొద్దీ నగదు లెక్కిస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. డాక్యుమెంట్లు సరిగా ఉన్నా సామాన్యులను తిప్పుకుంటున్నారని, మధ్యవర్తుల ద్వారానే పనులు జరుగుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, అవినీతికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Hyderabad: ఆర్టీవో కార్యాలయంలో కట్టల కొద్దీ నగదు.. కలకలం సృష్టిస్తున్న వీడియో..!
Rto Scam
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Sep 19, 2026 | 7:51 PM

Share

హైదరాబాద్: పాతబస్తీలోని బండ్లగూడ ఆర్టీవో కార్యాలయం చుట్టూ అవినీతి ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. నిబంధనల ప్రకారం అన్ని డాక్యుమెంట్లు సమర్పించినా.. ఏదో ఒక లోపాన్ని చూపించి కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో మధ్యవర్తుల ద్వారా వెళ్తే పనులు వేగంగా పూర్తవుతున్నాయనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయి.

డాక్యుమెంట్లు ఉన్నా.. మరోసారి రమ్మంటారా?

ఆర్టీవో కార్యాలయంలో సాధారణ సేవల కోసం వచ్చే వాహనదారులు, వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. అవసరమైన పత్రాలు సమర్పించిన తర్వాత కూడా చిన్నచిన్న కారణాలు చూపుతూ మరో డాక్యుమెంట్ తీసుకురావాలని, మళ్లీ రావాలని చెబుతున్నారని వారి వాదన. అయితే ఇదే పనికి సంబంధించి మధ్యవర్తుల ద్వారా వెళ్లినప్పుడు మాత్రం ప్రక్రియ వేగంగా పూర్తి అవుతోందని కొందరు ఆరోపిస్తున్నారు. దీంతో అసలు కార్యాలయంలో జరుగుతున్నది నిబంధనల ప్రక్రియనా.. లేక ‘బ్రోకర్ వ్యవస్థ’ ప్రభావమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కానిస్టేబుల్ ఛాంబర్‌లో డబ్బులు లెక్కింపు.. వీడియో వైరల్

ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చేలా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ భీమ్ సింగ్ కింద పనిచేస్తున్నట్లు చెబుతున్న కానిస్టేబుల్ అరుణ్ తన ఛాంబర్‌లో పెద్ద మొత్తంలో నగదును లెక్కిస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. అయితే ఆ నగదు ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పని కోసం తీసుకున్నారు? ఎందుకు కార్యాలయంలోనే లెక్కిస్తున్నారు? అనే ప్రశ్నలకు మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. వీడియోలో కనిపిస్తున్న నగదుకు, ఆర్టీవో కార్యాలయంలో జరుగుతున్న ఆరోపణలకు నేరుగా సంబంధం ఉందని బాధితులు చెప్తున్నారు

బాధితులే వీడియోలు తీస్తున్నారా?

తమను కార్యాలయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్న కొందరు బాధితులు స్వయంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ వీడియోలు ఇప్పుడు అధికారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నిజంగానే నిబంధనలకు విరుద్ధంగా డబ్బుల వసూళ్లు జరుగుతున్నాయా? మధ్యవర్తుల ద్వారా మాత్రమే పనులు సులభంగా పూర్తవుతున్నాయా? కార్యాలయంలోని సిబ్బందికి ఈ వ్యవహారాలతో సంబంధం ఉందా? అన్న అంశాలపై సమగ్ర విచారణ జరిగితే అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది.

ఏసీబీ దృష్టి సారించాల్సిన అవసరం ఉందా?

బండ్లగూడ ఆర్టీవో కార్యాలయం చుట్టూ కొంతకాలంగా వినిపిస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోపై ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఉందనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వీడియోలో కనిపిస్తున్న నగదు వ్యవహారంపై విచారణ జరిపి, డబ్బు మూలం ఏమిటి? ఎవరి కోసం సేకరించారు? కార్యాలయ కార్యకలాపాలతో దానికి ఏమైనా సంబంధం ఉందా? అనే అంశాలను అధికారులు తేల్చాల్సి ఉంది.

ఒకవైపు ‘డాక్యుమెంట్లు సరిగా లేవు’ అంటూ సామాన్యులను తిప్పుతున్నారనే ఆరోపణలు.. మరోవైపు కార్యాలయంలోనే వేలాది రూపాయలు లెక్కిస్తున్న దృశ్యాలు.. అసలు బండ్లగూడ ఆర్టీవో కార్యాలయం వెనుక జరుగుతున్నది ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం దర్యాప్తులోనే తేలాల్సి ఉంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us