AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎల్‌నీనో ఎఫెక్ట్.. 12 ఏళ్ల కష్టం, 29లక్షల పెట్టుబడి.. సాగుచేసిన పంటను చేతురాల నరికేసిన రైతన్న!

కన్నబిడ్డల్లా సాకిన చెట్లను.. తన చేతులతోనే నరికేయాల్సి వస్తే ఆ రైతు గుండె ఎంతలా రగిలిపోతుందో కదా! పన్నెండేళ్ల శ్రమను, పచ్చని ఆశలను కళ్లముందే నేలమట్టం చేసిన ఆ అన్నదాత ఆవేదన వర్ణనాతీతం. వానలు పడక.. బోర్లు ఎండిపోయి.. చేసిన అప్పులు తీర్చలేక ఓ రైతు గుండెను రాయి చేసుకున్నాడు. నీరు అందక నిలువునా ఎండిపోతున్న ఏడు ఎకరాల చీని, ఎకరం నిమ్మ తోటను తట్టుకోలేక గొడ్డలితో నరికేసి కన్నీరుమున్నీరయ్యాడు. కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

ఎల్‌నీనో ఎఫెక్ట్.. 12 ఏళ్ల కష్టం, 29లక్షల పెట్టుబడి.. సాగుచేసిన పంటను చేతురాల నరికేసిన రైతన్న!
Kurnool Farmer Destroys 12 Year Orchard Amidst Drought
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Sep 20, 2026 | 10:42 AM

Share

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు మొహం చాటేయడంతో కర్నూలు జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. గోనెగండ్ల మండలం వేముగోడు గ్రామానికి చెందిన రైతు కృష్ణారెడ్డి 12 ఏళ్ల క్రితం ఏడు ఎకరాల్లో చీని, ఒక ఎకరంలో నిమ్మ తోటను ఎంతో శ్రమకోర్చి సాగు చేశారు. ఎకరానికి రూ.3 లక్షల చొప్పున ఇప్పటివరకు దాదాపు రూ.24 లక్షల మేర పెట్టుబడి పెట్టారు. ఇది కాకుండా ఏటా పురుగు మందులు, ఎరువులు, కూలీల ఖర్చుల కోసమే సుమారు రూ.5 లక్షల వరకు వెచ్చిస్తూ వచ్చారు.

అయితే గత మూడేళ్లుగా నీటి మట్టాలు గణనీయంగా పడిపోవడంతో పొలంలోని మూడు బోర్లు వట్టిపోయాయి. బావి తవ్వించినా అది కూడా అక్కరకురాలేదు. తోటను కాపాడుకునేందుకు అవసరమైన నీరు అందక, చెట్లకు కాసిన అరకొర కాయలు సైతం సైజు పెరగక ముందే రాలిపోతూ వచ్చాయి. భానుడి భగభగలకు పచ్చని తోట కాస్తా క్షామపీడితంగా మారిపోయింది. మరోవైపు మార్కెట్లో క్వింటాలు చీనికి కనీసం రూ.50 వేలు పలికితే తప్ప గిట్టుబాటు కాని దుస్థితి నెలకొనగా, ప్రస్తుతం మార్కెట్లో రూ.10 వేలు కూడా ధర పల్లకకపోవడంతో ఆ రైతు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఓవైపు దిగుబడి లేక, మరోవైపు మార్కెట్లో దక్కని మద్దతు ధరకు తోడు అప్పుల భారం పెరిగిపోవడంతో రైతు కన్నీటిపర్యంతమయ్యారు.

పుట్టెడు దుఃఖంతో చేజేతులా గొడ్డలి పట్టి కనీసం మరో 30 ఏళ్ళు పంటను అందించే అవకాశం ఉన్న ఆ కల్పవృక్షాలను నేలమట్టం చేశారు. కష్టార్జితం, చేసిన అప్పులన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని, పొలంలో ఎండిపోయింది కేవలం చెట్టు కాదని.. నా ఆశ కూడా ఎండిపోయిందని చెప్పకనే చెబుతున్నాడు ఆ రైతు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పరిహారం అందించి తమను ఆదుకోవాలని రైతు కృష్ణారెడ్డి వేడుకుంటున్నారు. ఎల్‌నినో సృష్టించిన ఈ ప్రకృతి విలయం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్నదాతలను నిలువునా ముంచేస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us