CM KCR on Ganesh Immersion: గణేష్ నిమజ్జనంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష!
గణేష్ నిమజ్జనం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులపై తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతా స్థాయి సమీక్ష నిర్వహించారు.
CM KCR on Ganesh Immersion: గణేష్ నిమజ్జనం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులపై తెలంగాణ హైకోర్టు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ అధికారులు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, హైకోర్టు అడ్వకేట్ జనరల్ హాజరయ్యారు. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో అనుసరించాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. అవసరమైతే, అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లాలా? లేదా నిమజ్జనానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్న దానిపై సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే, వినాయక నిమజ్జనంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను యధావిధిగా కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. హుస్సేన్‌సాగర్‌ను కాలుష్యం చేయమని చెప్పలేమని స్పష్టం చేసింది. గణేశ్ నిమజ్జనం గురించి జీహెచ్‌ఎంసీ వేసిన రివ్యూ పిటిషన్‌పై సోమవారం అత్యవసర విచారణ చేపట్టింది తెలంగాణ హైకోర్టు. నిమజ్జనంపై తీర్పును సవరించేందుకు ఏసీజే జస్టిస్ రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్‌తో కూడిన ధర్మాసనం నిరాకరించింది. హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని గతవారం హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును పునఃపరిశీలించాలంటూ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు GHMC కమిషనర్ లోకేశ్ కుమార్. పరిస్థితులను అర్థం చేసుకొని తీర్పు సవరించాలని కోరారు ప్రభుత్వ న్యాయవాది.
దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. పరిస్థితులన్నీ ప్రభుత్వం సృష్టించుకున్నవేనని కామెంట్ చేసింది. సమస్యను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదని.. కోర్టులది కాదని స్పష్టం చేసింది ఉన్నత న్యాయస్థానం. నీటి కుంటల్లో నిమజ్జనం వీలు కాదని గతంలోనే ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించింది హైకోర్టు. తీర్పు ఇచ్చాక ఇప్పుడు గుర్తించారా? అని అడిగింది. చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందని స్పష్టం చేసింది ధర్మాసనం. చట్టాలను ఉల్లంఘిస్తారా..? అమలు చేస్తారా? అనేది ప్రభుత్వం ఇష్టమని కామెంట్ చేసింది. తీర్పులో జోక్యం చేసుకొని సవరించలేమని స్పష్టం చేసింది టీఎస్ హైకోర్టు. హుస్సేన్‌సాగర్‌ని కాలుష్యం చేయమని చెప్పలేమని తేల్చి చెప్పింది ధర్మాసనం. పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది ఉన్నత న్యాయస్థానం. హైకోర్టు తాజా కామెంట్ల నేపథ్యంలో కుంటలను గుర్తించే పనిలోపడ్డారు GHMC అధికారులు.
మరోవైపు, ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధించింది.ఈ తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు కొట్టివేసింది. దీంతో తెలంగాణ సర్కార్ ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది.