AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News Big Debate: వరిపై ప్రభుత్వాల వర్రీ ఎందుకు?

తెలంగాణలో ఆయకట్టు పెరిగింది. దిగుబడి అధికంగా వస్తుందని ఆశించిన రైతులకు కేంద్ర, రాష్ట్రాలు షాకింగ్‌ న్యూస్‌ చెబుతున్నాయి

Big News Big Debate: వరిపై ప్రభుత్వాల వర్రీ ఎందుకు?
Big News Big Debate
Venkata Narayana
| Edited By: |

Updated on: Sep 14, 2021 | 10:29 AM

Share

తెలంగాణలో వరి పంట నిషేధమేనా.? కేంద్ర, రాష్ట్రాల తీరుతో అన్నదాతకు అన్యాయమేనా.? ధాన్యం సేకరణపై ప్రభుత్వాల విముఖత ఎందుకు? ప్రత్యామ్నాయ పంటలేంటి. వాటి మార్కెటింగ్‌ సంగతేంటి.?

Centre Vs State On Paddy: తెలంగాణలో ఆయకట్టు పెరిగింది. దిగుబడి అధికంగా వస్తుందని ఆశించిన రైతులకు కేంద్ర, రాష్ట్రాలు షాకింగ్‌ న్యూస్‌ చెబుతున్నాయి. మీ పంట మీ ఇంట్లోనే పెట్టుకోవాలంటున్నాయి ప్రభుత్వాలు. కొనడం మా వల్ల కాదని కేంద్రం చెప్పింది. అదే మాట రాష్ట్రం నోటి వెంట వస్తోంది. ఖరీఫ్‌లో వరి సాగు OK కానీ రబీలో చెప్పిన పంటలు వేస్తేనే నాలుగు డబ్బులు మిగులుతాయి. లేదంటే అప్పులే అంటూ హెచ్చరిస్తున్నారు తెలంగాణ అధికారులు.

కేంద్రం ప్రభుత్వం వద్దంటోంది.. తెలంగాణ రాష్ట్రం కూడా భారం మోయలేమంటోంది. దీంతో వరి వేసిన రైతులు త్రిశంకు స్వర్గంలో పడ్డారు. గత ఏడాది రికార్డు స్థాయిలో వచ్చిన యాసంగి పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఖరీఫ్‌లో కూడా సేకరిస్తారన్న ఉద్దేశంతో రైతులు భారీగా సాగు చేశారు. కానీ పరిస్థితులు తిరగబడ్డాయి. కేంద్రం 60 లక్షల టన్నులకు మించి కొనొద్దని అంటోంది. ఐదారేళ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయని.. నిల్వ చేసే సామర్ధ్యం కూడా లేదని తేల్చేసిందికేంద్రం. ఇక రాష్ట్ర సర్కారువైపే రైతులు ఆశగా చూసినా అదే సమాధానం వస్తోంది. ఇప్పటికే 70లక్షల టన్నుల ధాన్యం రైస్‌ మిల్లులు, గోదాముల్లో ఉందని.. మన దగ్గర నిల్వ చేసే సదుపాయాలు కూడా లేవని చేతులెత్తేస్తోంది స్టేట్‌. యాసంగి ధాన్యం కొనుగోళ్లతోనే 2 వేల కోట్ల భారం పడిందంటోంది.

అటు కేంద్రం.. ఇటు రాష్ట్రం రెండూ ముఖం చాటేయడంతో వరిసాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గత ఏడాది యాసింగిలో 90 లక్షల టన్నులు ప్రభుత్వం కొనగా.. వానాకాలం ఖరీఫ్‌లో 55 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. కోటీ 40లక్షల టన్నుల వరి ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. మరి కేంద్రం ఆదేశాలతో రాష్ట్రం 60లక్షల టన్నులకు మించి కొనలేదు… మిగిలిన పంట ఏం చేయాలి. ఇకపై తెలంగాణ రైతులు వరి సాగు చేయడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదంటోంది అధికార యంత్రాంగం. రివ్యూలో అధికారులు CM KCRకు ఫుల్‌ క్లారిటీ ఇచ్చారు. ఇది కాస్తా ఇప్పుడు రాజకీయాంశంగా మారుతోంది. కేంద్రం బాధ్యత నుంచి తప్పించుకుంటోందన్న విమర్శలున్నాయి. కేంద్రం కొంటామని చెప్పి మోసం చేసిందంటున్నారు తెలంగాణ మంత్రులు.

ఉత్పత్తి అధికంగా రావడానికి కారణం కూడా తెలంగాణలో ఆయకట్టు పెరగడమే. గడిచిన ఐదేళ్లలో ఏకంగా 70లక్షల ఎకరాల ఆయకట్టు పెరిగింది. కోటి ఎకరాల మాగాణం.. తెలంగాణ అంటూ నినాదం సక్సస్‌ అవుతోంది. దీంతో పంట పెరుగుతోంది. కానీ ఇదే సమయంలో పండిన పంట ఎవరు కొనాలన్న సమస్యా వస్తోంది.

అటు ఈ ఏడాది రుతుపవనాలు సమయానికి రావడంతో పంట దిగుబడి పెరిగింది. దేశవ్యాప్తంగా గత ఏడాది 149 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి వస్తే… ఈ సారి అది 150 మిలియన్‌ టన్నులు దాటుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పటికే కేంద్రం వద్ద భారీగా నిల్వలున్నాయి. ఇంకా కొనే పరిస్థితి లేదంటోంది కేంద్రం. దీంతో తెలంగాణ రైతాంగంలో ఆందోళన మొదలైంది. మరి రాష్ట్రం ప్రత్యామ్నాయం పంటలు వైపు మొగ్గు చూపాలని.. లేదంటూ సాగు రంగంలో సంక్షోభం తప్పదని అంటోంది. అయితే దీనికి తగిన ఏర్పాట్లు చేయడం కూడా సవాలే.

అసలు సాగు రంగంలో బాధ్యత అంతా కేంద్రానిదేనా? రాష్ట్రానికి బాధ్యత ఉండదా? ఈ అంశంపై బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌లో ఇంట్రెస్టింగ్‌ చర్చ జరిగింది… వీడియో కోసం కింద లింక్‌ క్లిక్‌ చేయండి.