CM KCR Siricilla Tour: ప్రతి ఊరు ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నదే సంకల్పం.. ఈనెల 4న రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జరుగుతుండటంతో.. అభివృద్ధి కార్యక్రమాలను నేరుగా పరిశీలించనున్నారు.
Telangana CM KCR Rajanna Siricilla District Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జరుగుతుండటంతో.. అభివృద్ధి కార్యక్రమాలను నేరుగా పరిశీలించనున్నారాయన. అందులో భాగంగా.. వారంలోనే.. ఐదారు జిల్లాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుకొమ్మలని భావిస్తున్న తెలంగాణ సర్కార్.. పట్టణాలతో పాటు.. గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది.
ప్రణాళికబద్ధంగా గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించి.. ప్రతి ఊరిని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామాలకు నెలకు రూ. 308 కోట్లు, నగరాలు, పట్టణాలకు రూ.148 కోట్లు అభివృద్ధి కోసం కేటాయిస్తున్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ కాలువలను సరిచేయడం, మురికి కాలువలు శుభ్రం చేయడం, హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ మరమ్మతులు, దోమల నివారణ చర్యలు చేపట్టడం లక్ష్యంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం సాగుతోంది.
ఇటీవల జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయితీరాజ్ అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్.. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల పురోగతిని, అంశాల వారిగా లక్ష్యాలపై చర్చించారు. ఆనుకున్న రీతిలో పనులు జరక్కపోతే.. ఆకస్మిక తనిఖీలు చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో భాగంగానే వరుసగా జిల్లాల పర్యటన చేస్తున్న సీఎం కేసీఆర్…. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 4న సిరిసిల్లలో సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో సిరిసిల్ల నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు ఇవ్వనున్న కేసీఆర్…. సిరిసిల్ల నూతన కలెక్టరేట్, నర్సింగ్ కళాశాలను ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లు మొదలు పెట్టింది జిల్లా అధికార యంత్రాంగం. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్, యాదాద్రి జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ఈ నెల 4న సిరిసిల్లలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేయడంతో పాటు.. కలెక్టర్లు కూడా ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు.