AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karimnagar Cable Bridge Opening: కరీంనగర్‌ సిగలో తీగల మణిహారం.. ప్రారంభానికి ముహూర్తం ఖరారు..

కరీంనగర్‌ జిల్లాలో ఏప్రిల్‌ 14న తీగల వంతెన ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. మంత్రి కె తారకరామారావు చేతుల మీదుగా వంతెన ప్రారంభం చేయనున్నట్లు సమాచారం. తీగల వంతెనను ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభింపజేయాలని..

Karimnagar Cable Bridge Opening: కరీంనగర్‌ సిగలో తీగల మణిహారం.. ప్రారంభానికి ముహూర్తం ఖరారు..
Karimnagar Cable Bridge
Srilakshmi C
|

Updated on: Mar 21, 2023 | 4:16 PM

Share

కరీంనగర్‌ జిల్లాలో ఏప్రిల్‌ 14న తీగల వంతెన ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. మంత్రి కె తారకరామారావు చేతుల మీదుగా వంతెన ప్రారంభం చేయనున్నట్లు సమాచారం. తీగల వంతెనను ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభింపజేయాలని తొలుత భావించినప్పటికీ జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్మాణం, సెక్రటేరియట్‌ పనుల కారణంగా సాథ్యపడలేదని, అందుకే వంతెన ప్రారంభానికి కేటీఆర్‌ రానున్నట్లు తెలుస్తోంది. వరంగల్‌-కరీంనగర్‌ నగరాల మధ్య దాదాపు 7 కిలోమీటర్ల దూరం తగ్గించడం, ఈ రెండు నగరాల మధ్య ట్రాఫిక్‌ నివారణకు తెలంగాణ సర్కార్‌ ఈ వంతెన నిర్మాణం చేపట్టింది. దీంతో 2018లో దాదాపు రూ.180 కోట్ల బడ్జెట్‌తో ఈ వంతెన పనులు ప్రారంభమయ్యాయి. పూర్తిగా విదేశీ ఇంజినీరింగ్‌ సాంకేతికతతో దీనిని నిర్మించారు. వంతెన నాణ్యతను ఇప్పటికే పలుమార్లు ఆర్‌అండ్‌బీ అధికారులు పరిశీలించారు.

వచ్చేనెల 14న ప్రారంభానికి ముహూర్తం ఖరారుకావడంతో రూ.8 కోట్ల వ్యయంతో లైటింగ్‌ ఏర్పాట్లు వేగవంతం చేశారు. ఫుడ్‌ స్టాల్స్‌, మ్యూజిక్‌, కొరియా టెక్నాలజీతో డైనమిక్‌ లైటింగ్‌ సిస్టమ్‌, 4 భారీ ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. ఏప్రిల్‌ 14న ప్రారంభించిన అనంతరం వాహనాలను వంతెన మీదికి అనుమతిస్తారు. అయితే ప్రతి ఆదివారం మాత్రం వాహనాలకు అనుమతి ఉండదు. వంతెనపై ఏర్పాటు చేసిన డైనమిక్‌ లైటింగ్‌ను ఆస్వాదించేందుకు సందర్శకులకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కేబుల్‌ బ్రిడ్జి విశేషాలు ఇవిగో..

వంతెనపై 500 మీటర్ల పొడవైన రోడ్డుతో నాలుగు వరుసల రహదారిని నిర్మించారు. 26 పొడవైన స్టీల్‌ కేబుల్స్‌.. ఇటలీ నుంచి తెప్పించిన 2 పైలాన్లు ఏర్పాటు చేశారు. రెండు పైలాన్ల మధ్య దూరం 220 మీటర్లు ఉంటుంది. పైలాన్‌ నుంచి ఇంటర్‌ మీడియన్‌కు 110 మీటర్ల దూరం ఉంటుంది. పూర్తిగా అధునాతన ఇంజినీరింగ్‌ టెక్నాలజీతో కేబుల్‌ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. రూ.8 కోట్లతో కొరియా డైనమిక్‌ లైటింగ్‌ సిస్టమ్‌. రోడ్డుకు ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లు ఉంటాయి. కాగా ఈ వంతెన నిర్మాణానికి 2017 డిసెంబరులో శంకుస్థాపన చేశారు. 2018 ఫిబ్రవరిలో పనులు ప్రారంభం కాగా 2023 జవనరి 26న వంతెనపై పనుల కోసం వాహనాలకు అనుమతి ఇచ్చారు. 2023 ఏప్రిల్‌ 14న వంతెన ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.