Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్వామీజీ ప్రసంగంలో దొంగల చేతివాటం.. భక్తుల బంగారు నగలు చోరీ

స్వయంప్రకటిత స్వామీజీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ముంబైలో నిర్వహించిన రెండు రోజుల కార్యక్రమంలో భారీ చోరీ జరిగింది. 36 మంది భక్తుల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి..

స్వామీజీ ప్రసంగంలో దొంగల చేతివాటం.. భక్తుల బంగారు నగలు చోరీ
Dhirendra Krishna Shastri
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 20, 2023 | 4:23 PM

స్వయంప్రకటిత స్వామీజీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ముంబైలో నిర్వహించిన రెండు రోజుల కార్యక్రమంలో భారీ చోరీ జరిగింది. 36 మంది భక్తుల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. మార్చి 18, 19 తేదీల్లో ముంబైలోని మీరా రోడ్‌లోని సలసార్ సెంట్రల్ పార్కు గ్రౌండ్‌లో పెద్ద ఎత్తున ‘దివ్య దర్బార్’ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామీజీ ఆశీర్వాదం కోసం దాదాపు రెండు లక్షల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. వచ్చిన వారిలో జేబు దొంగలు, స్నాచర్లు కలిసిపోయి, అదునుచూసి తమ చేతి వాటం చూపించారు. నిర్వాహకులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతో ఆదివారం సాయంత్రం అక్కడ స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. తొక్కిసలాట జరిగిన సమయంలో భక్తుల మెడల్లో బంగారు నగలు చోరీకి గురయ్యాయి. ఆభరణాల చోరీపై 36 మంది భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ మహిళ తన రెండేళ్ల కూతురు అనారోగ్యంతో ఉండటం వల్ల స్వామీజీ వీడియోలు చూసి నయం చేస్తారని వస్తే.. రోగం నయంకాకపోవడానికి బదులుగా తన మెడలోని మంగళసూత్రం ఎవరో దొంగిలించారని ఆవేదన వ్యక్తం చేసింది.

కాగా శాంతాబెన్‌ మిథాలాల్‌ జైన్‌ చారిటబుల్ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కొన్ని మూఢనమ్మక వ్యతిరేక సంస్థలు వ్యతిరేకించాయి. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వొద్దని కోరుతూ కొందరు శుక్రవారం నాడే మెమోరాండం కూడా సమర్పించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.