Telangana: రేపే తెలంగాణ కేబినేట్ సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రి మండలి
మే 18వ తేదీన రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది , రైతు రుణమాఫీతోపాటు, రాష్ట్ర ఆదాయం పెంపు, వర్షాకాల సీజన్ లో చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతుంది.

రాష్ట్ర సచివాలయంలో మే 18వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది , రైతు రుణమాఫీతోపాటు, రాష్ట్ర ఆదాయం పెంపు, వర్షాకాల సీజన్ లో చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతుంది.
మే 18వ తేదీ శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. లోక్‌సభ ఎన్నికల కారణంగా కేబినెట్ సమావేశం నిర్వహించక చాలా రోజులు అయ్యింది. దీంతో ఈ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర పునర్విభజన జరిగి పదేండ్లు పూర్తి కానుండటంతో, పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలు, తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినేట్ లో చర్చించనున్నారు. 9,10 షెడ్యూల్ లోని ఆస్తులపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆగస్ట్ 15లోపు రైతుల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. రుణమాఫీ కోసం దాదాపు రూ. 40 వేల కోట్లు అవసరం కాగా, అందుకు సంబంధించిన నిధుల సమీకరణపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ఇందుకు సంబంధించి రైతు కార్పోరేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది..దీంతో ఈ సమావేశంలోనే రైతు కార్పోరేషన్ పై నిర్ణయం తీసుకోనుంది. అలాగే ధాన్యం కొనుగోళ్ల పురోగతిని కేబినెట్ సమీక్షించనుంది. జూన్ నెల అరంభం నుంచి ఖరీఫ్ పంట సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు, నీటి ప్రణాళికపై చర్చ జరుగనుంది.
పెరిగిన ఖర్చుకు తగ్గట్టుగా రాష్ట్ర ఆదాయం పెంచుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఆదాయ మార్గాలను వెతికే పనిలో పడింది రాష్ట్ర సర్కార్. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో పాటు వనరుల సమీకరణకు తీసుకోవలసిన చర్యలపై కేబినెట్‌లో చర్చిస్తారు. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో నివేదికలోని సిఫారసులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించాలని కేబినెట్ నిర్ణయించే అవకాశముంది.
జూన్ నెల నుంచి కొత్త విద్యాసంవత్సరం ఆరంభంకానుండడంతో స్కూల్స్, కాలేజీల ప్రారంభానికి ముందే తీసుకోవల్సిన జాగ్రత్తలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ఇవే కాకుండా చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న మరికొన్ని అంశాలను కేబినెట్‌లో చర్చించనున్నారని సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
