CM KCR: ఫీల్డ్ అసిస్టెంట్లు, సెర్ఫ్, మెప్మా ఉద్యోగులకు శుభవార్త.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు
రాష్ట్రంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు, సెర్ఫ్, మెప్మా ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. సెర్ఫ్‌లో 4,500 మంది పని చేస్తున్నారని.. ఆ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామన్నారు.
CM KCR on field-assistants: రాష్ట్ర బడ్జెట్(Budget-2022)పై ప్రసంగించారు సీఎం కేసీఆర్(CM KCR).. అనేక అంశాలపై ఆయన మాట్లాడారు. కేంద్రం కన్నా రాష్ట్రం గ్రోత్‌రేట్‌లో ముందుందన్నారు. అయితే FRBM విషయంలో రాష్ట్రాలపై పెడుతున్న ఆంక్షలు.. అభివృద్ధికి ఆటకంగా మారుతోందన్నారు సీఎం. బీజీపీ(BJP) హయాంలోని కేంద్రం ఆధ్వర్యంలో పెరిగిందేదైనా ఉందంటే.. అది మతపిచ్చే అన్నారు సీఎం కేసీఆర్. ఇది దేశాభివృద్ధికి ఏమాత్రం మంచిది కాదన్నారు. దేశంలో డబుల్ ఇంజన్ అభివృద్ధి పేరుతో ప్రచారం జరుగుతోందని.. యూపీలో గత ఐదేళ్లో ఏం జరిగిందో చెప్పాలన్నారు. యూపీ కన్నా సింగిల్ ఇంజన్ ఉన్న తెలంగాణ రాష్ట్రమే డబుల్ అభివృద్ధి జరిగిందన్నారు సీఎం. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల భవిష్యత్‌కు ఆసరా ఇచ్చారు సీఎం కేసీఆర్. ఎంత ఖర్చైనా భరించి వారి చదువులు పూర్తయ్యేలా చూస్తామని.. దీనిపై కేంద్రానికి లేఖరాస్తామన్నారు.
ఇక రాష్ట్రంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు, సెర్ఫ్, మెప్మా ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. సెర్ఫ్‌లో 4,500 మంది పని చేస్తున్నారని.. ఆ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్స్ అని చెప్పి ఉపాధిహామీలో పని పని చేసేవారు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాదని… సమ్మె వద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి, సంబంధిత శాఖ అధికారులు చెప్పినా వినకుండా వెళ్లారన్నారు. ఇప్పుడు తప్పుతెలుసుకున్నారని.. వాళ్లు పొరపాటు చేశారు.. పెద్ద మనసుతో వాళ్లను క్షమించాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారన్నారు. ఓ పెద్దన్నలా క్షమించి.. మళ్లీ ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామన్నారు. ఇక మెప్మా ఉద్యోగులకు సైతం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామన్నారు సీఎం. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల మంత్రులు ఆర్థిక మంత్రితో కలిసి లెక్కలు తేల్చి, అందరికీ న్యాయం చేస్తామన్నారు.