AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో వాహనాల ఫిట్‌నెస్ టెస్టులకు కొత్త విధానం.. 37 స్టేషన్లు ఏర్పాటు

రాష్ట్రంలో వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షలను మరింత పారదర్శకంగా, ఆధునిక పద్ధతుల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల (ATS) ఏర్పాటుకు రూ.425.50 కోట్లను ఆమోదించింది. ఈ కేంద్రాల ద్వారా వాహనాల ఫిట్‌నెస్‌ను ఆధునిక యంత్రాల సహాయంతో పరీక్షించనున్నారు. ప్రస్తుతం మాన్యువల్‌గా నిర్వహించే తనిఖీలకు..

తెలంగాణలో వాహనాల ఫిట్‌నెస్ టెస్టులకు కొత్త విధానం.. 37 స్టేషన్లు ఏర్పాటు
Telangana To Set Up Automated Vehicle Fitness Testing Centres
Srilakshmi C
|

Updated on: Oct 19, 2026 | 3:03 PM

Share

హైదరాబాద్‌, అక్టోబర్ 19: తెలంగాణ రాష్ట్రంలో వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షలను మరింత పారదర్శకంగా, ఆధునిక పద్ధతుల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల (ATS) ఏర్పాటుకు రూ.425.50 కోట్లను ఆమోదించింది. ఈ కేంద్రాల ద్వారా వాహనాల ఫిట్‌నెస్‌ను ఆధునిక యంత్రాల సహాయంతో పరీక్షించనున్నారు. ప్రస్తుతం మాన్యువల్‌గా నిర్వహించే తనిఖీలకు బదులుగా ఆటోమేటెడ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. గతంలో ఈ ప్రాజెక్టుకు రూ.296 కోట్ల పరిపాలనా ఆమోదం ఉండగా, తాజాగా ప్రభుత్వం దానిని రూ.425.50 కోట్లకు పెంచింది. ఒక్కో టెస్టింగ్ కేంద్రం నిర్మాణానికి గతంలో అంచనా వేసిన రూ.8 కోట్లను రూ.11.50 కోట్లకు పెంచింది. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో అమలు చేయనున్నారు. మొదటి దశలో 15 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను రెండు క్లస్టర్లుగా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం మొత్తం రూ.172.50 కోట్ల వ్యయాన్ని అంచనా వేశారు.

  • క్లస్టర్‌ 1: ఈ క్లస్టర్‌కు సుమారు రూ.61.60 కోట్లు కేటాయించారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, హనుమకొండ, మేడ్చల్‌, సంగారెడ్డి, దుండిగల్‌-1, దుండిగల్‌-2 ప్రాంతాలతో పాటు ఆర్టీఓ, డీటీసీ కార్యాలయాల పరిధిలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని టెండర్‌ వివరాలు సూచిస్తున్నాయి.
  • క్లస్టర్‌ 2: ఈ క్లస్టర్‌కు సుమారు రూ.53.68 కోట్లను కేటాయించారు. ఇబ్రహీంపట్నం, ఖమ్మం, కొండాపూర్‌, మహబూబ్‌నగర్‌, నాగోల్‌, పటాన్‌చెరు యూనిట్‌ కార్యాలయ ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

రవాణా శాఖకు చెందిన డీటీసీ, ఆర్టీఓ కార్యాలయాల ప్రాంగణాలు, డ్రైవింగ్‌ టెస్టింగ్‌ ట్రాక్‌లు, ఇతర శాఖాపరమైన సదుపాయాల్లో ఈ కేంద్రాలను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. రెండో దశలో అదనంగా 22 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.253 కోట్ల వ్యయాన్ని అంచనా వేశారు. దీంతో రెండు దశల్లో కలిపి మొత్తం 37 కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి కేంద్రానికి రూ.11.50 కోట్ల చొప్పున అంచనా వ్యయం నిర్ణయించారు. గతంలో ఒక్కో కేంద్రానికి రూ.8 కోట్లుగా ఉన్న అంచనాను పెంచడంతో ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.129.50 కోట్లు పెరిగింది.

ఇవి కూడా చదవండి

ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లలో ఆధునిక యంత్రాల సహాయంతో వాహనాల ఫిట్‌నెస్‌ను పరీక్షించే అవకాశం ఉంటుంది. మానవ జోక్యం తగ్గడం ద్వారా తనిఖీల్లో పారదర్శకత పెరగడంతో పాటు, వాహనాల పరిస్థితిని సాంకేతిక ప్రమాణాల ఆధారంగా అంచనా వేయడానికి వీలవుతుంది. ఈ కేంద్రాల ఏర్పాటు పూర్తయితే రాష్ట్రంలో వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షల నిర్వహణలో ఆధునిక సాంకేతికతకు మరింత ప్రాధాన్యం లభించనుంది. అయితే కేంద్రాల నిర్మాణం, ప్రారంభ తేదీలు, పూర్తి స్థాయి కార్యకలాపాలపై తదుపరి అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది.

Follow Us