AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఒకవైపు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్.. మరోవైపు 38 రోజులుగా మొరాయిస్తున్న బీటీపీఎస్ యూనిట్ 3..

ఓవైపు ఎల్ నినో ప్రభావంతో భానుడి భగభగలు.. మరోవైపు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌తో ముంచుకొస్తున్న కరెంట్ కష్టాలు.. ఇలాంటి అత్యంత సంక్లిష్ట సమయంలో రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు పంచాల్సిన భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. మూడో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తి ఏకంగా నెలన్నర రోజులు కావస్తున్నా ఇంకా ఉత్పత్తి పునరుద్ధరణకు నోచుకోలేదు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: ఒకవైపు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్.. మరోవైపు 38 రోజులుగా మొరాయిస్తున్న బీటీపీఎస్ యూనిట్ 3..
Btps Unit 3 Shut Down For 38 Days
N Narayana Rao
| Edited By: |

Updated on: Oct 19, 2026 | 12:32 PM

Share

ఓవైపు ఎల్ నినో ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, రానున్న రోజుల్లో సాగు, తాగునీటితో పాటు విద్యుత్ సంక్షోభం తప్పదంటూ ప్రభుత్వం హెచ్చరిస్తున్న కీలక సమయంలో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర విఘాతం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని బీటీపీఎస్ యూనిట్-3లో సాంకేతిక లోపం తలెత్తడంతో గత 38 రోజులుగా ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. బీటీపీఎస్ మూడో యూనిట్‌లోని రోటర్ ఎక్సైటర్‌లో తలెత్తిన సాంకేతిక లోపమే ఈ షట్‌డౌన్‌కు కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ యూనిట్ ద్వారా రోజుకు 270 మెగావాట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తి కావాల్సి ఉండగా, గత 38 రోజుల్లో ఏకంగా 258 మిలియన్ యూనిట్ల మేర ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ సమస్యను సరిదిద్దేందుకు అవసరమైన రోటర్ ఎక్సైటర్ పరికరాలు రావడానికి మరో కొద్ది రోజుల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.

మిగిలిన మూడు యూనిట్ల నుంచే ఉత్పత్తి

మొత్తం నాలుగు యూనిట్లు ఉన్న బీటీపీఎస్‌లో ప్రస్తుతం 1, 2, 4 యూనిట్లు మాత్రమే పనిచేస్తున్నాయి. వీటి ద్వారా రోజుకు 810 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అయితే అత్యంత కీలకమైన మూడో యూనిట్ సుదీర్ఘకాలం పాటు మొరాయించడం మొత్తం విద్యుత్ గ్రిడ్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.

ఖమ్మంలో ఎండల సెగ.. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్

ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్టోబర్ నెలలోనే వేసవిని తలపించేలా భానుడు ప్రతాపం చూపుతుండటంతో గృహావసరాలతో పాటు వ్యవసాయ రంగానికి విద్యుత్ వాడకం విపరీతంగా పెరిగింది. రానున్న రోజుల్లో విద్యుత్ కొరత మరింత తీవ్రమయ్యే ముప్పు పొంచి ఉంది.

తరచూ సాంకేతిక సమస్యలు.. ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి

బీటీపీఎస్‌లో తరచూ సాంకేతిక సమస్యలు, మరమ్మతులు రావడం సాధారణమైపోయిందని, దీనివల్ల ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతింటోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లే, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌పై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపాలని, నిలిచిపోయిన మూడో యూనిట్‌ను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us