AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంచి ఇటుకలను ఎలా గుర్తించాలి..? ఇల్లు కట్టేముందు ఈ సింపుల్ ట్రిక్స్ గురించి తెలుసుకోండి..

జీవితకాల కష్టార్జితాన్ని రంగరించి కట్టుకునే సొంతిళ్లు తరతరాలు పదిలంగా ఉండాలంటే పునాది నుంచే పకడ్బందీ జాగ్రత్తలు అవసరం. అయితే గోడల నిర్మాణంలో కీలకమైన ఇటుకల నాణ్యత విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా భవన పటిష్టతకే ముప్పు వాటిల్లుతుంది. లక్షల రూపాయలు గుమ్మరించి నాసిరకం మెటీరియల్‌తో మోసపోకుండా.. మీ సైట్‌కు వచ్చిన ఇటుకలు అసలైనవో, నాసిరకమైనవో మీరే స్వయంగా ఎలా గుర్తించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

మంచి ఇటుకలను ఎలా గుర్తించాలి..? ఇల్లు కట్టేముందు ఈ సింపుల్ ట్రిక్స్ గురించి తెలుసుకోండి..
How To Check Brick Quality At Site
Krishna S
|

Updated on: Oct 19, 2026 | 11:49 AM

Share

సొంతింటి కల నెరవేర్చుకోవడానికి జీవితకాల సంపాదనను పెట్టుబడిగా పెడతారు. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించుకునే ఇల్లు తరతరాలు పటిష్టంగా ఉండాలంటే, నిర్మాణంలో ఉపయోగించే సామగ్రి నాణ్యత అత్యంత కీలకం. పునాది నుంచి గోడల నిర్మాణం వరకు ప్రధాన పాత్ర పోషించే ఇటుకల ఎంపికలో ఏమాత్రం పొరపాటు జరిగినా భవన మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. అందుకే, పనులు మొదలుపెట్టే ముందే ఇటుకల దృఢత్వాన్ని సొంతంగా ఎలా తనిఖీ చేసుకోవాలో నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా బట్టీలో కాల్చిన మట్టి ఇటుకల్లో ఎలాంటి కల్తీ ఉండదని చాలామంది భావిస్తారు. అయితే తయారీ ప్రక్రియలో సరైన ప్రమాణాలు పాటించకపోతే అవి నాణ్యతను కోల్పోతాయి. మట్టి మిశ్రమంలో ఇసుక, ఒండ్రు మోతాదులు సరిగ్గా లేకపోయినా, పచ్చి ఇటుకలను ఎండబెట్టడంలో నిర్లక్ష్యం వహించినా, బట్టీలో తగినంత ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా కాల్చకపోయినా అవి గుల్లబారిపోతాయి. అలాంటి బలహీనమైన ఇటుకలతో ఇల్లు కడితే వర్షపు నీటిని ఎక్కువగా పీల్చుకుని గోడలు త్వరగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

నాణ్యతను గుర్తించే సులభమైన పరీక్షలు ఇవే

రింగింగ్ సౌండ్ టెస్ట్

రెండు ఇటుకలను చేతుల్లోకి తీసుకుని ఒకదానితో మరొకటి నెమ్మదిగా కొట్టాలి. అలా కొట్టినప్పుడు గాజు లేదా ఇత్తడి వంటి లోహపు గంట మోగిన శబ్దం వస్తే అవి బాగా కాలిన, నాణ్యమైన ఇటుకలని నిర్ధారించుకోవచ్చు. అలా కాకుండా మొద్దుబారిన ‘డల్’ శబ్దం వస్తే అవి సరిగ్గా కాలలేదని, తగినంత బలం లేదని అర్థం.

T ఆకారపు ఎత్తు పరీక్ష

రెండు ఇటుకలను తీసుకుని ఇంగ్లీష్ అక్షరం T ఆకారంలో ఒకదానిపై ఒకటి అమర్చాలి. అనంతరం సుమారు మూడు అడుగుల ఎత్తు నుండి వాటిని గట్టి నేలపైకి వదలాలి. కింద పడగానే ఇటుకలు ముక్కలైతే అవి నిర్మాణానికి పనికిరావు. ఒకవేళ ఏమాత్రం పగుళ్లు లేకుండా చెక్కుచెదరకుండా ఉంటే, అవి అధిక బరువును మోయగల పటిష్టమైన ఇటుకలని స్పష్టమవుతుంది.

నీటి శోషణ పరీక్ష

గోడ కట్టే ముందు ఇటుకలను నీటిలో నానబెట్టడం సాధారణంగా చేసే పనే. అయితే నాణ్యమైన ఇటుక తన పొడి బరువులో 20 శాతం కంటే ఎక్కువ నీటిని పీల్చుకోకూడదు. ఎక్కువ నీరు పీల్చుకుంటే సిమెంట్ మిశ్రమంలోని తేమను లాగేసుకుని గోడ బలాన్ని తగ్గిస్తుంది.

ఇంటి నిర్మాణం ప్రారంభించే ముందు సైట్‌కు వచ్చే ఇటుకల లోడులో కొన్నింటిని ఎంపిక చేసి ఈ ప్రాథమిక పరీక్షలు చేయడం ద్వారా నాసిరకం మెటీరియల్‌తో జరిగే నష్టాన్ని, ఆర్థిక మోసాలను ముందుగానే నివారించవచ్చు.

Follow Us