AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ముక్క ముట్టుకుంటే షాక్.. దసరా వేళ చుక్కలు చూపిస్తున్న మటన్ రేట్లు..

ముక్క లేనిదే ముద్ద దిగని నాన్ వెజ్ ప్రియులకు దసరా వేళ మటన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పండుగ పూట బంధుమిత్రులతో కలిసి విందు చేసుకుందామనుకున్న సామాన్యుడికి ఈసారి ధరల భారం గుదిబండలా మారింది. మార్కెట్లో కిలో మటన్ ధర ఏకంగా రూ.1200 దాటేయడంతో అసలు ఈ స్థాయిలో రేట్లు ఎందుకు పెరిగాయి? స్థానికంగా మేకలు, గొర్రెల కొరతకు కారణాలేంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: ముక్క ముట్టుకుంటే షాక్.. దసరా వేళ చుక్కలు చూపిస్తున్న మటన్ రేట్లు..
Karimnagar Mutton Rates Hit All Time High
G Sampath Kumar
| Edited By: |

Updated on: Oct 19, 2026 | 12:18 PM

Share

దసరా పండుగ వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మటన్ ధరలు భగ్గుమంటున్నాయి. పండుగ సంబరాల్లో భాగంగా ముక్క లేనిదే ముద్ద దిగని మాంసం ప్రియులకు పెరిగిన ధరలు తీవ్ర నిరాశను మిగులుస్తున్నాయి. మొన్నటి వరకు బహిరంగ మార్కెట్లో కిలో రూ.900 నుంచి రూ.1000 వరకు పలికిన పొట్టేలు మాంసం ధర, ఇప్పుడు ఏకంగా రూ.1100 నుంచి రూ.1200కు చేరింది. ఇక మేకపోతు మాంసం అయితే రికార్డు స్థాయిలో కిలో రూ.1400 వరకు పలుకుతోంది. స్థానికంగా గొర్రెలు, మేకల పెంపకం తగ్గిపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. తెలంగాణ సంస్కృతిలో దసరా పర్వదినానికి మాంసాహార విందులు ఎంతో ప్రత్యేకం. సాధారణ రోజుల కంటే దసరా నాడు, ఆయుధ పూజ సందర్భంగా మేకలు, పొట్టేళ్లకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లలో లైవ్ ధరలు దాదాపు 40 నుంచి 45 శాతం వరకు పెరిగాయి. గతంలో అందుబాటు ధరల్లో దొరికిన చిన్నపాటి గొర్రె కూడా ఇప్పుడు రూ.12,000 నుంచి రూ.14,000 తక్కువ పలకడం లేదు. దీంతో మధ్యతరగతి, పేద వర్గాలు పండుగ పూట మటన్ ముట్టుకోవాలంటేనే జంకే పరిస్థితి ఏర్పడింది.

స్థానిక పెంపకం కరువు.. తగ్గిన కాపరులు

ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పల్లెల్లో రైతులు, సాంప్రదాయ సామాజిక వర్గాలు పెద్ద సంఖ్యలో గొర్రెలు, మేకల మందలను పోషించేవారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక మేత భూములు ఉండటంతో జీవాల పెంపకం లాభసాటిగా సాగేది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో మైదాన ప్రాంతాలు తగ్గడం, సాగు విస్తరణతో మేత కొరత తీవ్రమవ్వడం పెద్ద సమస్యగా మారింది. మరోవైపు, కొత్త తరం యువత ఈ వృత్తిలోకి రాకపోవడంతో జీవాల సంఖ్య గణనీయంగా పడిపోయింది.

ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు..

స్థానికంగా సరిపడా జీవాలు లభ్యం కాకపోవడంతో వ్యాపారులు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా వంటి ప్రాంతాల వైపు చూడాల్సి వస్తుంది. అక్కడ కొనుగోలు ధర కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, దూరప్రాంతాల నుంచి తరలించేందుకు డీజిల్, ఇతర రవాణా ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ‘‘ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేసి తీసుకొస్తున్నాం. రవాణా ఖర్చులు తీసేస్తే మాకు కిలోపై రూ.50 లాభం కూడా మిగలడం లేదు’’ అని స్థానిక మాంసం వ్యాపారులు వాపోతున్నారు.

తగ్గిన కొనుగోళ్లు.. నిరాశలో వినియోగదారులు

ధరలు ఊహించని రీతిలో పెరిగిపోవడంతో వినియోగదారులు తమ కొనుగోలు మోతాదును తగ్గించుకుంటున్నారు. కిలో తీసుకునే వారు అరకిలోతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ప్రజలు అంటున్నారు. దసరా పండుగ వేళ కూడా ధరలు అదుపులోకి వచ్చే పరిస్థితులు కనిపించకపోవడంతో నాన్ వెజ్ ప్రియులు చికెన్ లేదా చేపల వైపు మొగ్గు చూపుతున్నారు. పండుగ పూట కూడా ముక్క ముట్టుకోలేని పరిస్థితి రావడంపై సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us