AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పండక్కి అక్కను తీసుకరావడానికి వెళ్లిన తమ్ముడు.. కలిసి ఇంటికెళ్లేలోపే గుండెల్ని పిండేసే విషాదం..

సద్దుల బతుకమ్మ సంబరాలతో కళకళలాడాల్సిన ఆ ఇంట్లో క్షణాల వ్యవధిలోనే తీరని శోకం అలుముకుంది. పండుగ పూట పుట్టింటికి చేరుకునేందుకు ఆశగా బయలుదేరిన ఓ అక్క, ఆమెను తీసుకొచ్చేందుకు వెళ్లిన తమ్ముడిని మార్గమధ్యలోనే మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. అసలు ఏం జరిగిందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: పండక్కి అక్కను తీసుకరావడానికి వెళ్లిన తమ్ముడు.. కలిసి ఇంటికెళ్లేలోపే గుండెల్ని పిండేసే విషాదం..
Hayathnagar Road Accident
Krishna S
|

Updated on: Oct 19, 2026 | 8:08 AM

Share

సద్దుల బతుకమ్మ సంబరాల్లో మునిగిపోవాల్సిన ఓ ఇంట్లో ఊహించని రోడ్డు ప్రమాదం తీవ్ర శోకాన్ని మిగిల్చింది. పుట్టింటికి చేరుకునే కొద్ది క్షణాల ముందే మృత్యువు కాటేయడంతో ఇద్దరు అక్కాతమ్ముళ్లు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటన హయత్‌నగర్ జాతీయ రహదారిపై వెలుగుచూసింది. శంషాబాద్ దొడ్డిసుల్తాన్‌పల్లికి చెందిన రేఖ (32) బతుకమ్మ పండుగ కోసం తన ఐదేళ్ల కూతురు చవిత్రతో కలిసి పెద్దఅంబర్‌పేట్‌లోని పుట్టింటికి బయలుదేరింది. బస్సులో ఎల్బీనగర్ చేరుకున్న ఆమెను పికప్ చేసుకునేందుకు, స్థానికంగా ఫొటోగ్రాఫర్‌గా పనిచేసే ఆమె తమ్ముడు నవీన్ (25) బైక్‌పై వెళ్లాడు. అక్కను, చిన్నారిని బైక్‌పై ఎక్కించుకుని ఇంటి బాట పట్టాడు.

కారు బీభత్సం.. డీసీఎం కిందకు దూసుకెళ్లిన బైక్

విజయవాడ-హైదరాబాద్ హైవే మీదుగా హయత్‌నగర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన ఓ కారు అదుపుతప్పి వీరి బైక్‌ను బలంగా గుద్దింది. దాంతో బైక్ అమాంతం ముందున్న డీసీఎం వాహనం కిందికి చొచ్చుకుపోయింది. రెండు వాహనాల మధ్య నలిగి గురై రేఖ, నవీన్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

చిన్నారి పరిస్థితి విషమం.. పరారైన డ్రైవర్

ప్రమాద ధాటికి దూరంగా ఎగిరిపడిన ఐదేళ్ల చవిత్ర తీవ్ర గాయాలతో బయటపడింది. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న పాపను స్థానికులు హుటాహుటిన సమీప ఆస్పత్రి చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియాకు పంపించారు. ప్రమాదానికి కారణమైన కారును అక్కడే వదిలేసి డ్రైవర్ పరారవగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు. చేతికందిన కొడుకు, కూతురు ఒకేసారి విగతజీవులుగా మారడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

Follow Us