AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టీమిండియాకు దొరికిన సరికొత్త ఆయుధం.. ఇక ప్రపంచ జట్లకు వణుకు పుట్టాల్సిందే..!

India vs West Indies: వెస్టిండీస్ సిరీస్‌లో టీమిండియాకు నమన్ ధీర్ రూపంలో ఓ అద్భుత ఆల్‌రౌండర్ దొరికాడు. బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించడంతో పాటు బౌలింగ్‌లోనూ కీలక వికెట్లు తీస్తూ ఆకట్టుకుంటున్నాడు. లోయర్ ఆర్డర్‌లో ఫినిషర్ కొరతను తీర్చగల సమర్థుడిగా ఎదుగుతున్న నమన్ ధీర్ భవిష్యత్‌లో టీమిండియాకు పెద్ద ఆస్తిగా మారతాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Team India: టీమిండియాకు దొరికిన సరికొత్త ఆయుధం.. ఇక ప్రపంచ జట్లకు వణుకు పుట్టాల్సిందే..!
Ind Vs Wi Naman Dhir
Venkata Chari
|

Updated on: Oct 19, 2026 | 8:00 AM

Share

India vs West Indies: భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన సిరీస్‌లు ముగిశాయి. మూడు వన్డేల సిరీస్‌ను భారత్ రెండు ఒకటితో గెలుచుకోగా, ఐదు టీ20ల సిరీస్ రెండు రెండుతో సమమైంది. ఈ సిరీస్‌ల సందర్భంగా టీమిండియాకు ఓ అద్భుతమైన ఆల్‌రౌండర్ రూపంలో ఊహించని బహుమతి లభించింది. అతడే 26 ఏళ్ల యువ సంచలనం నమన్ ధీర్. బ్యాటింగ్‌లో పవర్ హిట్టింగ్‌తో విధ్వంసం సృష్టిస్తూనే, బౌలింగ్‌లోనూ కీలక వికెట్లు తీస్తూ జట్టుకు తన విలువను చాటుకుంటున్నాడు. టీమిండియాలో కీలక ఆటగాడిగా మారిపోయే అన్ని లక్షణాలు ఇతనిలో కనిపిస్తున్నాయి. ఆడిన మ్యాచ్‌లు తక్కువైనా, తన సత్తాతో టాప్ క్లాస్ ఆటగాళ్లకు సైతం పోటీనిస్తున్నాడు.

నమన్ ధీర్ బ్యాటింగ్ పరాక్రమం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆఖరి టీ20లో స్పష్టంగా కనిపించింది. కేవలం తొమ్మిది ఓవర్ల మ్యాచ్‌లో, సీనియర్ బ్యాట్స్‌మన్ శివమ్ దూబే కంటే ముందే క్రీజ్‌లోకి వచ్చిన నమన్, ఎదుర్కొన్న తొలి బంతిని సిక్సర్‌గా మలిచి తన దూకుడును చాటాడు. కీమో పాల్, షమర్ స్ప్రింగర్ వంటి ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో కేవలం ఆరు బంతుల్లోనే మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో ఏకంగా 400 స్ట్రైక్ రేట్‌తో 24 పరుగులు చేసి అజయంగా నిలిచాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ప్రదర్శించిన ఈ పవర్ హిట్టింగ్ సామర్థ్యాన్ని నమన్ ధీర్ మరోసారి అంతర్జాతీయ వేదికపై రుజువు చేసుకున్నాడు.

ఎక్కువమంది చదివినది: తొలి రెండు బంతుల్లో రెండు వికెట్లు.. ప్రపంచ రికార్డ్ నే షేక్ చేసిన టీమిండియా నయా సెన్సేషన్..!

ఇవి కూడా చదవండి

అయితే, నమన్ ధీర్ కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో చివరి నిమిషంలో జట్టులోకి వచ్చినప్పటికీ, తన ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తోనూ అందరినీ ఆకట్టుకున్నాడు. వన్డే సిరీస్‌లో ఓవర్‌కు 6.30 రన్స్‌ మాత్రమే ఇచ్చి, కుల్దీప్ యాదవ్ తర్వాత అత్యంత ఉత్తమ ఎకానమీని సాధించాడు. టీ20 సిరీస్‌లో విండీస్ పవర్ హిట్టర్లు అతడి బౌలింగ్‌లో సిక్సర్లు బాదినప్పటికీ, తర్వాత బంతికే వికెట్ పడగొట్టే సంకల్పం, నైపుణ్యం అతని సొంతం. ఈ సిరీస్‌లో మొత్తం ఐదు వికెట్లు తీసి తన బౌలింగ్ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు.

సిక్స్ పడిన తర్వాత కూడా ఒత్తిడికి గురి కాకుండా, వెంటనే వికెట్ తీసే అతని దృఢమైన వైఖరిని విండీస్ హెడ్ కోచ్ డారెన్ సమీ సైతం ప్రత్యేకంగా ప్రశంసించాడు. నమన్ ధీర్ తన బౌలింగ్‌లోని వేగాన్ని మార్చుకోవడంలో గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ విండీస్ కుడిచేతి వాటం బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. ఐపీఎల్, దేశవాళి క్రికెట్‌లో ఎంతో శ్రమించి సాధించిన అనుభవం అతడి బౌలింగ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.

ఎక్కువమంది చదివినది: జస్ట్ 6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే.. యూవీ 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్..

ప్రస్తుతం భారత జట్టులో లోయర్ ఆర్డర్‌లో వేగంగా పరుగులు సాధించే ఫినిషర్ల కొరత స్పష్టంగా ఉంది. హార్దిక్ పాండ్య ఫిట్‌నెస్ సమస్యలు, శివమ్ దూబే, అక్షర్ పటేల్ ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడుతున్న తరుణంలో నమన్ ధీర్ ఆ స్థానానికి సరైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నాడు. పేస్, స్పిన్ రెండింటినీ సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు సాధించగల సత్తా నమన్‌కు సొంతం. తాను జెన్యూన్ ఆల్‌రౌండర్‌గా మారడమే లక్ష్యమని, అయితే బ్యాటింగ్‌కు మొదట ప్రాధాన్యత ఇస్తానని అతను స్పష్టం చేశాడు. ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్ రెండింటిలోనూ రాణిస్తున్న నమన్ ధీర్ రాబోయే రోజుల్లో టీమిండియాకు అత్యంత కీలకమైన ఆస్తిగా మారుతాడని క్రికెట్ విశ్లేషకులు బలంగా అంచనా వేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us