AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ్యాచ్ రద్దైనా, మాకో డేంజరస్ ఫినిషర్ దొరికాడు.. వాడి దూకుడు చూసి దడ పుట్టేసింది..!

Shreyas Iyer comments: ఐదో టీ20 వర్షం కారణంగా రద్దవ్వడంతో భారత్-వెస్టిండీస్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. ఈ సందర్భంగా శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, వర్షం లేకుంటే తాము 140 పరుగులు సాధించి సిరీస్ గెలిచేవాళ్లమని అన్నారు. నమందీర్ అద్భుత ప్రదర్శన, షాయి హోప్ బ్యాటింగ్ గురించి కూడా అయ్యర్ ప్రస్తావించారు.

మ్యాచ్ రద్దైనా, మాకో డేంజరస్ ఫినిషర్ దొరికాడు.. వాడి దూకుడు చూసి దడ పుట్టేసింది..!
Shreyas Iyer Comments
Venkata Chari
|

Updated on: Oct 18, 2026 | 4:40 PM

Share

Shreyas Iyer comments: భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో జరగాల్సిన ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. తొలుత రాత్రి 7:00 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌ను పదేపదే వర్షం అంతరాయం కలిగించడంతో తొమ్మిది ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. అభిషేక్ శర్మ త్వరగానే ఔటయ్యాడు. ఓవర్లు తక్కువగా ఉండడంతో మిగతా బ్యాటర్లు క్రీజ్‌లోకి వచ్చిన తర్వాత బ్యాట్ జులిపించేందుకు పెద్దగా సమయం తీసుకోలేదు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు. కేవలం 10 బంతుల్లోనే రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 30 పరుగులు చేసి అదరగొట్టాడు. సంజు సైతం ఏడు బంతుల్లో 16 పరుగులు చేయగా, శ్రేయస్ అయ్యర్ 14 బంతుల్లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఒకపక్క వికెట్లు పడుతున్నప్పటికీ, భారత బ్యాటర్లు మాత్రం ఎదురుదాడిని ఆపలేదు. ముఖ్యంగా నమందీర్ పెను విద్వంసం సృష్టించాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతినే స్టాండ్స్‌లోకి పంపించాడు. ఆ తర్వాత కూడా సిక్సర్ల వర్షం కురిపించాడు. దీంతో 7.4 ఓవర్లు ముగిసేసరికి ఆరు బంతులు ఎదుర్కొన్న నమందీర్ మూడు సిక్సర్లు, ఒక ఫోర్ బాది 400 స్ట్రైక్ రేట్‌తో 24 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సమయంలో మరోసారి వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు.

ఈ పరిణామాలపై శ్రేయస్ అయ్యర్ స్పందించారు. “ఒకవేళ వర్షం పడకుండా ఉండి ఉంటే మిగతా ఓవర్లు పూర్తి అయ్యేసరికి టీమ్ ఇండియా విండీస్ ముందు కనీసం 140 పరుగుల టార్గెట్ ఉంచేవాళ్లం. కచ్చితంగా తొమ్మిది ఓవర్లలో ఆ స్కోర్‌ను కాపాడుకునే అవకాశం ఉండేది” అని శ్రేయస్ అయ్యర్ అన్నారు. నమందీర్ ఆటతీరును చూస్తే, కచ్చితంగా మిగతా ఎనిమిది బంతుల్లో 140 పరుగుల టార్గెట్ ఉండేదేమో అని, ఆ టార్గెట్‌తో అయితే తాము కచ్చితంగా కాపాడుకునే వాళ్లం అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నారు. వర్షం కారణంగా ఫలితం తమ చేతుల్లో ఉండదని, అయితే ఈ సిరీస్‌లోని కొన్ని మ్యాచ్‌లలో భారత బౌలర్లు మెరుగ్గా రాణించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రత్యర్థి జట్టుకు క్రెడిట్ ఇవ్వాల్సిందేనని, ఆ జట్టు బ్యాటర్లు సిరీస్ అంతటా అద్భుతంగా ఆడారని అయ్యర్ అంగీకరించారు. ముఖ్యంగా షాయి హోప్ బ్యాటింగ్ రెండు టీ20 మ్యాచ్‌లను భారత్ నుంచి లాగేసిందని అయ్యర్ అన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా తమ దూకుడు ఆటను మాత్రం కొనసాగిస్తామని శ్రేయస్ స్పష్టం చేశాడు. ఈ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశికి అవకాశం దక్కకపోవడంపై కూడా శ్రేయస్ అయ్యర్ స్పందించారు. టీమ్ ఇండియాకు అద్భుతమైన ఓపెనర్లు ఉన్నందున వైభవ్ కాస్త ఓపికగా ఎదురుచూడక తప్పదని, అయితే అతనికి ఖచ్చితంగా అవకాశం వస్తుందని, ఓపికతో ఉండాల్సిన అవసరం ఉందని శ్రేయస్ చెప్పుకొచ్చారు. ఈ సిరీస్ ద్వారా తమకు మంచి ఆల్ రౌండర్ దొరికాడని, బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ నమందీర్ భవిష్యత్తు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడని అయ్యర్ ప్రశంసించారు. ఈ సిరీస్‌లో తన బ్యాట్ నుంచి పెద్దగా పరుగులు రాకపోయినప్పటికీ, రద్దైన ఐదో టీ20లో మాత్రం అతడు అదరగొట్టాడని, తాను ఎంత పవర్‌హిట్టరో మరోసారి నిరూపించాడని అయ్యర్ అన్నారు. ఆ స్థానంలో ఇలా బ్యాటింగ్ చేస్తే టీమ్ ఇండియాకు మంచి ఫినిషింగ్ లభిస్తుందని శ్రేయస్ వివరించారు.

Follow Us