Nagarjuna Sagar By Elections : సాగర్ లో కాంగ్రెస్ దూకుడు.. 27న జనగర్జన సభ, గులాబీ, కమలం అభ్యర్థులు వాళ్లేనా.?
Jana Reddy : గ్రేటర్ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీదాకా.. ఏ ఎలక్షన్ వర్కవుట్ కాకపోవటంతో సాగర్‌పై గురిపెట్టింది తెలంగాణ కాంగ్రెస్. ముందడుగేసి..
Jana Reddy : గ్రేటర్ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీదాకా.. ఏ ఎలక్షన్ వర్కవుట్ కాకపోవటంతో సాగర్‌పై గురిపెట్టింది తెలంగాణ కాంగ్రెస్. ముందడుగేసి బై ఎలక్షన్ ప్రచారం కూడా మొదలుపెట్టేశారు సీనియర్ నేత, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి. ఇంకా క్యాండేట్లను ప్రకటించని టీఆర్‌ఎస్, బీజేపీ తమదైన వ్యూహంతో ముందుకెళ్తుంటే, జానా మాత్రం రంగంలోకి దిగిపోయారు. దుబ్బాక నుంచి మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ దాకా తెలంగాణలో టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా పోరుసాగుతున్న వేళ, కాంగ్రెస్ ఇలా అయితే వ్యవహారం సాగదని పూర్తిగా డిసైడైపోయింది. ఎలాగైనా నాగార్జునసాగర్ బై ఎలక్షన్‌లోనైనా ట్రెండ్ మార్చాలనుకుంటోంది కాంగ్రెస్‌పార్టీ. అందుకే వ్యూహాత్మకంగా పార్టీ సీనియర్ నేత జానారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. మిగిలిన పార్టీలకంటే ఈ విషయంలో ముందుంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఉప ఎన్నిక జరుగుతున్న నాగార్జునసాగర్‌లో తనదైన స్టయిల్‌లో ప్రచారం చేస్తున్నారు జానారెడ్డి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా హాలియాలో ఈనెల 27న జనగర్జన సభ నిర్వహించబోతోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో అక్కడ కొందరు టీఆర్‌ఎస్ కార్యకర్తలకు కండువాకప్పి .. కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు జానా. తర్వాత కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తండాలకు కరెంట్‌నుంచి.. నియోజకవర్గానికి సాగు, తాగునీటిదాకా తన హయాంలోనే అభివృద్ధి జరిగిందని చెప్పారు. అంతేకాదు, నాగార్జునసాగర్ తీర్పు రాష్ట్రానికి మేలుకొలుపు కావాలంటున్నారు. నీతికి, నైతిక విలువలకు కట్టుబడి రాజకీయాలు చేస్తున్న తనకు మద్దతివ్వాలని కోరారు.
కాంగ్రెస్ ప్రచారంలో మునిగిపోతే…టీఆర్‌ఎస్, బీజేపీ నుంచి అభ్యర్థులెవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు. దుబ్బాక అనుభవంతో ఆచితూచి అడుగేస్తోంద అధికారపార్టీ. టీఆర్‌ఎస్ నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌ని బరిలోకి దించొచ్చనే ప్రచారం జరుగుతోంది. అదే సామాజికవర్గానికి చెందిన గురవయ్యయాదవ్, రంజిత్ యాదవ్‌ల పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అభ్యర్థినింకా ప్రకటించకపోయినా.. సిట్టింగ్ సీటుని ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండునెలలుగా సాగర్‌లో గ్రౌండ్ వర్క్ చేస్తోంది గులాబీపార్టీ.
అటు బీజేపీలోనూ సాగర్ టికెట్ కోసం పోటీ నడుస్తోంది. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన నివేదితారెడ్డి, ఈమధ్యే బీజేపీలో చేరిన అంజయ్యయాదవ్ ఇద్దరూ ఛాన్స్ తమకేదన్న ధీమాతో ప్రజల్లోకి వెళ్తున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు కూడా రేసులో ఉన్నారు. మొత్తానికి రేపోమాపో రెండు పార్టీల అభ్యర్థులు ప్రకటించగానే…సాగర్‌లో బైపోల్ ప్రచారం హోరెత్తబోతోంది.