గుర్తింపు మార్చుకుని.. కుటుంబాన్ని వదిలేసుకున్నాడు.. కట్ చేస్తే కటకటాల్లోకి..!
సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం చాలామంది తాపత్రయ పడుతుంటారు. తమ అసలైన గుర్తింపును మార్చుకోవడానికి ఇష్టపడరు. కానీ కొందరు మాత్రం శత్రువు సమాచారం కోసం విదేశాల్లో తమ గుర్తింపును మార్చుకొని గూఢచారులుగా పనిచేస్తూ ఉంటారు. మరికొందరు శత్రువుల దాడుల నుండి రక్షణ కోసం గుర్తింపును మార్చుకుని మారువేషంలో ఉంటారని సినిమాల్లో చూశాం.

సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం చాలామంది తాపత్రయ పడుతుంటారు. తమ అసలైన గుర్తింపును మార్చుకోవడానికి ఇష్టపడరు. కానీ కొందరు మాత్రం శత్రువు సమాచారం కోసం విదేశాల్లో తమ గుర్తింపును మార్చుకొని గూఢచారులుగా పనిచేస్తూ ఉంటారు. మరికొందరు శత్రువుల దాడుల నుండి రక్షణ కోసం గుర్తింపును మార్చుకుని మారువేషంలో ఉంటారని సినిమాల్లో చూశాం. ఓ కేసులో నిందితుడైన ఓ వ్యక్తి మాత్రం పోలీసులకు దొరకకుండా తన అసలైన గుర్తింపును పూర్తిగా మార్చుకున్నాడు. కొన్నేళ్లుగా తన స్వగ్రామం, కుటుంబ సభ్యుల నుండి సంబంధాలు తెంచుకుని దూరంగా జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆధునిక టెక్నాలజీ యుగంలో తమ గుర్తింపును మార్చుకుని బతకడం సాధ్యమేనా..? ఆ వ్యక్తి విషయంలో చివరికి ఏమైంది..? పోలీసులకు అతను చిక్కాడా..? తెలుసుకోవాలంటే ఏ స్టోరీ చదవాల్సిందే.!
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన బొడ్డు తిరుపతికి సోదరుడు, తల్లిదండ్రులు ఉన్నారు. తిరుపతి ఉపాధి కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు వెళ్ళాడు. స్థానికంగా ఓ థియేటర్ లో తిరుపతి పని చేసేవాడు. 2012లో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురం పోలీ్‌సస్టేషన పరిధిలో ఓ వ్యక్తిని హత్య చేశాడు. ఆ కేసుకు సంబంధించి తిరుపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2015లో రంగారెడ్డి జిల్లా మూడవ అదనపు సెషన్స కోర్టు తిరుపతికి జీవిత ఖైదు విధించింది. తిరుపతిని పోలీసులు చర్లపల్లి జైలుకు పంపించారు. జైలులో శిక్ష అనుభవిస్తూ సత్ ప్రవర్తన కలిగి ఉండడంతో 2017 ఆగస్టు 17న నెల రోజుల పెరోల్‌పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత తిరిగి జైలుకు వెళ్లకుండా ఆరేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడు.
గతం తాలూకు ఆధారాలను మార్చివేసి..
జైలు శిక్ష నుండి తప్పించుకునేందుకు తిరుపతి పథకం వేశాడు. తన వద్ద గతం తాలూకు ఎటువంటి ఆధారాలు లేకుండా గతాన్ని పూర్తిగా దాచి ఉంచి పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ప్రయత్నించాడు. పూర్తిగా తన పేరు, రూపం మార్చుకుని గుంటూరుకు చెందిన ఓ మహిళను వివాహం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. దీంతో తిరుపతి ఆచూకీ లభించక పోవడంతో చర్లపల్లి జైలు అధికారులు మఠంపల్లి పోలీసులకు గతేడాది ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తిరుపతి ఆచూకీ తెలుసుకోవడం మఠంపల్లి పోలీసులకు సవాల్‌గా మారింది. తిరుపతి తన అసలైన గుర్తింపును పూర్తిగా మార్చుకుని, తన కుటుంబ సభ్యులు, స్వగ్రామం నుంచి పూర్తిగా సంబంధాలు తెంచుకున్నాడు. గుంటూరులోని ఓ హోటల్‌లో పనిచేస్తూ ఓ మహిళను వివాహం చేసుకుని ఆమెతో కలిసి జీవనం సాగిస్తున్నాడు.
పట్టించిన ఆధార్ ముఖ కవళికలు…
గుంటూరులో తిరుపతి ఉంటున్నాడనే సమాచారం పోలీసులకు తెలిసింది. తన ఐడెంటిటీకి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకుండా చేయడంతో తిరుపతి ఐడెంటిటీలో పోలీసులు కన్ఫ్యూజన్‌లో పడ్డారు. కోదాడ డీఎస్పీ మామిళ్ల శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఐటీ విభాగం రంగంలోకి దిగింది. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఒకసారి ఆధార్ నమోదు చేసుకున్న వ్యక్తి.. వేషం, రూపు మార్చినా.. ముఖ కవళికలు, ఐరిస్, వేలిముద్రలతో ఎప్పుడైనా సదరు వ్యక్తిని గుర్తించవచ్చు. తిరుపతి మఠంపల్లిలో ఉన్నప్పుడు ఆధార్ లో నమోదు చేసుకున్న డేటాతో గుంటూరులో అనుమానిత వ్యక్తి ముఖ కవళికలు, వేలి ముద్రలు సరిపోయాయి. దీంతో నిందితుడు తిరుపతిగా నిర్ధారించుకున్న అనంతరం శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందం అక్కడికి వెళ్లి తిరుపతిని అరెస్ట్ చేశారు. ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ యుగంలో ఎంతటి నేరస్తులైన.. పోలీసులు, చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని జిల్లా ఎస్పీ నరసింహ చెబుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
