Telangana: ఆగమైపోతున్న చెరుకు రైతులు.. క్రషింగ్‌ చేసే సమయం దాటిపోతున్న తెరుచుకోని చెరకు ఫ్యాక్టరీ..

జహీరాబాద్‌ డివిజన్‌లో 22 వేల ఎకరాల్లో రైతులు చెరకు పంటను సాగు చేశారు. 8 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ట్రైడెంట్‌ కర్మాగారంలో క్రషింగ్‌ జరుగక పోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం పంటలో 7 లక్షల టన్నులను వివిధ ప్రాంతాల్లో కర్మాగారాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి సమీపంలోని గణపతి చక్కెర కర్మాగారానికి 4 లక్షల టన్నులు, కామారెడ్డి జిల్లా మాగిలోని గాయత్రి చక్కెర పరిశ్రమకు 3 లక్షల టన్నులను తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

Telangana: ఆగమైపోతున్న చెరుకు రైతులు.. క్రషింగ్‌ చేసే సమయం దాటిపోతున్న తెరుచుకోని చెరకు ఫ్యాక్టరీ..
Sugar Cane Farmers
Follow us
P Shivteja

| Edited By: Surya Kala

Updated on: Jan 02, 2024 | 12:43 PM

జహీరాబాద్‌ చెరకు రైతు ఆగమైతుపోతున్నాడు. పెద్ద పంట అని ఏడాది అంతా కష్టపడి చెరకు పండిస్తే అది పొలంలోనే చేదెక్కుతున్నది. మరో వైపు క్రషింగ్‌ చేసే సమయం దాటిపోతున్నా స్థానికంగా ఉన్న చెరకు ఫ్యాక్టరీ తెరుచుకోక పోవడంతో ఆందోళన చెందుతున్నారు చెరుకు రైతులు. జహీరాబాద్ నియోజకవర్గం చెరుకు పంటకు పెట్టింది పేరు. కానీ ప్రస్తుతం అక్కడ చెరుకు వేసిన రైతులు నానా కష్టాలు పడుతున్నారు.  స్థానికంగా ఉన్న ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు రైతులకు ఇవ్వాల్సిన పాత బకాయిలను ఇప్పటి వరకు చెల్లించక పోవడమే కాకుండా.. పంట చేతికి వచ్చిన కూడా ఇప్పటి వరకు క్రషింగ్‌ ప్రారంభం చేయక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు. అసలే పాత బకాయిలు రాక పెట్టుబడికి అప్పుల పాలైతే.. పంటను నరికి పదులు.. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్యాక్టరీలకు తరలించుకోవాలని అధికారులు సూచిస్తుండడంతో అ మాటలు విని కళ్లు తేలేస్తున్నాడు చెరుకు రైతన్న.

జహీరాబాద్‌ డివిజన్‌లో 22 వేల ఎకరాల్లో చెరుకు పంట సాగు కాగా.. దాదాపు 8 లక్షల టన్నుల చెరకు ఉత్పత్తి అవుతుంది అని అంచనా.. వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన జహీరాబాద్‌ ప్రాంతంలో చెరకు, అల్లం, బంగాళదుంప, అరటి, బొప్పాయి తదితర పంటల సాగు చేస్తుంటారు. వీటిలో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేసేది చెరకు పంట. వ్యయప్రయాసలు ఎక్కువైనా పెద్ద పంట అని, లాభాలు సాధించవచ్చనే నమ్మకంతో రైతులు తరతరాలుగా చెరకు వైపే మొగ్గుచూపుతున్నారు.

ఈ ప్రాంత భూములు చెరకు సాగుకు అనుకూలంగా ఉండడం మరో కారణం. డివిజన్‌లో ఏటా సగటున 25 వేల ఎకరాల్లో చెరకు పంట సాగు చేస్తుంటారు. కాగా ఈ ప్రాంతంలో యాభై ఏళ్ల క్రితమే చెరకు ఫ్యాక్టరీ ఏర్పాటు అయ్యింది. జహీరాబాద్ డివిజన్‌లో చెరకు పంట ఎక్కువగా సాగు చేస్తుండడంతో దివంగత నేత, మాజీ మంత్రి బాగారెడ్డి 1970లో నిజాం షుగర్స్‌ పేరిట మండలంలోని కొత్తూర్‌(బి) గ్రామంలో చక్కెర కర్మాగారం ఏర్పాటు చేయించారు. అప్పట్లో రోజుకు 1,500 టన్నుల క్రషింగ్‌ సామర్థ్యంతో ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. భారీ చక్కెర ఫ్యాక్టరీ ఏర్పాటు కావడంతో అప్పట్లో 5 వేల ఏకరాల్లో సాగు చేసే చెరకు పంట విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ 25 వేల ఎకరాలకు విస్తరించింది. ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన నిజాం షుగర్స్‌ను వివిధ కారణాలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారు. దీంతో ఫ్యాక్టరీ పేరు ‘ట్రైడెంట్‌’గా మరింది. పేరు మారినా కర్మాగారాన్ని కొనసాగించారు. జహీరాబాద్ నియోజక వర్గంలోని 30 గ్రామాల పరిధిలోని రైతులతో ముందుగానే ఒప్పందం చేసుకుని చెరకు పంటను కొనుగోలు చేసేవారు. మొదట్లో ప్రతీ సంవత్సరం 90 రోజులు.. ప్రతీరోజు 1,500 టన్నుల చొప్పున చెరకును గానుగ ఆడించేవారు. పంట విస్తీర్ణం పెరగడంతో క్రమంగా 150 రోజుల వరకు క్రషింగ్‌ చేయడం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

గతేడాది ఫ్యాక్టరీలో 3 లక్షల టన్నుల చెరకును క్రషింగ్‌ చేశారు. మిగిలిన పంటను రైతులు పొరుగునే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర పరిధిలో ఉన్న ఫ్యాక్టరీలకు తరలించి పొలాల్లో నుంచి రూపుచేసుకునేవారు. కాగా గత నాలుగైదేళ్లుగా ట్రైడెంట్‌ చక్కెర కర్మాగారం గాడి తప్పింది. చెరకు క్రషింగ్‌ జరుగుతున్నప్పటికీ రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. ట్రైడెంట్‌ యాజమాన్యం ఏటా రైతులకు రూ.80 కోట్లకు పైగా చెరకు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో పంటను ఫ్యాక్టరీకి తరలించిన తరువాత 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో బిల్లులను జమ చేసేవారు. నాలుగైదేళ్లుగా రైతులకు బిల్లులు సకాలంలో చెల్లించడం లేదు..రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తేనే యాజ మాన్యం విడతల వారీగా బిల్లులను చెల్లించే స్థితికి చేరుకున్నది.

గత రెండు మూడేళ్లుగా రాజకీయ నాయకులు,ఉన్నతాధికారులు, కలెక్టర్‌ పరిశ్రమ యాజమాన్యం పై ఒత్తిడి తీసుకువచ్చి బిల్లులు ఇప్పిస్తున్నారు. ఎంత ఒత్తిడి చేసినా విడతలవారీగా కొద్దికొద్దిగానే బిల్లులు చెల్లిస్తున్నది కంపెనీ యాజమాన్యం. ఈ ఏడాది పంటను విక్రయిస్తే మరుసటి ఏడాది పంట కోతల వరకు బిల్లు చెల్లిస్తూనే ఉన్నారు.

గత సీజన్‌లో జరిగిన పంటకు సంబంధించి ఈసారి రైతులకు రావాల్సిన రూ.80 కోట్లలో ఇప్పటి వరకు రూ.72 కోట్లను దశలవారీగా చెల్లించారు. ఇంకా రూ.8 కోట్లకు పైగా బిల్లులు ఇవ్వాల్సి ఉంది. పెండింగ్‌ బిల్లుల విషయమై అధికారులు యాజామాన్యంపై ఇప్పటికీ ఒత్తిడి తెస్తునే ఉన్నారు. నిబంధన ప్రకారం అధికారులు ఇప్పటి వరకు 6 నోటీసులను యాజమాన్యానికి అందజేశారు. 7వ నోటీసును కూడా అందజేసేందుకు సిద్ధమయ్యారు. రెవెన్యూ రికవరీ యాక్టును ప్రయోగించి కర్మాగారం ఆస్తులను వేలం వేసి బిల్లులను ఇప్పించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటివరకు అధికారులతో జరిగిన పలు సమావేశాల్లో ట్రైడెంట్‌ కంపెనీ యాజమాన్యం పెండింగ్‌ బిల్లులను పూర్తిగా చెల్లించి కర్మాగారాన్ని తిరిగి ప్రారంభిస్తామని చెబుతూ వస్తున్నది.

కానీ అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో ప్రారంభం కావాల్సిన క్రషింగ్‌ ఇప్పటివరకు మొదలుకాలేదు. డిసెంబరు పూర్తి అయిన కూడా బిల్లులే ఇంకా చెల్లించక పోవడంతో రైతుల నమ్మకం సడలిపోతున్నది. చెరకు పంటను 8 నుంచి 10 నెలల మధ్యలో క్రషింగ్‌ చేస్తునే ఆశించిన దిగుబడి వస్తుంది. 10 నెలలు దాటితే చెరకు బెండుగా మారుతుంది. నాణ్యత, బరువు తగ్గిపోతుంది. ఈసారి పంట వేసుకుని ఏడాదికి దగ్గర వస్తుండడంతో దిగుబడి, నాణ్యత కోల్పోతున్నది. ట్రైడెంట్‌ కర్మాగారం తెరుచుకోక పోవడంతో కళ్ల ఎదుటనే పంట పాడవుతుంటే రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. చేతికొచ్చిన పంటను పొలాల్లో నుంచి ఎలాగైనా తరలించి రూపుచేసుకోవాలనే ఆరాటంతో జహీరాబాద్‌కు పొరుగునే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర పరిధిలోని కర్మాగారాలకు తరలిస్తున్నారు. తక్కువ ధరకైనా అమ్మేసు కుంటున్నారు.

ఈ ఏడాది జహీరాబాద్‌ డివిజన్‌లో 22 వేల ఎకరాల్లో రైతులు చెరకు పంటను సాగు చేశారు. 8 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ట్రైడెంట్‌ కర్మాగారంలో క్రషింగ్‌ జరుగక పోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం పంటలో 7 లక్షల టన్నులను వివిధ ప్రాంతాల్లో కర్మాగారాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి సమీపంలోని గణపతి చక్కెర కర్మాగారానికి 4 లక్షల టన్నులు, కామారెడ్డి జిల్లా మాగిలోని గాయత్రి చక్కెర పరిశ్రమకు 3 లక్షల టన్నులను తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

మిగిలిన లక్ష టన్నుల చెరకును రైతులు విత్తనం కోసం వాడుకుంటారని తెలుస్తుంది. స్థానికంగా ఉన్న ట్రైడెంట్‌ ఫ్యాక్టరీ తెరుచుకోకపోవడంతో ఇతర చోట్లకు చెరకును తరలించాలని అధికారులు సూచిస్తున్న అందుకు విపరీతంగా ఖర్చవుతుందని రైతులు పేర్కొంటున్నారు. చెరకు పంట సగటున ఎకరాకు 30-40 టన్నుల దిగుబడి వచ్చి, సకాలంలో క్రషింగ్‌కు తరలిస్తేనే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. ఖర్చులు పోనూ టన్నుకు రూ.1,800 వరకు లాభం వస్తుంది. ఈసారి కాలం మించిపోవడంతో దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం సూచించిన గణపతి ఫ్యాక్టరీ జహీరాబాద్‌ నుంచి 60 కిలోమీటర్లు, గాయత్రీ షుగర్స్‌ 100 కిలో మీటర్లకు పైగా దూరంలో ఉంటుంది. అంతదూరం తరలిస్తే కోత, రవాణా ఖర్చులు పోనూ పెట్టుబడి ఖర్చులైనా తిరిగి వచ్చే పరిస్థితి ఉండదని రైతులు పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..