Telangana: ఫ్రెషర్స్ డే పార్టీ కోసం ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్.. నవోదయ విద్యార్థి మృతి.. మరో ఇద్దరికి..
Student electrocuted at Navodaya School: తెల్లారితే ఫ్రెషర్స్ డే పార్టీ.. విద్యార్థులంతా సందడిగా ఉన్నారు.. ఫ్రేషర్స్ డే కోసం ఓ ఫ్లెక్సీని సైతం తీసుకువచ్చారు.. దానిని ఏర్పాటు చేస్తుండగా.. మృత్యువు కరెంట్ రూపంలో ఒక్కసారిగా కబళించింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగా.. ఒకరు మరణించారు.

Student electrocuted at Navodaya School: తెల్లారితే ఫ్రెషర్స్ డే పార్టీ.. విద్యార్థులంతా సందడిగా ఉన్నారు.. ఫ్రేషర్స్ డే కోసం ఓ ఫ్లెక్సీని సైతం తీసుకువచ్చారు.. దానిని ఏర్పాటు చేస్తుండగా.. మృత్యువు కరెంట్ రూపంలో ఒక్కసారిగా కబళించింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగా.. ఒకరు మరణించారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో చోటుచేసుకుంది. విద్యాలయంలో ఫ్రెషర్స్ డే ఏర్పాటు కోసం ఫ్లెక్సీ కడుతుండగా ముగ్గురు విద్యార్థులు విద్యుత్ షాక్ కు గురయ్యారని అధికారులు తెలిపారు. విద్యార్థులను వెంటనే ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ షాక్ కు గురైన దుర్గా నాగేందర్ (16) అనే విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. మృతి చెందిన విద్యార్థి స్వగ్రామం కూసుమంచి మండలం కోఖ్యాతండా అని పోలీసులు తెలిపారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా 11 కెవి విద్యుత్ వైర్ తగలడంతో ఈ ప్రమాదం జరిగింది.
విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు విద్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. విద్యార్థులతో పని చేయించిన ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. ప్రిన్సిపాల్ బయటకు రాకపోవడంతో ఆగ్రహించిన విద్యార్ధి తల్లిదండ్రులు, బంధువులు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు విద్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని అక్కడే బైఠాయించారు.
ఇదిలాఉంటే.. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఆందోళన చేపట్టారు. అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో పోలీసులు, విద్యార్థి సంఘాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో నవోదయ విద్యాలయంలో విషాదఛాయలు అలుముకున్నాయి.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..