AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Assembly: మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. వ్యూహప్రతివ్యూహాల్లో అధికార, ప్రతిపక్షాలు..

Telangana Assembly Session: డెవలెప్‌మెంట్‌ స్లోగన్‌తో బరిలోకి బీఆర్ఎస్‌.. బోలెడన్ని సమస్యల చిట్టాతో విపక్షాలు.. గట్టిగా గళం విప్పాలని ఫిక్స్‌ బీజేపీ.. ఎవరికి వారే రెడీ.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి సమావేశాలు కావడంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రధానంగా అధికార పార్టీకి ఈ సమావేశాలు కీలంకగా మారాయి. దూకుడు మీదున్న బీజేపీ కూడా గట్టిగా గళం విప్పాలని ఫిక్స్‌ అవడంతో అసెంబ్లీ సమావేశాలు ఈ సారి మరింత హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

Telangana Assembly: మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. వ్యూహప్రతివ్యూహాల్లో అధికార, ప్రతిపక్షాలు..
Telangana Assembly Session
Sanjay Kasula
|

Updated on: Aug 03, 2023 | 8:51 AM

Share

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవాళ ఉదయం పదకొండున్నర గంటలకు ప్రారంభం కానున్నాయి. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కానున్నాయి. నవంబరు, డిసెంబర్‌లలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో అధికార, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అయితే.. ఎన్నికల ముందు జరుగుతున్న చివరి సమావేశాలు కావడంతో అనేక సవాళ్లు ఫేస్ కాబోతున్నాయి. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి బీఆర్ఎస్.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు.. ఇలా ఎవరి ప్లాన్‌లో వాళ్ళు సిద్ధమవుతుండడంతో ఈసారి అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాల ప్రచారానికి అసెంబ్లీని వేదికగా చేసుకోవాలని అధికార బీఆర్ఎస్‌ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులు సమాచార సేకరణ చేశారు. అసెంబ్లీ సమావేశాలు టార్గెట్‌గానే వీఆర్ఎస్‌ల రెగ్యులరైజేషన్‌, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, మెట్రో విస్తరణ, రైతు రుణమాఫీ లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అయితే.. విపక్షాల ఆరోపణలు, విమర్శలకు టీసర్కార్‌ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తెలంగాణ కన్నా మహారాష్ట్ర రాజకీయాలపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టడంతో.. విపక్షాల విమర్శలపై ఇన్ని రోజులు రియాక్ట్‌ కాలేదు. చాలా సమస్యలకు ప్రభుత్వం నుంచి స్పందన కూడా రాలేదు. ఇప్పుడు.. వాటన్నింటికీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సి ఉంది. ధరణి సమస్యలు, 24 గంటల ఉచిత వ్యవసాయ కరెంట్, టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ ఇష్యూ, డబుల్‌ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ, దళితబంధు అమలుపై తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుందన్నది ఆసక్తి రేపుతోంది. అలాగే.. సొంత జాగాలో ఇంటి నిర్మాణానికి 3 లక్షలు ఇస్తామని చెప్పి.. ఇప్పటివరకు అప్లికేషన్లు తీసుకోలేదు. బీసీలకు లక్ష రూపాయల పథకం 14 కులాలకే పరిమితం చేసింది ప్రభుత్వం. ఆయా పథకాలపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అటు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా విపక్షాలు అసెంబ్లీలో లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది.

ఇదిలావుంటే.. అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు గళం విప్పేందుకు రెడీ అయ్యారు. ఆ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉండగా.. గోషామహల్ శాసనసభ్యులు రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్‌ కొనసాగుతోంది. మిగతా సభ్యులంతా టీ.బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డితో సమావేశమై.. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రజా సమస్యలను ప్రస్తావించి అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టాలని నిర్ణయించారు. అటు.. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలను సీఎం కేసీఆర్ కనీసం పరిశీలించకుండా మహారాష్ట్రలో పర్యటించడంపైనా ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే.. అసెంబ్లీలో అధికార పక్షాన్ని నిలదీసేందుకు కమలనాథులు భారీ ప్రశ్నావళిని సిద్ధం చేసుకున్నప్పటికీ.. అసలు మాట్లాడటానికి చాన్స్‌ వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా.. ఎన్నికల టైమ్‌ కావడంతో ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ రాజకీయాలకు వేదిక కానున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం