AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

27 సార్లు కత్తితో పొడిచి.. కక్షతోనే ప్రిన్సిపల్‌ను హత్య చేసిన 10th విద్యార్ధులు!

చదువుకోవాల్సిన వయసులో జల్సాలు, వ్యసనాలకు అలవాటు పడిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులు.. తమను మందలించారన్న కక్షతో స్కూల్‌ ప్రిన్సిపల్‌ను హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించింది. కొండమల్లేపల్లిలోని నాగార్జున గ్రామర్‌ కాన్సెప్ట్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కల్లు రూపారెడ్డి (48) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎనిమిది రోజుల్లో ఛేదించారు. ఈ కేసు వివరాలను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ బుధవారం మీడియాకు వెల్లడించారు..

27 సార్లు కత్తితో పొడిచి.. కక్షతోనే ప్రిన్సిపల్‌ను హత్య చేసిన 10th విద్యార్ధులు!
Nalgonda School Principal Murder Case
Srilakshmi C
|

Updated on: Aug 20, 2026 | 7:05 AM

Share

నల్గొండ, ఆగస్ట్‌ 20: కొండమల్లేపల్లి మండలంలోని ఫూల్సింగ్‌ తండా, పిల్యాతండాలకు చెందిన ఇద్దరు 16 ఏళ్ల విద్యార్థులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఇద్దరూ స్నేహితులు. రూపారెడ్డి ప్రిన్సిపల్‌గా ఉన్న స్కూల్‌లో వీళ్లిద్దరూ పదో తరగతి చదువుతూ అక్కడి హాస్టల్‌లో ఉండేవారు. విద్యార్థులు సిగరెట్లు, మద్యం వంటి వ్యసనాలకు అలవాటు పడటాన్ని ప్రిన్సిపల్‌ గుర్తించారు. గతంలో వారి వద్ద డబ్బు, సెల్‌ఫోన్‌ దొరకడంతో తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో మందలించారు. ఒక విద్యార్థిని హాస్టల్‌ నుంచి డేస్కాలర్‌గా కూడా మార్చారు. దీంతో ప్రిన్సిపల్‌పై విద్యార్థులు కక్ష పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. జల్సాలకు అలవాటుపడిన విద్యార్థులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ప్రిన్సిపల్‌ ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. స్కూల్‌లో ఫీజుల వసూళ్లు జరుగుతున్నందున ఆమె ఇంట్లో భారీగా నగదు ఉంటుందని భావించారు. ఘటనకు ఐదు రోజుల ముందే ప్రణాళిక రూపొందించి.. ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించారు. సామాజిక మాధ్యమాల్లో సులభంగా డబ్బు సంపాదించడం, హత్య ఎలా చేయాలి, నేరం చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలనే అంశాలను కూడా నిందితులు శోధించినట్లు పోలీసులు గుర్తించారు.

ఇలా హత్య..!

ఆగస్ట్ 11న సాయంత్రం ఇద్దరు విద్యార్థులు ప్రిన్సిపల్‌ ఇంటి వద్దకు చేరుకున్నారు. ముందుగా కొనుగోలు చేసిన హుడీ, టీషర్టు, ప్యాంటు, మాస్కులు, గ్లౌజులు తీసుకొచ్చారు. అనంతరం కత్తిని కొనుగోలు చేశారు. ఒక విద్యార్థి ఇంటి సమీపంలోని నీటి ట్యాంకు వద్ద కాపలాగా ఉండగా.. మరో విద్యార్థి ఇంటి వెనుక నుంచి గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. వంటగది ద్వారా ఇంట్లోకి వెళ్లిన అతడిని రూపారెడ్డి గుర్తించారు. దీంతో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. ఆమెను 27 సార్లు కత్తితో పొడిచాడు. అనంతరం బెడ్‌రూమ్‌లో ఉన్న సుమారు రూ.2.50 లక్షల నగదును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. రూపారెడ్డి సెల్‌ఫోన్‌ను స్విచాఫ్‌ చేసి ఇంటి సమీపంలోని బండరాయి కింద పెట్టారు. హత్యకు ఉపయోగించిన దుస్తులను కూడా అక్కడి నుంచి తీసుకెళ్లి డ్రైనేజీలో పడేశారు.

‘బాబు’ అనే చివరి మాటతో కీలక క్లూ

హత్యకు ముందు రూపారెడ్డి తన పిన్నితో ఫోన్‌లో మాట్లాడారు. సంభాషణలో చివరిగా ఆమె ‘బాబు’ అనే పదాన్ని పలికినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఫోన్‌ స్విచాఫ్‌ అయింది. ఈ ఒక్క క్లూను ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ‘బాబు’ అని ఆమె ఎవరిని ఉద్దేశించి మాట్లాడారనే కోణంలో పాఠశాలలో విచారణ చేపట్టారు. స్కూల్‌ తిరిగి తెరిచిన తర్వాత గైర్హాజరైన 13 మంది విద్యార్థుల గురించి ఆరా తీశారు. వారిలో ఐదుగురు పదో తరగతి విద్యార్థులు ఉండగా.. ఇద్దరు విద్యార్థులు అకస్మాత్తుగా డబ్బు ఖర్చు చేస్తూ జల్సాలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సుమారు 70 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, 80 మందిని విచారించారు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారించగా కేసు కొలిక్కి వచ్చింది. నిందితుల్లో ఒకరి వద్ద రూ.1.54 లక్షల నగదు, ఖరీదైన ఐఫోన్‌ ఉన్నట్లు గుర్తించారు. నగదు ఎక్కడిదని ప్రశ్నించగా తొలుత తల్లిదండ్రులు ఇచ్చారని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే నోట్లపై రక్తపు మరకలు కనిపించడంతో వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. అవి మనిషి రక్తపు మరకలేనని తేలడంతో విద్యార్థులను మరింత లోతుగా విచారించగా ప్రిన్సిపల్‌ హత్య, నగదు చోరీ విషయాలు బయటపడ్డాయి. పోలీసులు నిందితుల నుంచి రూ.1.54 లక్షల నగదు, ప్రిన్సిపల్‌ ఐఫోన్‌, ఆమె సెల్‌ఫోన్‌, హత్యకు ఉపయోగించిన కత్తి, గ్లౌజులు, మాస్కులు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ మైనర్లు కావడంతో వారిని జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ఎదుట హాజరుపరచనున్నట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ తెలిపారు. కేసులో ఇతర అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.

Follow Us