కాకినాడ AE కేసులో బిగ్ ట్విస్ట్.. 45 రోజుల క్రితమే భర్తకు విషం ఇచ్చి చంపాడంటూ సౌజన్య లేఖ
సాధిక్ ఖాన్ వేధింపులు తాళలేక నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 45 రోజుల క్రితం మృతి చెందిన నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డికి విషప్రయోగం జరిగిందంటూ భార్య సౌజన్య రాసిన లేఖ తాజాగా బయటపడింది. నూకరాజు మరణ వాంగ్మూలం, పదేళ్ల కార్తికేయరెడ్డి ఇచ్చిన సమాచారం, సౌజన్య లేఖతో సాధిక్ ఖాన్‌పై ఆరోపణలు మరింత తీవ్రంగా మారాయి..

కాకినాడ, ఆగస్ట్ 19: కాకినాడ రైఫిల్ షూటింగ్ శిక్షకుడు సాధిక్ ఖాన్ వేధింపులు తాళలేక పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు 45 రోజుల క్రితం నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడని అందరూ భావించినప్పటికీ దీని వెనుక అసలు కారణం బట్టబయలైంది. నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డిపై విష ప్రయోగం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తన భర్త జగదీశ్వరరెడ్డికి నిందితుడు సాధిక్ విషం ఇచ్చి హత్య చేశాడని ఆరోపిస్తూ ఆయన భార్య సౌజన్య రాసిన లేఖ పోలీసులకు లభించింది. దీంతో జగదీశ్వరరెడ్డి మృతికి అసలు కారణమేంటన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నూకరాజు రాసినట్లు చెబుతున్న మరణ వాంగ్మూలం, ప్రాణాలతో బయటపడిన పదేళ్ల కార్తికేయరెడ్డి ఇచ్చిన సమాచారం, సౌజన్య లేఖ కీలక ఆధారాలుగా మారాయి. సౌజన్య లేఖతో పాటు ఇతర వివరాలు వెలుగులోకి రావడంతో రాజమహేంద్రవరం రెండో పట్టణ పోలీసులు కాకినాడ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు సాధిక్ నివాసానికి వెళ్లగా అప్పటికే అతను అక్కడి నుంచి పరారైనట్లు గుర్తించారు. దీంతో నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రశాంతమైన కుటుంబంలో సాధిక్ ఖాన్ కల్లోలం
ఏఈ నూకరాజు అందరితో సౌమ్యంగా ఉండే వ్యక్తిగా స్థానికులు చెబుతున్నారు. భార్య మీనా, కుమారుడు, కుమార్తె సౌజన్య, అల్లుడు, మనుమడు కార్తికేయరెడ్డితో ఆయన కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగేది. అయితే వీరి జీవితాల్లో సాధిక్ కల్లోలం సృష్టించడంతో వరుస విషాదాలు ఆ కుటుంబాన్ని కకావికలం చేశాయి. గతంలో నూకరాజు కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఏడాది జులై 2న అల్లుడు జగదీశ్వరరెడ్డి మృతి కూడా చెందారు. సాధిక్ వేధింపుల కారణంగా ఇప్పుడు నూకరాజు కుటుంబం మొత్తం గోదావరిలోకి దూకింది. ఈ ఘటనలో పదేళ్ల కార్తికేయరెడ్డి ప్రాణాలతో బయటపడగా.. నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. నూకరాజు మృతదేహం మంగళవారం లభ్యమవగా.. భార్య మీనా, కుమార్తె సౌజన్య మృతదేహాల కోసం మంగళవారం విస్తృతంగా గాలించినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు, మత్స్యకారులు, అగ్నిమాపక సిబ్బంది నదిలో గాలింపు చేపడుతున్నారు. మరోవైపు పోలీసులు డ్రోన్ల సాయంతోనూ నదీ పరివాహక ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు.




