ఏసీబీ చరిత్రలో అతి పెద్ద అవినీతి తిమింగలం.. రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన అధికారిణి
తెలంగాణ ఏసీబీ చరిత్రలో అతి పెద్ద అవినీతి కేసు వెలుగులోకి వచ్చింది. మెహదీపట్నం జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ సునీత నిర్మాణ అనుమతుల కోసం రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించి ఆమెను అరెస్టు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం డిమాండ్ చేస్తే ఏసీబీని సంప్రదించాలని అధికారులు సూచించారు.

హైదరాబాద్: మెహదీపట్నం GHMC కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ సునీత రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది. నిర్మాణ అనుమతులు, క్లియరెన్స్‌కు సంబంధించిన వ్యవహారంలో లంచం డిమాండ్ చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఏసీబీ అధికారులు పక్కా ఫ్లాన్‌తో వల పన్ని పట్టుకున్నారు.
ఓ నిర్మాణ భవనానికి సంబంధించిన అనుమతుల విషయంలో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ సునీత రూ.8 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. అందులో భాగంగా మొదటి విడతగా రూ.4 లక్షలు తీసుకుంటుండగా ACB అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. లంచం మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సునీతను అదుపులోకి తీసుకున్న అనంతరం మెహదీపట్నం GHMC కార్యాలయంలో ACB అధికారులు సోదాలు నిర్వహించారు. సంబంధిత ఫైళ్లు, పత్రాలు, రికార్డులను పరిశీలించిన అధికారులు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
లంచం డిమాండ్‌కు సంబంధించి మరిన్ని ఆధారాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, తదుపరి న్యాయపరమైన చర్యలపై ACB అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక పని కోసం ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ACBని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. లంచం ఆరోపణలకు సంబంధించి తుది నిర్ధారణ దర్యాప్తు, న్యాయ ప్రక్రియ అనంతరం వెలువడుతుంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
