SSC Paper Leak Case: డిబార్ అయిన పదో తరగతి విద్యార్థికి హైకోర్టులో ఊరట.. పరీక్షలు రాసేందుకు గ్రీన్ సిగ్నల్..
ఎస్‌ఎస్‌సీ హిందీ పేపర్ లీక్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి హరీశ్‌కి... భారీ ఊరట దక్కింది. అతణ్ని పరీక్షలు రాసేందుకు అనుమతించాలని అధికారులను ఆదేశించింది తెలంగాణ హైకోర్టు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఎస్‌ఎస్‌సీ హిందీ పరీక్ష పేపర్ లీకేజ్ ఇష్యూలో.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. కమలాపూర్ బాయ్స్ హై స్కూల్‌లో పదోతరగతి విద్యార్థి హరీశ్ నుంచే పేపర్ లీకైనట్టు నిర్ధారించిన అధికారులు… అతణ్ని ఐదేళ్లపాటు డిబార్ చేశారు. అయితే, అధికారుల నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించిన హరీశ్‌కు భారీ ఊరట లభించింది. మిగితా పరీక్షలు రాసేందుకు అనుమతి ఇచ్చింది. ఇంగ్లీష్ పరీక్ష రాసేందుకు సెంటర్‌కు వచ్చిన హరీశ్‌ను .. అధికారులు వెనక్కి పంపించేశారు. దీంతో, ఈ వ్యవహారంలో కోర్టును ఆశ్రయించారు హరీశ్ తల్లిదండ్రులు. తాను ఏ తప్పూ చేయలేదని, అయిదేళ్ల పాటు డిబార్ చేయడం అన్యాయమని బాధిత విద్యార్థి .. కోర్టుకు విన్నవించుకున్నాడు. హాల్‌టికెట్ లాగేసుకుని.. ఓ పేపర్‌పై అధికారులు తన సంతకం తీసుకున్నారని చెప్పాడు. తన కుమారుణ్ని బెదిరించి శివకృష్ణ కొశ్చన్ పేపర్‌ను ఫొటో తీసుకన్నాడనీ.. కోర్టుకు తెలిపారు హరీశ్ తండ్రి. తమ కొడుకు భవిష్యత్తును కాపాడాలని కోర్టును విజ్ఞప్తి చేశారు హరీశ్ తల్లిదండ్రులు.
హౌజ్ మోషన్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. హరీశ్‌ను సోమవారం నుంచి పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతివ్వాలని విద్యాశాఖను ఆదేశించింది. మరి, కోర్టు ఉత్తర్వులను విద్యాశాఖ పాటిస్తుందా..? లేదా? అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఈ పేపర్ లీక్ అంశం రాజకీయ దుమారం రేపుతున్న వేళ.. కోర్టు ఆదేశాలు కీలకంగా మారాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..