AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రాంతీయం మొదలు.. జాతీయం వరకు.. అలర్ట్‌ అలర్ట్‌.. ఆపరేషన్‌ కోవర్ట్‌!

రాజకీయాల్లో గెలవాలన్నా.. గెలిచి నిలవాలన్నా... ఎత్తులకు పైఎత్తులు వేయడం వచ్చుండాలి. తమ బలాన్ని నమ్ముకోవడం ఒకెత్తయితే.. ఎదుటివారి బలహీనతల్ని పసిగట్టడం, అవతలివైపు లోగుట్టును ఎప్పటికప్పుడు తెలుసుకోవడం.. మరో బలమైన ఎత్తు. సమకాలీన రాజకీయాల్లో.. అన్ని రాజకీయ పార్టీలూ ఇప్పుడ రెండో ఎత్తుగడమీదే ఎక్కువ ఆధారపడుతున్నట్టు కనిపిస్తోంది.

ప్రాంతీయం మొదలు.. జాతీయం వరకు..  అలర్ట్‌ అలర్ట్‌.. ఆపరేషన్‌ కోవర్ట్‌!
Brs Congress Bjp
Balaraju Goud
|

Updated on: Jun 07, 2025 | 3:19 PM

Share

రాజకీయాల్లో గెలవాలన్నా.. గెలిచి నిలవాలన్నా… ఎత్తులకు పైఎత్తులు వేయడం వచ్చుండాలి. తమ బలాన్ని నమ్ముకోవడం ఒకెత్తయితే.. ఎదుటివారి బలహీనతల్ని పసిగట్టడం, అవతలివైపు లోగుట్టును ఎప్పటికప్పుడు తెలుసుకోవడం.. మరో బలమైన ఎత్తు. సమకాలీన రాజకీయాల్లో.. అన్ని రాజకీయ పార్టీలూ ఇప్పుడ రెండో ఎత్తుగడమీదే ఎక్కువ ఆధారపడుతున్నట్టు కనిపిస్తోంది. గల్లీ నుంచి ఢిల్లీ పాలిటిక్స్‌ వరకు.. ప్రధాన పార్టీలను కలవరపెడుతున్న అంశం కూడా అదే. ఇంతకీ, ఆ ముచ్చటేంటి? ఆ కలవరానికి కారణమేంటి?

తెలుగు రాజకీయాల్లో.. ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది. ఏ పార్టీలో ఎవరి కోవర్టులు ఉన్నారో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొనడమే దీనికి ప్రధానంగా కారణంగా తెలుస్తోంది. చిన్నచితక నాయకులు మాట్లాడేదైతే మరేమంత సీరియస్‌ ఇష్యూగా పరిగణించాల్సిన అవసరం ఉండేది కాదేమో. రాహుల్‌ గాంధీ నుంచి.. చంద్రబాబు, కేటీఆర్‌లవరకు… బడానేతలు ఈ విషయాన్ని నొక్కి వక్కాణించడమే ఈ స్థాయి చర్చకు దారితీస్తోంది. చర్చకు సంగతి పక్కనపెడితే.. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీల వరకు… ప్రతిఒక్క పక్షాన్ని కోవర్టుల సమస్య ఇబ్బంది పెడుతోందనేది మాత్రం స్పష్టమవుతోంది. అయితే, ఏ పార్టీలో ఎవరికెవరు కోవర్టులుగా పనిచేస్తున్నారని తెలుసుకోవడమే ఇప్పుడు సవాలుగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు… పార్టీలో కోవర్టులపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. హత్యా రాజకీయాల్లో తలపండిన వైసీపీ నాయకులు కొందరు కోవర్టుల్ని తెదేపాలోకి పంపి వారి ఎజెండాను నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారంటూ బాంబు పేల్చారు. సంతనూతలపాడులో టీడీపీ నేత వీరయ్య చౌదరి, మాచర్లలో మరో ఇద్దరు కార్యకర్తల హత్యలతో.. తనకు అదే అనుమానం కలుగుతోందన్నారు చంద్రబాబు. అలాంటివారిని ఉపేక్షిస్తే మన వేలితో మన కన్ను పొడుచుకున్నట్టేనంటూ.. కార్యకర్తల్ని హెచ్చరించారు.

పదేళ్ల పాటు అధికారం చెలాయించిన బీఆర్ఎస్‌‌ను కూడా ఇప్పుడు కోవర్టుల భయం వెంటాడుతోంది. ఇటీవల కేసీఆర్‌కు కవిత రాసిన అంతర్గత లేఖ.. బయటకు లీకవడంతోనే కోవర్టుల ముచ్చట తెరమీదకు వచ్చింది. అంతర్గత విషయం బయటకెలా వచ్చిందో తేల్చాలని కవిత డిమాండ్‌ చేయగా … పార్టీలో సీఎం రేవంత్​రెడ్డి కోవర్టులు ఉన్నారంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టైమొచ్చినప్పుడు ఆ కోవర్టులు వాళ్లంతట వాళ్లే బయటపడ్తారంటూ… ఇండైరెక్టుగా గట్టి వార్నింగే ఇచ్చారు. ఆలోపు ఇంకెన్ని బీఆర్‌ఎస్‌ సీక్రెట్స్‌ బయటకు వస్తాయో తెలియదు.

కేటీఆర్‌ చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోలేదు. ప్రతీ పార్టీలోనూ కోవర్టులు ఉంటారు. అక్కడి అంతర్గత విషయాలను.. తమ బాసులకు చేరవేస్తుంటారు. అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో సైతం.. బీఆర్‌ఎస్‌కు, బీజేపీకి కోవర్టులుగా పనిచేస్తున్నవారు ఉన్నారనే ప్రచారం చాలారోజులుగానే ఉంది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా… వరంగల్‌ సభలో ఏకంగా రాహుల్‌గాంధీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. అలాంటి వారు ఎవరైనా, ఎంతవారైనా తమకు అక్కర్లేదనీ.. బీజేపీలోనో, బీఆర్‌ఎస్‌లోనో చేరిపోవాలంటూ… తేల్చి చెప్పేశారు.

కోవర్టులతో చాన్నాళ్లుగా ఇబ్బందపడిన కాంగ్రెస్‌ పార్టీకి… ఇప్పటికీ ఆ బెడద పోలేదని తెలుస్తోంది. జాతీయ స్థాయిలోనూ ఆ పార్టీకి కోవర్టుల సమస్య వెంటాడుతోంది. ఇటీవల గుజరాత్‌లో జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలోనూ రాహుల్‌ ఇదే విషయాన్ని ఉటంకించారు. కాంగ్రెస్‌లో సగంమందికిపైగా బీజేపీకి కోవర్టులుగా పనిచేస్తున్నారంటూ… తీవ్రవ్యాఖ్యలు చేశారు. వారివల్లే పార్టీ నష్టపోతోందని చెప్పారు.

చంద్రబాబైనా, కేటీఆరైనా, రాహుల్‌ గాంధీ అయినా.. ఎవరు చెప్పినా కోవర్టుల ముచ్చట కొత్తదేం కాదు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కోవర్టు సంస్కృతి ఎప్పటి నుంచో ఉందంటారు రాజకీయ విశ్లేషకులు. అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ నేతలు తమ పనులకోసం అధికారపక్షంతో అంటకాగిన సందర్భాలు చాలానే ఉన్నాయనే ప్రచారం ఉంది. తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు… చాలామంది కాంగ్రెస్ నేతలు ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొన్నారు. జగ్గారెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా భట్టి విక్రమార్క వరకు.. అందరూ ఈ ఆరోపణలు ఎదుర్కొన్నవారే. గతంలోనూ ఇలాంటి రాజకీయాలు చేసిన నేతలు.. కాంగ్రెస్‌లో సొంతనేతలను ఓడించుకున్న పరిస్థితులు ఉన్నాయ్‌.

కాలేశ్వరం కమిషన్‌ ముందు హాజరైన బీజేపీ ఎంపీ ఈటల విషయంలో.. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు తిప్పికొడుతున్న బీజేపీ… అసలు కోవర్టులు కాంగ్రెస్‌లోనే ఉన్నారనీ, వారంతా బీఆర్‌ఎస్‌ కోసం పనిచేస్తున్నారనీ ప్రతివిమర్శలు చేస్తోంది. పీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌ , కేసీఆర్‌కు అనుకూలంగా కోవర్టు రాజకీయాలు చేస్తున్నారంటూ.. బీజేఎల్పీ లీడర్ మహేష్‌గౌడ్‌ ఆరోపించారు. 2014 లోక‌స‌భ ఎన్నిక‌ల్లో పరోక్షంగా అప్పటి బీఆర్ఎస్ అభ్యర్ధి కవితకు మద్దతునిచ్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అధికారంలో ఉన్నా, లేకపోయినా… ప్రధాన రాజకీయ పార్టీలను ఇప్పుడు కోవర్టుల అంశం కుదిపేస్తోంది. ఈ సమస్యంతో అప్పట్లో అతలాకుతలమైన హస్తం పార్టీ అధికారం దక్కించుకోగా, ఇప్పుడు బీఆర్‌ఎస్‌ను ఆ సమస్య వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. మరి, ఏ పార్టీకి ఎవరు కోవర్టులున్నారు? ఎంతమంది ఉన్నారు? వాళ్లెవరు? అనే విషయం ఎలా బయటకొస్తుందో? ఎప్పుడు బయటపడుతుందో చూడాలి.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us