PM Modi: 24 గంటల్లో 303 మిలియన్ల వ్యూస్.. ప్రపంచ రికార్డు సృష్టించిన ప్రధాని మోదీ ఇన్‌స్టా రీల్..
పరీక్షల పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ ప్రపంచ రికార్డు సృష్టించింది. కేవలం 24 గంటల్లోనే 303 మిలియన్ల వ్యూస్ సాధించిన ఈ వీడియో ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించిన ఇన్‌స్టాగ్రామ్ రీల్‌గా నిలిచింది. స్పందించిన యువతకు ప్రధాని "థాంక్యూ ఫ్రెండ్స్" అంటూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

దేశవ్యాప్తంగా పరీక్షల పేపర్ లీకేజీల వల్ల ఆందోళన చెందుతున్న విద్యార్థులు, యువతకు ధైర్యం చెప్తూ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అర్ధరాత్రి వేళ ఇన్స్టాగ్రామ్‌లో ఒక సెల్ఫీ వీడియో పోస్ట్ చేశారు. పేపర్ లీక్‌లపై కఠిన చర్యలకు సంబంధించిన నిబంధనలతో కూడిన కొత్త బిల్లును వచ్చే వారం పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు మోదీ వీడియో సందేశంలో స్పష్టంగా తెలియజేశారు. అయితే.. వీడియో సంచలనంగా మారింది.. కేవలం 24 గంటల్లోనే 303 మిలియన్ల (30 కోట్లకు పైగా) వ్యూస్ సాధించి, ప్రపంచంలోనే అత్యధిక వీక్షణలు పొందిన ఇన్స్టాగ్రామ్ రీల్‌గా గ్లోబల్ రికార్డు నెలకొల్పింది. కేవలం కొన్నిగంటల్లోనే.. ప్రపంచంలో అత్యధికంగా వ్యూస్ పొందిన వీడియోగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త రాసే సమయానికి 325 మిలియన్ల వ్యూస్ వచ్చాయి..
అంతేకాకుండా.. పరీక్షా పేపర్ల లీకేజీలలో పాల్గొన్న వారిని శిక్షించడానికి కఠినమైన చట్టాన్ని తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించిన తన వీడియోకు వచ్చిన స్పందనలకు, సానుకూల సూచనలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాత్రి అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ స్పందనకు గాను ప్రధాని మోదీ “థాంక్యూ ఫ్రెండ్స్” (Thank You Friends) అంటూ మరో ఫాలో-అప్ వీడియోను విడుదల చేసి యువతకు ధన్యవాదాలు తెలిపారు.
వరల్డ్ రికార్డు..
అయితే.. ప్రధాని మోదీ విడుదల చేసిన వీడియో 24 గంటల్లోనే సంచలనం సృష్టించింది.. గతంలో ఐపాడ్ లేదా ప్రసిద్ధ క్రియేటర్ IShowSpeed ఖాతాలో ఉన్న 300 మిలియన్ వ్యూస్ రికార్డును ప్రధాని మోదీ దాటేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా, ఈ ఒక్క వీడియోతో ప్రధానికి రాత్రికి రాత్రే దాదాపు 10 లక్షల (1 Million) కొత్త ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు సైతం పెరిగారు.
ప్రధాని మోదీ వీడియో..
View this post on Instagram
పేపర్ లీకేజీలు సాధారణ విషయం కాదని, దీనిపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని ప్రధాని స్పష్టం చేశారు. దోషులకు 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 10 కోట్ల వరకు జరిమానా విధించేలా పటిష్టమైన సవరణలతో కూడిన ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తున్నామని మోదీ తెలిపారు. ఈ క్రమంలోనే.. యువత, విద్యార్థులు సామాజిక మాధ్యమాల ద్వారా అందించిన సానుకూల సలహాలు, మద్దతును మోదీ ప్రశంసించారు.
View this post on Instagram
నీట్ పరీక్షలకు సంబంధించిన అవకతవకల ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు ‘సంసద్ చలో’ యాత్రలో పాల్గొన్న నాలుగు రోజుల తర్వాత మోదీ యువతను ఉద్దేశించి మాట్లాడారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
