Hyderabad: అమ్మో.. పాలు కాదు.. కాలకూట విషం.. ఈ పాలు తీసుకుంటున్నారా..? తిప్పలు తప్పవు
తెల్లనివన్నీ పాలు కాదనే సామెతను గుర్తు చేస్తున్నాయి కల్తీ పాలు.. అయితే ఇక్కడ మాత్రం ఆరోగ్యకరమైన పాలు కాదని సవరించుకోవాలి. పాలలో కల్తీ ఆందోళన కలిగిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో రోగనిరోధకశక్తిని పెంచుకోవాలనుకుంటున్న వారు కల్తీ పాలతో బెంబేలెత్తిపోతున్నారు.

అన్నీ పాలు తెల్లగానే ఉన్నా.. వాటిని పరీక్షించి చూస్తే తప్ప అవి కల్తీ పాలా ? లేదా అనేది కనిపెట్టలేము. అత్యాశతో త్వరగా డబ్బులు సంపాదించాలనే దురాశతో కొందరు పాలను కల్తీ చేస్తున్నారు. లీటర్ పాలను కాస్తా పది లీటర్లను చేసేస్తున్నారు. చక్కెర, డిటర్జెంట్, యూరియా, నూనెలను కలిపి లీటర్ పాలను పది లీటర్లు చేస్తున్నారు. పాలు చిక్కగా ఉండేందుకు రసాయనాలను కలుపుతున్నారు. ఇలా తయారు చేసిన పాలను కొందరు డైరెక్ట్‌గా అమ్ముతుండగా, మరికొందరు పాల కేంద్రాల్లో విక్రయిస్తున్నారు.
తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా బీఎన్ తిమ్మాపూర్ గ్రామంలో ఇలాంటి దందానే వెలుగుచూసింది. బాలనర్సయ్య, భాస్కర్, నకిరేకంటి రాజులు పేరు గల వ్యక్తులు చుట్టు పక్కల గ్రామాల పాడిరైతుల నుంచి పాలను కొంటారు. ఈ పాలలో భారీగా నీళ్లు కలిపుతారు. ఆపై చిక్కదనం ఉండటానికి, వైట్ కలర్ రావడానికి పాల పొడి, హైడ్రోజన్ పెరాక్సైడ్, హైడ్రో క్లోరిక్ యాసిడ్ వంటి కెమికల్స్ మిక్స్ చేస్తున్నారు. రోజూ 300 లీటర్ల చొప్పున ఇలా తయారు చేసి హైదరాబాద్‌లో వివిధ కాలనీలతో పాటు స్వీట్‌హౌస్‌లు, హోటళ్లలో అమ్ముతున్నారు. ఈ విషయం తెలుసుకున్న SOT పోలీసులు భువనగిరి రూరల్ పోలీసుల సహకారంతో ఆదివారం తెల్లవారుజామున నిందితుల ఇళ్లపై దాడి చేసి గుట్టు రట్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 120 లీటర్ల కల్తీ పాలు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదులు తెలిపారు.
అయితే ఇలాంటి రసాయనాలు వినియోగించడం వల్ల అనారోగ్యం పాలు కావడం ఖాయమంటున్నారు వైద్యులు. డిటర్జెంట్, రసాయనాలు కలపడం వల్ల పాలు తెల్లగా, స్వచ్ఛంగా కనిపిస్తాయి. వీటిని తాగడం వల్ల జీర్ణకోశ సంబంధిత సమస్యలు, విరేచనాలు అవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యూరియా కలిపిన పాలు తాగడం వల్ల మూత్రపిండాల పనితీరులో మార్పు కనిపిస్తుందంటున్నారు. హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను పాల స్వచ్ఛతను ఎక్కువ కాలం కాపాడేందుకు కలుపుతారు. దీనివల్ల జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అల్సర్ సమస్య తీవ్రమై కడుపులో మంట మొదలవుతుందని వైద్యులు చెబుతున్నారు. స్టార్చ్ కలపడం వల్ల పాలు చిక్కగా కనిపిస్తాయని, ఈ పాలను ఎక్కువగా తాగడం వల్ల డయేరియా బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..