AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తోడుండాల్సిన వయస్సులో తల్లిని పట్టించుకోని కొడుకులు.. ఇంట్లోకి రానివ్వకుండా..

అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదనే నానుడి నిజమవుతోంది. నవ మాసాలు మోసి కనిపించిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఆసరాగా ఉండాల్సిన కొందరు కొడుకులు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. వృద్ధాశ్రమంలో మతి స్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్న తల్లిని ఇంటికి తీసుకు వెళ్లేందుకు కొడుకులు ముందుకు రాలేదు. చివరికి పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.

తోడుండాల్సిన వయస్సులో తల్లిని పట్టించుకోని కొడుకులు.. ఇంట్లోకి రానివ్వకుండా..
Nalgonda
M Revan Reddy
| Edited By: |

Updated on: Jul 20, 2025 | 3:37 PM

Share

నల్లగొండ జిల్లా కట్టంగూర్ కు చెందిన ఇల్లందుల కిష్టయ్య, ధనమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఉన్నంతలో వీరిని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు కూడా చేశారు. పదేళ్ల క్రితం భర్త కిష్టయ్య మృతి చెందడంతో ధనమ్మకు కష్టాలు మొదలయ్యాయి. తల్లిని తమ వద్ద ఉంచుకోలేక కుమారులు నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెంలోని శ్రీవాసవి వృద్ధాశ్రమంలో 2024 డిసెంబర్ 19న చేర్పించారు. ఆరునెలలుగా వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధురాలు ధనమ్మ.. వయోభారంతో మతిస్థిమితం కోల్పోయింది. వారం రోజుల క్రితం కుర్చీ ఎక్కి భవనంపై నుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించింది. గమనించిన ఆశ్రమ నిర్వాహకులు వెంటనే ఆమెను వారించి గదిలోకి తీసుకెళ్లారు.

ధనమ్మ ప్రవర్తనను వృద్ధాశ్రమ నిర్వాహకులు ఆమె కుమారులైన రంగ శేఖర్, మీల సోమయ్య దృష్టికి తీసుకెళ్లారు. అయినా తల్లిని తీసుకువెళ్లేందుకు ముగ్గురు కొడుకుల నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో ఆశ్రమ నిర్వాహకులు వృద్ధురాలు ధనమ్మను తీసుకు వెళ్లేందుకు ముగ్గురు కొడుకులు రావడంలేదని నార్కెట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో తమ తల్లిని బాగా చూసుకోవడం లేదంటూ ఆశ్రమ నిర్వాహకులపై కొడుకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువురు ఫిర్యాదులను పరిగనణలోకి తీసుకున్న పోలీసులు మొదట ఆశ్రమంలో ఉన్న ధనమ్మ దగ్గరకు వెళ్లి ఆమెతో మాట్లాడారు. వృద్ధాశ్రమం నిర్వాహకులు ఎలా చూసుకుంటున్నారని ఆమెను ప్రశ్నించగా మంచిగానే చూస్తున్నారని ఆమె చెప్పింది.

ఇదిలా ఉండగా రీసెంట్‌గా మూడు రోజుల క్రితం ధనమ్మ వృద్ధాశ్రమంలోనీ గదిలో టవల్‌ను మెడకు చుట్టుకుని మరోసారి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆందోళన చెందిన ఆశ్రమ నిర్వాహకులు కారులో ఎక్కించుకొని కట్టంగూర్‌లోని రెండో కుమారుడు ఇంటి వద్దకు తీసుకు వెళ్లారు. అయితే తల్లిని ఇంట్లోకి రానివ్వడానికి కొడుకు నిరాకరించాడు. ఇద్దరు సోదరుల ఇంటికి తీసుకు వెళ్లకుండా తన ఇంటికె తల్లిని ఎందుకు తీసుకువచ్చారంటూ ఆశ్రమ నిర్వాకులపై మండి పడ్డాడు. దీంతో చేసేదేమీ లేక ఆశ్రమ నిర్వాహకులు వృద్ధురాలిని తిరిగి ఆశ్రమానికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధనమ్మ ముగ్గురు కొడుకులను పిలిపించి కౌన్సిలింగ్ చేసి తల్లిని కొడుకుల వద్దకు పంపిస్తామని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.