Telangana: అత్తారింట్లో అల్లుడు కాల్పులు.. ఉలిక్కిపడ్డ మంచిర్యాల జిల్లా
మంచిర్యాల జిల్లాలోని ఓ మారుమూల గ్రామం ఒక్కసారిగా తుపాకీ చప్పుళ్లతో ఉలిక్కిపడింది. అర్థరాత్రి జరిగిన కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా ఓప్రైవేట్ కాంట్రాక్టర్ జరిపిన కాల్పులు పోలీసులను ఆందోళనకు గురి చేశాయి.
మంచిర్యాల, 28 ఫిబ్రవరి: మంచిర్యాల జిల్లాలోని ఓ మారుమూల గ్రామం ఒక్కసారిగా తుపాకీ చప్పుళ్లతో ఉలిక్కిపడింది. అర్థరాత్రి జరిగిన కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా ఓప్రైవేట్ కాంట్రాక్టర్ జరిపిన కాల్పులు పోలీసులను ఆందోళనకు గురి చేశాయి. అత్తారింట్లో అల్లుడు జరిపిన కాల్పుల ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. అత్తమామల పగతోనే అల్లుడు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ కాల్పులకు పాల్పడిన తుపాకీ ఎక్కడిది..? అక్రమంగా గన్ వినియోగిస్తున్నాడా..? అన్నకోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగామా గ్రామం మంగళవారం అర్థరాత్రి తుపాకీ చప్పుల్లతో ఉలిక్కి పడింది. గోలేటీ శంకర్ అనే వ్యక్తి ఇంట్లో అల్లుడు గోమాస నరేందర్ అనే వ్యక్తి మంగళవారం అర్థ రాత్రి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. గన్ నుండి దూసుకొచ్చిన బుల్లెట్లు ఇంటి గోడలోకి చొచ్చుకెళ్లాయి. ఈ కాల్పుల్లో అత్తమామలు తృటిలో ప్రాణాలతో బయటపడ్టారు. ఆస్తి కోసమే అత్తమామలపై గోమాస నరేందర్ కాల్పులు జరిపినట్టు సమాచారం.
కాల్పులు జరిపిన అల్లుడు గోమాస నరేందర్ కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన బీడీ కాంట్రాక్టర్ గా తెలుస్తోంది. బాధితుడు శంకరయ్య ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసిపి రవి కుమార్ లోతుగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది.. అక్రమంగా గన్ వాడుతున్నాడా..? లైసెన్స్డ్ గన్నేనా అన్నది తేలాల్సి ఉంది.