AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singareni Elections: సింగరేణిలో మోగిన ఎన్నికల సైరన్‌.. పోలింగ్‌, కౌంటింగ్ తేదీ వివరాలివే..

Singareni Election: సింగరేణి ఎన్నికలకు సైరన్‌ మోగింది. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా, గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అక్టోబర్‌ 28న సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు కూడా అదే రోజు వెలువడుతాయి. మరోవైపు కనీవినీ ఎరుగని రీతిలో సింగరేణి కార్మికులకు బోనస్‌ ప్రకటించారు సీఎం కేసీఆర్‌.

Singareni Elections: సింగరేణిలో మోగిన ఎన్నికల సైరన్‌.. పోలింగ్‌, కౌంటింగ్ తేదీ వివరాలివే..
Singareni Elections
శివలీల గోపి తుల్వా
| Edited By: Janardhan Veluru|

Updated on: Sep 28, 2023 | 4:29 PM

Share

ఖమ్మం జిల్లా, సెప్టెంబర్ 27: సింగరేణి ఎన్నికలకు సైరన్‌ మోగింది. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా, గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అక్టోబర్‌ 28న సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు కూడా అదే రోజు వెలువడుతాయి. మరోవైపు కనీవినీ ఎరుగని రీతిలో సింగరేణి కార్మికులకు బోనస్‌ ప్రకటించారు సీఎం కేసీఆర్‌. అవును, సింగరేణి సంస్థలో ఎన్నికల నగారా మోగింది. హైకోర్టు తీర్పుతో సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు అనివార్యంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎన్నికల వాయిదాను కోరుతూ యాజమాన్యం దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను తిరస్కరించిన ఉన్నత న్యాయస్థానం.. అక్టోబర్ లోపు ఎన్నికలను తప్పనిసరిగా నిర్వహించాలని ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో గుర్తింపు సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల అయింది. అక్టోబర్‌ 28న ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు కూడా అదే రోజు వెలువడతాయి.

ఉమ్మడి ఆదిలాబాద్‌, ఉమ్మడి వరంగల్‌, ఉమ్మడి కరీంనగర్‌, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్నాయి. 42 వేల మంది కార్మికులు, ఉద్యోగులు సింగరేణిలో పని చేస్తున్నారు. దాదాపు 15 అసెంబ్లీ స్థానాల్లో సింగరేణి కార్మికులు బలమైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. దీంతో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు రాజకీయ పార్టీలకు కూడా ప్రతిష్టాత్మకంగా మారాయి. నోటిఫికేషన్‌ జారీ కావడంతో ఇక కోల్ బెల్ట్ ప్రాంతం మినీ రాజకీయ రణరంగానికి వేదికగా మారనుంది. దీంతో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసేందుకు అన్ని పార్టీలు కష్టపడుతున్నాయి.

కాగా, గత ఎన్నికల్లో గెలుపొందిన TBGKS యూనియన్‌.. అధికార బీఆర్‌ఎస్‌కు అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. ఈ సారి కూడా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయాలని బీఆర్‌ఎస్ తహతహలాడుతోంది. అయితే.. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి, లెఫ్ట్‌ పార్టీల నేతృత్వంలోని AITUC గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోందంటున్నారు.

ఇక ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఉద్యోగులకు లాభాల పంట పండింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో సంస్థకు వచ్చిన 2, 222 కోట్ల రూపాయల లాభాల్లో ఏకంగా 32 శాతం..అంటే 711 కోట్ల రూపాయలను ఉద్యోగులకు బోనస్‌గా చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది లాభాల వాటాలో 30 శాతం బోనస్‌గా చెల్లించగా, ఈ సారి మరో రెండు శాతం పెంచారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్‌. నర్సింగ్‌రావు మంగళవారం రాష్ట్ర ఇంధన శాఖకు లేఖ రాశారు. దీంతో సగటున ఒక్కో ఉద్యోగికి లక్షా 60 వేల రూపాయల నుంచి లక్షా 70 వేల వరకు వచ్చే అవకాశముందని చెబుతున్నారు.