AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singareni Collieries: సింగరేణి ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంచుతూ బోర్డ్ నిర్ణయం

సింగరేణి కాలరీస్‌లో పని చేస్తున్న అధికారులు, కార్మికుల పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

Singareni Collieries: సింగరేణి ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంచుతూ బోర్డ్ నిర్ణయం
Singareni
Balaraju Goud
|

Updated on: Jul 26, 2021 | 4:40 PM

Share

సింగరేణి ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తీసుకువచ్చింది. సింగరేణి కాలరీస్‌లో పని చేస్తున్న అధికారులు, కార్మికుల పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. సోమవారం జరిగిన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సీఎండీ శ్రీధర్‌ తెలిపారు. వయసు పెంపు నిర్ణయం ఈ ఏడాది మార్చి 31 నుంచి అమలులోకి రానున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయంతో మార్చి 31 జూన్‌ 30 మధ్య పదవీ విరమణ చేసిన వారికి మళ్లీ ఉద్యోగాలు వస్తాయని.. 43,899 మంది అధికారులు, కార్మికులకు లబ్ధి చేకూరుతుందని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు పదవీ విరమణ వయసును పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు 557వ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్ పేర్కొన్నారు. పెళ్లయిన, విడాకులు పొందిన కుమార్తెలకూ కారుణ్య నియామకాల్లో అవకాశం దక్కనుంది. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగాల్లో 10శాతం ఈబీసీ రిజర్వేషన్ల అమలుకు సింగరేణి బోర్డ్‌ ఆమోదం తెలిపినట్లు సీఎండీ చెప్పారు. సింగరేణిలో అన్ని ఉద్యోగాలకు లింగబేధం లేకుండా అవకాశాలకు అనుమతికి సమావేశం ఆమోదం తెలిపినట్లు వివరించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికి పదవీ విరమణ వయసును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సింగరేణి సంస్థలో కూడా దీన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. జులై 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి సింగరేణి ప్రాంత ప్రజానిధులు, సంస్థ ఛైర్మన్‌ తో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సింగరేణిలో కూడా 61 సంవత్సరాల వయో పరిమితి పెంపు నిర్ణయాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన సమావేశంలో బోర్డు తన ఆమోదం తెలిపినట్లు ఛైర్మన్‌, ఎండీ ప్రకటించారు. దీంతో సింగరేణి ఆధికారులు, కార్మికులు కలిపి మొత్తం 43,899 మందికి లబ్ది చేకూరనుంది. మార్చి 31 తేదీ నుంచి జూన్‌ 30వ తేదీ మధ్య కాలంలో రిటైర్‌ అయిన 39 మంది అధికారులు, 689 మంది కార్మికులను కూడా తిరిగి విధుల్లోకి తీసుకోనున్నారు. దీనిపై సమగ్రమైన విధివిధానాలు రూపొందించాలని సంస్థ సీఎండీ శ్రీ ఎన్‌.శ్రీధర్‌ సంబంధిత శాఖల వారిని ఆదేశించారు. ఈ వయో పరిమితి పెంపును సింగరేణి విద్యా సంస్థల్లో కూడా అమలు జరపనున్నారు.

కాగా, కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియలో ఇప్పటి వరకు కేవలం కుమారులకు, అవివాహిత కుమార్తెలకు మాత్రమే అవకాశం కల్పిస్తుండగా, కార్మికుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు పెళ్లైన లేదా విడాకులు తీసుకొని విశ్రాంత ఉద్యోగిపై ఆధారపడి ఉన్న కుమార్తెలు, ఒంటరి మహిళలకు కూడా ఉద్యోగ వయో పరిమితికి లోబడి కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియలో వారసత్వ ఉద్యోగం పొందేందుకు బోర్డు ఆమోదించింది.

ఈ సమావేశంలో సమీప గ్రామాల అభివృద్ధికి ఉద్దేశించిన సామాజిక బాధ్యతా కార్యక్రమాల (సీఎస్‌ఆర్‌) నిర్వహణకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు వెచ్చించడానికి బోర్డు ఆమోదించింది. అలాగే, వివిధ గనులకు అవసరమైన యంత్రాలు, కాంట్రాక్టు పనులు తదితర అంశాలకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది. రామగుండం లో కొత్తగా ప్రారంభించనున్న ఆర్జీ ఓసీ-5కు సంబంధించి రెండు కొత్త రోడ్ల నిర్మాణానికి అవసరమయ్యే బడ్జెట్‌ కు ఆమోదం తెలిపింది. ఫస్ట్‌ క్లాస్‌ మైన్‌ మేనేజర్‌ సర్టిఫికెట్‌ ఉన్న మైనింగ్‌ అధికారుల డిజిగ్నేషన్‌ మార్పు పై కూడా బోర్డు ఆమోదం తెలిపింది.

అలాగే, ఎగ్జిక్యూటీవ్‌, ఎన్‌.సి.డబ్ల్యు.ఎ. ఉద్యోగ నియామకాలలో గతంలో ఉద్యోగ నిబంధనల ప్రకారం కొన్ని లింగపరమైన ఆంక్షలు ఉండేవి. ఇప్పుడు అన్ని పోస్టులకు లింగ భేదాన్ని తొలగిస్తూ ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవడాలికి వీలుగా బోర్డు అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు శ్రీరాంపూర్‌ ఏరియా నస్పూర్‌ కాలనీ వద్ద జాతీయ రహదారి విస్తరణ లో నిర్వాసితులైన స్థానికులకు సింగరేణి నిర్వాసిత కాలనీలో 85 చదరపు గజాల విస్తీర్ణం గల 201 ప్లాట్లను కేటాయించడానికి కూడా బోర్డు ఆమోదించింది.

Read Also…  Dhanya Ramkumar: సినీ ఇండస్ట్రీలోకి మరో వారసురాలు.. ప్రముఖ లెజండరీ నటుడి మనవరాలు హీరోయిన్‏గా ..