Telangana: విషమంగానే ప్రీతి ఆరోగ్య పరిస్థితి.. సైఫ్‌పై ర్యాగింగ్‌తో పాటు SC, ST ఎట్రాసిటీ కేసు
వరంగల్‌లో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మరుసటి రోజే ఆమెను వేధిస్తున్న సీనియర్ సైఫ్‌ను మట్టేవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం తెల్లవారుజామున కాకతీయ మెడికల్ కాలేజీ (కెఎమ్‌సి) హాస్టల్‌కు చేరుకున్న పోలీసులు పీజీ రెండో సంవత్సరం విద్యార్థి సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి.
పీజీ డాక్టర్ ప్రీతి ఆత్మహత్యయత్నానికి కారకులెవరు? ఆమెను వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ సైఫ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇద్దరి మధ్య ఏం జరిగిందనే కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రీతిని సైఫ్ వేధించినట్టు ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు పోలీసులు. దీంతో.. సైఫ్‌పై ర్యాగింగ్‌తో పాటు SC, ST ఎట్రాసిటీ కేసు నమోదుచేశారు.
మట్టేవాడ స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న పోలీసులకు సంచలన విషయాలు తెలిసినట్లు సమాచారం. ప్రీతి, సైఫ్ రూంలలో ఆధారాలు సేకరించారు. సైఫ్ ఫోన్‌లో ప్రీతితో జరిగిన చాటింగ్ డీటైల్స్ సేకరించారు. అటు… MGM సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, KMC ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ ప్రాథమిక నివేదికను DME అందజేసినట్లు సమాచారం.
అసలు డాక్టర్ సైఫ్ ఎవరు? అతని చరిత్ర ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఖమ్మంకు చెందిన రైల్వే ఉద్యోగి అక్బర్ రషీద్ కొడుకు సైఫ్. తండ్రి ఉద్యోగ రీత్యా కాజిపేట రైల్వే క్వార్టర్స్‌లో ఉంటున్నారు. అతని పలుకుబడితో పోలీసులపై ఒత్తిడి పెంచారని ప్రచారం. అతని గురించి ఫ్రెండ్స్ ఏమంటున్నారో చూద్దాం.
తన కూతురిని సైఫ్ వేధించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆమె తండ్రి నరేందర్ కన్నీరు పెడుతున్నారు. మట్టేవాడ పోలీసులు సరైన టైంలో స్పందించకపోవడం వల్లే ఆత్మహత్యాయత్నం చేసిందని కుమిలిపోతున్నారు.
విద్యార్థి, యువజన, గిరిజన సంఘాల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. సైఫ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాలను నమ్మవద్దని.. అంతా సంయమనం పాటించాలని పోలీసులు కోరుతున్నారు. ఓవరాల్ ఇష్యూపై ఇవాళ మధ్యాహ్నం వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇవ్వబోతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..