Summer: సామాన్యుడికి షాక్.. ఎండాకాలంలో భారీగా పెరగనున్న నిత్యావసరాల ధరలు
సమ్మర్‌లో సామాన్యుడికి ధరల షాక్..!!! అవును.. అసలే ఎండలు రోజు రోజుకి మంటెక్కుతుంటే.. పలు వస్తువుల ధరలు కూడా హీటెక్కిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పలు వస్తువుల ధరలు పెరగనున్నట్లుగా ఆర్థిక నిపుణుల సూచనలు సామాన్యుల్లో గుబులు రేపుతోంది. ఇప్పటికే.. పెరుగుతున్న ఎండలకు తోడు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు అల్లాడుతున్నారు.
ఎండాకాలం ఇంకా రానే రాలేదు.. అప్పుడే.. ఎండలు మండిపోతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరితో పోల్చితే ఈ సారి తీవ్రత ఎక్కువుగానే ఉంది. ఫిబ్రవరి రెండోవారం చివర్లోనే వేడి పెరిగింది. రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరించారు వాతావరణ నిపుణులు. అసలే ఎండలు మండిపోతుంటే.. మరోవైపు.. పలు వస్తువుల ధరలు కూడా హీటెక్కిస్తున్నాయి. అదీ ఇదీ అని కాదు.. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు అడ్డూ, అదుపూ లేకుండా పెరుగుతున్నాయి. వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. అసలే కరోనా కష్టకాలంలో ప్రజలు అల్లాడుతుంటే, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు వారిపై మరింత భారం మోపుతున్నాయి.
గత ఏడాది కిలో కందిపప్పు ధర 90 నుంచి 95 రూపాయల మధ్య ఉండేది . ఇప్పుడు మార్కెట్ లో 125 నుంచి 150 రూపాయల పైమాటే. ఆనాడు బియ్యం ధర కిలో రూ.30-35 మధ్య ఉంటె అదే ఇప్పుడు రూ.45-నుంచి 55 రూపాయలకు చేరింది ! టమాటా 10 నుంచి 20 రూపాయలు ఇప్పుడు 30 నుంచి 40 రూపాయలు పలుకుతోంది. వంట నూనె సైతం 170 రూపాయల పైమాటే…!!! అన్నం, పప్పు, కూర వండుకునే వంట గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిదేండ్ల క్రితం రూ.414 ఉంటే.. ఇప్పుడు ఎకాఎకిన 1105 రూపాయలు అయిపోయింది!
వంట నూనెల దగ్గర్నుంచి సబ్బుల వరకూ మనం రోజువారీ ఉపయోగించే సరుకు ఏదైనా సరే వాటి ధర కొండెక్కి కూర్చున్నది. ఇవి వేగంగా పెరగడమేకాదు, మునుపెన్నడూ చూడని స్థాయికి చేరిపోతున్నాయి. భరించలేని స్థాయికి చేరడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. మార్కెట్‌లో ఏది ముట్టుకున్నా మండుతోంది. నిత్యావసరాలు, నూనె ధరలు కూడా బాగా పెరిగాయి. దీంతో ఇతర ఖర్చులు తగ్గించుకొని, తక్కువ మొత్తంలో సరుకులు కొనుక్కొని సర్దుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గృహిణులు.
ప్రస్తుతం రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రత సగటు కంటే 3-5 డిగ్రీలు ఎక్కువుగా నమోదవుతోంది. గత ఏడాది కూడా ఫిబ్రవరి- మార్చిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో.. గోధమల ఉత్పత్తి తగ్గింది. గతేడాది ఫిబ్రవరిలో… 111.3 మిలియన్ టన్నుల గోధుమ ఉత్పత్తిని… ప్రభుత్వం అంచనా వేయగా.. వాస్తవ ఉత్పత్తి 107.7 మిలియన్ టన్నులకు తగ్గింది. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం.. 112.1 మిలియన్ టన్నుల గోధుమలను ఉత్పత్తి చేస్తుందని అంచనా వేసింది. అయితే.. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఉత్పత్తి తగ్గవచ్చు.. దీంతో.. రాబోయే రోజుల్లో గోధుమల ధర పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఇక పాల ఉత్పత్తుల ధరలు కూడా.. మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు. పాల పరిశ్రమలు పాల ధరలను పెంచాలనే ఆలోచనతో ఉన్నాయి. ఈ నెలలోనే.. దేశంలోనే అతిపెద్ద పాల విక్రయ సంస్థ అమూల్ పాల ధరలు మరోసారి పెరిగాయి. పాల ధరల పెరుగుదల కారణంగా, పాల ఉత్పత్తులు కూడా ఖరీదైనవిగా మారుతాయి. జనవరిలో నెయ్యి ధర 18 శాతం పెరిగింది. ఐస్ క్రీమ్, బేబీ ఫుడ్ కూడా 10 శాతం కంటే ఎక్కువ ధరలు పెరిగాయి. పశుగ్రాసం ధరలు పెరడంతోనే.. పాల ఉత్పత్తులపై ఎఫెక్ట్ పడిందని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు.
ఎండాకాలంలో నిత్యవసర వస్తువుల ధరలు పెరగడంతో పాటు.. పలు వస్తువుల ధరలకు కూడా రెక్కలు రానున్నాయి. ప్యాక్డ్ ఫుడ్, రిఫ్రిజిరేటర్, ACతో పాటు.. దిగుమతి చేసుకున్న బట్టలు వంటి అనేక వినియోగ వస్తువుల ధరలలో.. 3-10% పెరుగుదల అంచనా వేస్తున్నారు. ఇలా అన్ని ఉత్పత్తులపై పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్ల నుంచి రికవరీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి కంపెనీలు. ఒకటి, రెండు నెలల్లో పలు ఉత్పత్తుల ధరలలో పెరుగుదల ఉండవచ్చని అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు.
రూపాయి బలహీనత కారణంగా… ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులు.. కంపెనీలకు ఖరీదైనవిగా మారాయి. దాని కారణంగా ఖర్చు పెరిగింది. దీంతో.. దిగుమతి చేసుకుంటున్న వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు నానాటికీ పెరిగిపోతుండటంతో ఇబ్బందులు పడుతున్నామని, కూరగాయల రేట్లు, రవాణా చార్జీలు పెరగడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సామన్యులు.. పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను కేంద్రం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ లోని హోల్ సేల్ మార్కెట్ గా పేరుగాంచిన అఫ్జల్ గంజ్ , బేగంబజార్ , మలక్ పెట్ లాంటి ఏరియాల్లో వ్యాపారాలు గిరాకీ లేక దిగాలు చెందుతున్నారు వ్యాపారస్తులు. మార్కెట్ లో నిత్యావసర వస్తువుల ధరలు 15 నుంచి 20 శాతం పెరిగాయని అంటున్నారు. బియ్యం, పప్పు , నూనెలు ధరలు గత ఏడాదితో పోలిస్తే పెరిగాయని కనీస లాభం లేకుండా వ్యాపారం ఎలా చేయాలని ప్రశ్నిస్తున్నారు. చాల తక్కువ మార్జిన్ తో వ్యాపారం చేసే మాకు మాల్స్ రావడంతో విపరీత పొతే ఏర్పడిందని అంటున్నారు.
పెద్ద పెద్ద మాల్స్ నిర్వహించే సంస్థలు… రైతులను తమ అధీనంలో ఉంచుకుని ధరలను నిర్ణయిస్తున్నాయని, వారిపై ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇతర ఖర్చుల్లో కోత పెట్టుకోవడంతో పాటు.. పొదుపునూ తగ్గించాల్సి వస్తున్నది. ధరలు పెరుగుతున్న వేగాన్ని చూపించే ద్రవ్యోల్బణం రేటు గరిష్ఠ స్థాయికి చేరగా, రిటైల్ స్థాయిలో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కమోడిటీ ధరలు పెరగడం, లేబర్ మార్కెట్‌లో నెలకొన్న ఒత్తిడులే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు.