Telangana: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు.. ఇంటి నుంచే అన్నీ..
ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగలేక, గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడలేక విసిగిపోయారా? అయితే మీకోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ అయినా, చిరునామా మార్పు అయినా.. ఒక్క రూపాయి అదనంగా ఖర్చు లేకుండా ఆఫీసు మెట్లు ఎక్కకుండానే మీ పనులు పూర్తవుతాయి. రవాణా శాఖ ప్రవేశపెట్టిన ఫేస్‌లెస్ సేవలతో ఆర్టీఏ కార్యాలయాలు ఇక మీ అరచేతిలోకి వచ్చేశాయి.

ఇకపై చిన్న చిన్న ఆర్టీఏ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే రోజులుకు గుడ్‌బై చెప్పే సమయం వచ్చింది. రవాణా శాఖ ప్రజలకు భారీ ఊరటనిస్తూ ఫేస్‌లెస్ సేవలను మరింత విస్తరించింది. ఆధార్ ఆధారిత ధృవీకరణతో సారథి పోర్టల్ ద్వారా ఇంటి నుంచే 17 కీలక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, చిరునామా మార్పు, డూప్లికేట్ లైసెన్స్ వంటి సేవల కోసం ఇక ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. వేలిముద్రల ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణతో ఆన్లైన్‌లోనే పనులు పూర్తి చేసుకునేలా ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది.
తెలంగాణలో జాతీయ రవాణా పోర్టల్ సారథి సేవలు గత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే వ్యవస్థలో ఫేస్‌లెస్ సేవలను మరింత విస్తరించి ప్రజలకు సౌకర్యవంతమైన డిజిటల్ సేవలను అందిస్తున్నారు. ఈ కొత్త విధానం ద్వారా లర్నర్ లైసెన్స్‌లో పేరు, చిరునామా, ఫొటో, సంతకం మార్పులు చేసుకోవచ్చు. అలాగే డూప్లికేట్ లర్నర్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ జారీ, లైసెన్స్ ఎక్స్ట్రాక్ట్ సేవలు కూడా ఆన్లైన్‌లోనే లభించనున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ, బయోమెట్రిక్ అప్‌డేట్, పుట్టిన తేదీ మార్పు, ఫొటో మార్పు, సంతకం సవరణ వంటి సేవలను కూడా ఇంటి నుంచే పూర్తి చేసుకునే అవకాశం కల్పించారు. లైసెన్స్ నుంచి వాహన తరగతి తొలగింపు, ప్రమాదకర పదార్థాల రవాణా వాహనాల కోసం ప్రత్యేక ఎండోర్స్మెంట్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
ప్రస్తుతం ఈ సేవలు అధికారిక సారథి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండగా.. వచ్చే మూడు రోజుల్లో ‘NextGen mParivahan’ మొబైల్ యాప్‌లో కూడా ప్రారంభించనున్నట్లు రవాణా శాఖ తెలిపింది. ఈ సందర్భంగా రవాణా శాఖ కమిషనర్ డాక్టర్ కె. ఇలంబర్తి మాట్లాడుతూ.. డిజిటల్ పరిపాలనను బలోపేతం చేయడంలో భాగంగానే ఫేస్‌లెస్ సేవలను ప్రవేశపెట్టామని తెలిపారు. దీనివల్ల ప్రజలకు సమయం ఆదా కావడంతో పాటు ఆర్టీఏ కార్యాలయాల్లో రద్దీ కూడా తగ్గుతుందని చెప్పారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆయన.. పౌరులు ఈ డిజిటల్ సదుపాయాలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.
