ఫ్రెండ్‌తో కలిసి పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు మరవకండి!
స్నేహితులతో వ్యాపారం ప్రారంభించే ముందు సరైన ప్రణాళిక లేకపోతే నష్టాలు తప్పవు. బాధ్యతలు, పెట్టుబడులు, లాభనష్టాల పంపకం వంటివి స్పష్టంగా నిర్ణయించాలి. కేవలం నమ్మకంపై ఆధారపడకుండా, చట్టపరమైన పార్ట్నర్‌షిప్ అగ్రిమెంట్ తప్పనిసరి. ఇది భవిష్యత్తు వివాదాలను నివారించి, వ్యాపారాన్ని విజయవంతం చేయడంలో కీలకం.

స్నేహితులతో కలిసి వ్యాపారం ప్రారంభించడం చాలా మందికి మంచి ఆలోచనగా కనిపిస్తుంది. నమ్మకం, పరస్పర అవగాహన ఉండటంతో పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లు వేగంగా ప్రారంభమవుతాయి. అయితే సరైన ప్రణాళిక లేకుండా ప్రారంభిస్తే స్నేహంతో పాటు వ్యాపారం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని వ్యాపార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారం ప్రారంభించే ముందు బాధ్యతలు, పెట్టుబడులు, లాభనష్టాల పంపకం వంటి అంశాలను స్పష్టంగా నిర్ణయించుకోవడం అత్యంత కీలకమని సూచిస్తున్నారు. చాలా మంది స్నేహితుల మధ్య నమ్మకం ఉండటంతో మాటలపైనే ఒప్పందాలు చేసుకుంటారు. కానీ భవిష్యత్తులో అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంటుంది.
అందుకే వ్యాపారం ప్రారంభించే ముందు తప్పనిసరిగా లీగల్ పార్ట్నర్‌షిప్ అగ్రిమెంట్ తయారు చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రతి భాగస్వామి పెట్టే పెట్టుబడి, నిర్ణయాధికారం, లాభాల పంపకం, అప్పుల బాధ్యత, వ్యాపారం నుంచి బయటకు వెళ్లే విధానం వంటి అంశాలు స్పష్టంగా ఉండాలి. అలాగే ఒకరి సామర్థ్యాలు, నైపుణ్యాలు మరొకరికి అనుకూలంగా ఉండటం కూడా ముఖ్యమని చెబుతున్నారు. ఒకరు ఫైనాన్స్ చూసుకుంటే, మరొకరు మార్కెటింగ్ లేదా ఆపరేషన్స్ చూసుకునేలా బాధ్యతలు విభజించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
వ్యాపార ఖర్చులు, వ్యక్తిగత ఖర్చులను వేర్వేరుగా ఉంచడం కూడా అవసరం. చాలామంది ప్రారంభ దశలో ఈ రెండు కలిపేయడం వల్ల ఆర్థిక గందరగోళం ఏర్పడుతుంది. ప్రత్యేక బ్యాంక్ ఖాతా నిర్వహించడం ఉత్తమ పద్ధతిగా భావిస్తున్నారు. ఇక నిర్ణయాల విషయంలో పారదర్శకత చాలా కీలకం. చిన్న విషయాలైనా పరస్పరం చర్చించుకోవడం, లాభనష్టాలను స్పష్టంగా పంచుకోవడం వల్ల భవిష్యత్తులో వివాదాలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. స్నేహం ఒక బలమైన పునాది అయినప్పటికీ, వ్యాపారం మాత్రం క్రమశిక్షణ, స్పష్టత, చట్టపరమైన రక్షణలపై ఆధారపడి ఉంటుందని వ్యాపార వర్గాలు సూచిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
