AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఒక్క గేట్ ఉండదు.. నీళ్లు నిండితే మాయాజాలమే.. ఈ ప్రాజెక్టు గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

కరెంట్ ఉండక్కర్లేదు.. గేట్లు ఎత్తే క్రేన్లు అస్సలే అవసరం లేదు.. ఒక్క మనిషి సాయం లేకుండానే నిండిన వరద నీరు దానంతట అదే జలపాతంలా దూకేస్తుంది. ఆరు దశాబ్దాల క్రితమే ఆసియా ఖండంలోనే తొలిసారిగా తెలంగాణ గడ్డపై రూపుదిద్దుకున్న అద్భుత సాంకేతిక విజ్ఞానం సరళా సాగర్ ప్రాజెక్టు. ఆధునిక ఇంజనీర్లను సైతం ఆశ్చర్యపరుస్తున్న ఈ జలాశయం విశేషాలేంటో తెలుసుకుందాం..

Telangana: ఒక్క గేట్ ఉండదు.. నీళ్లు నిండితే మాయాజాలమే.. ఈ ప్రాజెక్టు గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
Sarala Sagar Project Wanaparthy
Krishna S
|

Updated on: Sep 13, 2026 | 12:57 PM

Share

ఎలాంటి మోటార్లు, గేట్లు ఎత్తే క్రేన్లు, కరెంట్ సరఫరా అవసరం లేకుండానే.. జలాశయం నిండగానే ఆటోమేటిక్‌గా నీటిని బయటకు వదిలేసే డ్యామ్‌ల గురించి ఎప్పుడైనా విన్నారా? తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఉన్న సరళా సాగర్ ప్రాజెక్టు సరిగ్గా ఇలాంటి అరుదైన సాంకేతిక పరిజ్ఞానానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. కాలిఫోర్నియా సైఫన్ సిస్టమ్‌తో నిర్మితమైన ఈ ప్రాజెక్టు కేవలం భారతదేశంలోనే కాకుండా మొత్తం ఆసియా ఖండంలోనే మొట్టమొదటి సైఫన్ టెక్నాలజీ ప్రాజెక్టుగా చరిత్రకెక్కింది. ఆధునిక ఇంజనీరింగ్ రంగాన్నే ఆశ్చర్యపరిచే ఈ జలాశయం విశేషాలు, దాని వెనుక ఉన్న ఆసక్తికర చరిత్రను పరిశీలిస్తే ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి.

ఆటోమేటిక్ హుడ్ సైఫన్లు.. పనిచేసే విధానం

సరళా సాగర్ ప్రాజెక్టులో అత్యంత ప్రధాన ఆకర్షణ దీని సైఫన్ వ్యవస్థ. ప్రాజెక్టుపై మొత్తం 17 హుడ్ సైఫన్లు, 4 ప్రైమింగ్ సైఫన్లు ఉన్నాయి. సాధారణ ప్రాజెక్టుల్లో నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరినప్పుడు సిబ్బంది గేట్లు ఎత్తాల్సి ఉంటుంది. కానీ సరళా సాగర్‌లో నీరు పూర్తి స్థాయి మట్టానికి చేరగానే.. గాలి పీడనం, వాక్యూమ్ ఆధారంగా సైఫన్లు వాటంతట అవే తెరుచుకుంటాయి. ఒక్క యూనిట్ విద్యుత్ వాడకుండా, మానవ ప్రమేయం ఏమాత్రం లేకుండా వరద నీరు దిగువకు విడుదలవుతుంది. జలాశయంలో నీటిమట్టం తగ్గగానే సైఫన్లు వాటంతట అవే మూసుకుపోతాయి.

వనపర్తి సంస్థానాధీశుల దార్శనికత

ఈ ప్రాజెక్టు నిర్మాణ ఆలోచన నాటి వనపర్తి సంస్థానాధీశులకు దక్కింది. వనపర్తి చివరి పాలకుడు రాజా రామేశ్వరరావు తన తల్లి సరళా దేవి జ్ఞాపకార్థం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పించారు. 1949లో ప్రారంభమైన నిర్మాణ పనులు 1959 నాటికి పూర్తయ్యాయి. నిజాం ప్రభుత్వ సహకారంతో విదేశీ సాంకేతికతను ఒడిసిపట్టి స్థానిక ఇంజనీర్లు దీనిని అత్యంత పకడ్బందీగా నిర్మించారు. అప్పట్లోనే కాలిఫోర్నియా తరహా సైఫన్ సిస్టమ్‌ను తెచ్చి ఒక సంస్థానంలో వినియోగించడం వారి దూరదృష్టికి నిదర్శనం.

రైతాంగానికి జీవనాడి.. పర్యాటక శోభ

కృష్ణా నది ఉపనది అయిన వాగుపై నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 4 వేల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ప్రాజెక్టు నిండి సైఫన్ల గుండా నీరు బయటకు చిమ్ముతూ ప్రవహించే దృశ్యం ఒక జలపాతాన్ని తలపిస్తుంది. దీంతో వర్షాకాలంలో ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి కూడా పర్యాటకులు భారీగా తరలివస్తుంటారు. ఆరు దశాబ్దాల క్రితమే ఎలాంటి విద్యుత్, గేట్ ఆపరేటింగ్ ఖర్చులు లేకుండా నిర్మితమైన ఈ ప్రాజెక్టు నాటి ఇంజనీరింగ్ ప్రతిభకు, నిర్మాణ కౌశలానికి నిలువెత్తు నిదర్శనంగా ఇప్పటికీ చెక్కుచెదరకుండా సేవలందిస్తోంది.

Follow Us