Weight Loss: బరువు తగ్గాలంటే ఇవి కూడా చేయాల్సిందే.. ICMR తాజా సర్వేలో సంచలన నిజాలు!
మీరు బరువు తగ్గాలి అనుకుంటున్నారా?.. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారా? అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే.. చాలా మంది కేవలం డైట్ ఫాలో అయితే బరువు తగ్గుతామని అనుకుంటారు. కానీ తాజాగా ICMR-NIN చేసిన పరిశోధనలో బరువు తగ్గేందుకు ఇదొక్కటే సరిపోదని తేలింది.. కాబట్టి బరువు తగ్గాలంటే ఏం చేయాలి.. ఈ పరిశోధన ఏం చెప్తోందో ఇక్కడ తెలుసుకోండి.

పెరుగుతున్న బరువు, దానికి తోడు చుట్టుముట్టే అనారోగ్య సమస్యలు.. ప్రస్తుతం చాలామందిని ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య. అయితే, బరువు తగ్గడానికి ఎలాంటి పద్ధతులు పాటించాలి? కేవలం డైటింగ్ చేస్తే సరిపోతుందా? లేక జిమ్‌లో చెమటోడ్చాలా? అనే సందేహాలకు ప్రముఖ పరిశోధనా సంస్థ ICMR-NIN చెక్ పెట్టింది.ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో దాదాపు 5 లక్షల మందికి పైగా పాల్గొన్న 112 అంతర్జాతీయ పరిశోధనలను సుదీర్ఘంగా విశ్లేషించిన హైదరాబాద్ శాస్త్రవేత్తలు బరువు తగ్గడంపై సంచలన విషయాలను వెల్లడించారు.
ICMR-NIN శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం, బరువు తగ్గాలనుకునేవారు కేవలం డైటింగ్ లేదా వ్యాయామంపై మాత్రమే ఆధారపడకూడదని.. ఆహార నియంత్రణ , వ్యాయామం రెండింటినీ కలిపి పాటించినప్పుడే లాంగ్ టర్మ్ ఫలితాలు సాధించవచ్చని స్పష్టం చేశారు. 12 నెలల కంటే ఎక్కువ టైమ్ ఈ రెండింటినీ పాటించిన వారిలో సగటున 3.68 కిలోల బరువు తగ్గినట్లు గుర్తించారు.
పరిశోధనలో తేలిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. తక్కువ కేలరీల ఆహారాన్ని తీసుకోవడం వల్ల మొదటి 3 నెలల వ్యవధిలోనే బరువు వేగంగా తగ్గుతారు. అయితే, కాలక్రమేణా కేవలం డైటింగ్ వల్ల మాత్రమే బరువు తగ్గడం సాధ్యపడదని తెలిపారు. ఇక్కడే వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. వ్యాయామం చేయడం వల్ల ప్రారంభంలో బరువు తగ్గే వేగం తక్కువగా ఉన్నప్పటికీ, రోజులు గడిచేకొద్దీ అది శరీరంలో స్థిరమైన మార్పులను తీసుకువస్తుంది.
ఈ జీవనశైలి మార్పులు కేవలం బరువు తగ్గడానికే కాకుండా బీపీ, షుగర్ వంటి వ్యాధులను అదుపు చేయడంలోనూ అద్భుతంగా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయడం వల్ల సిస్టోలిక్ రక్తపోటు 6.10 mmHg వరకు తగ్గుతున్నట్లు పరిశోధనలో తేలింది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటించే వారిలో డయాస్టోలిక్ బీపీ అదుపులోకి వస్తుందని గుర్తించారు. డైట్, వ్యాయామం క్రమం తప్పకుండా పాటిస్తే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలు తగ్గడమే కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ మెరుగుపడుతుంది.
బరువు తగ్గడం అంటే కేవలం త్రాసు మీద సంఖ్యను తగ్గించుకోవడం మాత్రమే కాదని.. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ, జీవనశైలి మార్పులు కలిసినప్పుడే శరీరంలో సరైన మెటబాలిక్ మార్పులు వచ్చి గుండె సంబంధిత రోగాల ముప్పు తగ్గుతుంది అని ICMR-NIN డైరెక్టర్ డాక్టర్ భారతి కులకర్ణి తెలిపారు. కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారు కేవలం ఒకే పద్ధతికి పరిమితం కాకుండా, సమతుల్య ఆహారంతో పాటు రోజువారీ వ్యాయామాన్ని అలవాటు చేసుకోవడమే ఉత్తమమైన మార్గమని ఈ పరిశోధన తేల్చిచెబుతోంది.
మరిన్ని లైఫ్‌స్లైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
