AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్న కోసం పరుగులు పెడుతూ స్కూల్ బస్సు దగ్గరకు రెండేళ్ల బాలుడు.. అంతలోనే..

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. అన్న స్కూల్‌ బస్సులో ఇంటికి వస్తుండగా.. అతడి కోసం ఎదురుచూస్తున్న రెండేళ్ల తమ్ముడు ఇఫ్రాయిమ్‌ బస్సు వద్దకు పరుగెత్తాడు. చిన్నారి బస్సు ముందుకు వచ్చిన విషయాన్ని డ్రైవర్‌ గమనించకపోవడంతో బస్సు కదిలింది. దీంతో బస్సు కింద పడి వెనుక టైరు చిన్నారిపై నుంచి వెళ్లడంతో ఇఫ్రాయిమ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

అన్న కోసం పరుగులు పెడుతూ స్కూల్ బస్సు దగ్గరకు రెండేళ్ల బాలుడు.. అంతలోనే..
Two Year Old Boy
P Shivteja
| Edited By: |

Updated on: Sep 09, 2026 | 12:28 PM

Share

తన కళ్లముందే కొడుకును కోల్పోయిన ఆ తల్లి విషాదాన్ని మాటల్లో చెప్పలేం. స్కూల్‌ నుంచి అన్న వస్తాడని ఎదురుచూస్తున్న రెండేళ్ల చిన్నోడు.. స్కూల్‌ బస్సు కనిపించగానే ఆనందంగా దాని వైపు పరుగెత్తాడు. కానీ అదే బస్సు ఆ చిన్నారి పాలిట మృత్యుశకటంగా మారింది. బస్సు కింద పడి బాబు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో చోటుచేసుకుంది.

సదాశివపేట పట్టణంలోని సిద్ధాపూర్‌లో జోసఫ్‌ అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసముంటున్నాడు. స్థానికంగా ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేస్తున్న జోసఫ్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు టైటస్‌ స్థానిక జీనియస్‌ స్కూల్‌లో యూకేజీ చదువుతున్నాడు. ప్రతిరోజూ మాదిరిగానే మంగళవారం సాయంత్రం టైటస్‌ స్కూల్‌ బస్సులో ఇంటికి చేరుకున్నాడు.

అన్న కోసం ఇంటి వద్ద ఎదురుచూస్తున్న రెండేళ్ల ఇఫ్రాయిమ్‌.. బస్సు రాగానే ఎంతో ఆనందంగా దాని వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. అయితే బాబు బస్సు ముందుకు వచ్చిన విషయాన్ని డ్రైవర్‌ గమనించలేదని తెలుస్తోంది. దీంతో బస్సును ముందుకు కదిలించడంతో ఇఫ్రాయిమ్‌ దాని కింద పడిపోయాడు. వెనుక టైరు చిన్నారిపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై.. అక్కడికక్కడే మృతి చెందాడు.

కళ్లముందే ఘోరం.. తల్లి కన్నీరుమున్నీరు

కళ్లముందే జరిగిన ఈ దారుణ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన చిన్నారిని కోల్పోయిన తల్లి మౌనిక కన్నీరుమున్నీరుగా విలపించింది. అప్పటివరకు అన్న కోసం ఎదురుచూస్తూ ఉత్సాహంగా పరుగెత్తిన చిన్నోడు.. క్షణాల్లోనే విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.

ఈ ప్రమాదానికి స్కూల్‌ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్‌ హెడ్‌ఫోన్స్‌ పెట్టుకుని పాటలు వింటూ బస్సు నడిపినట్లు వారు ఆరోపించారు. అంతేకాకుండా బస్సుతో పాటు వచ్చిన సహాయకుడు వృద్ధుడై ఉండటంతో చిన్నారుల భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్నారి మృతికి కారణమైన బస్సు డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్‌ చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న సదాశివపేట పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us