చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. హాకీలో సౌత్ కొరియా ఖేల్ ఖతం.. 44 ఏళ్ల గోల్డ్ మెడల్..?
ఏషియన్ గేమ్స్ 2026లో భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించే దిశగా మరో అడుగు ముందుకు వేసింది. ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్ పోరులో బలమైన సౌత్ కొరియాను 2-0 తేడాతో మట్టికరిపించి ఫైనల్లోకి సగర్వంగా అడుగుపెట్టింది. ఈ విజయంతో ఏకంగా 44 ఏళ్ల నాటి స్వర్ణ పతక నిరీక్షణను ముగించేందుకు భారత అమ్మాయిలు సిద్ధమయ్యారు.

ఏషియన్ గేమ్స్ 2026 మహిళల హాకీ విభాగంలో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరింది. గురువారం జరిగిన హోరాహోరీ సెమీఫైనల్ పోరులో భారత అమ్మాయిలు 2-0 గోల్స్ తేడాతో బలమైన దక్షిణ కొరియాను మట్టికరిపించారు. ఈ విజయంతో భారత మహిళల జట్టు ఆసియా క్రీడల్లో ఏకంగా 44 ఏళ్ల నాటి స్వర్ణ పతక నిరీక్షణను ముగించేందుకు కేవలం ఒక్క అడుగు దూరంలో నిలిచింది. చివరిసారిగా భారత్ 1982 న్యూఢిల్లీ ఆసియా క్రీడల్లో మహిళల హాకీలో పసిడి పతకం సాధించింది. శుక్రవారం జరగనున్న ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ చైనాతో భారత్ తలపడనుంది.
తొలి అర్ధభాగంలో పెనాల్టీ కార్నర్ల వర్షం.. కొరియా గోడలాంటి డిఫెన్స్
జపాన్‌లోని గిఫు ప్రిఫెక్చురల్ గ్రీన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి క్వార్టర్ నుంచే భారత జట్టు దూకుడుగా ఆడింది. ఆట రెండో నిమిషంలోనే లభించిన తొలి పెనాల్టీ కార్నర్‌ను దీపిక సంధించగా, కొరియా గోల్‌కీపర్ సియోయాన్ లీ అద్భుతంగా నిలువరించింది. ఆ తర్వాత నవనీత్ కౌర్, రుతుజా దాదాసో పిసల్ లభించిన చక్కటి అవకాశాలను గోల్స్‌గా మలచడంలో తడబడ్డారు. రెండో క్వార్టర్‌లో భారత్‌కు వరుసగా పెనాల్టీ కార్నర్లు వచ్చాయి. ఒకదాని వెంట ఒకటిగా మూడు పెనాల్టీ కార్నర్లు లభించినప్పటికీ, కొరియా డిఫెండర్లు గోడలా అడ్డుకున్నారు. మొదటి రెండు క్వార్టర్లలో కలిపి భారత్‌కు ఏకంగా ఎనిమిది పెనాల్టీ కార్నర్లు లభించినా ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి స్కోరు 0-0తో సమంగా నిలిచింది.
వ్యూహం మార్చిన భారత్.. ఇషిక, సలీమాల మెరుపు గోల్స్
ద్వితీయార్థంలో భారత జట్టు వ్యూహం మార్చడంతో కొరియా కోట బద్దలైంది. 44వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను డైరెక్ట్ హిట్ చేయకుండా భారత్ తెలివిగా వేరియేషన్ ఎంచుకుంది. దీపిక నుంచి వచ్చిన ఇన్‌డైరెక్ట్ పాస్‌ను ఇంజెక్టర్ ఇషికా చౌదరి తెలివిగా నెట్‌లోకి మళ్లించి భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించింది. ఆ వెంటనే నాలుగో క్వార్టర్ ఆరంభంలో కెప్టెన్ సలీమా టెటే తన అద్భుత క్లాస్‌ను ప్రదర్శించింది. కుడి వింగ్ నుంచి మెరుపు వేగంతో సోలో రన్ తీస్తూ బాక్స్‌లోకి కట్‌బ్యాక్ షాట్ సంధించింది. ఆ బంతి కొరియా డిఫెండర్ స్టిక్‌కు తగిలి గోల్ పోస్ట్‌లోకి వెళ్లడంతో భారత్ 2-0తో ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకుంది.
కొరియా దాడులను తిప్పికొట్టిన డిఫెన్స్.. సగర్వంగా ఫైనల్‌కు..
చివరి నిమిషాల్లో పుంజుకునేందుకు దక్షిణ కొరియా తీవ్రంగా పోరాడింది. మ్యాచ్ ఆఖరి క్షణాల్లో ఒకదాని వెంట ఒకటిగా ఏకంగా నాలుగు పెనాల్టీ కార్నర్లను సంపాదించింది. అయితే భారత గోల్‌కీపర్, డిఫెన్స్ విభాగం ఏమాత్రం బెదరకుండా కొరియా దాడులన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టి క్లీన్ షీట్‌ను కాపాడుకుంది. దీంతో 2-0తో అద్భుత విజయం సాధించి భారత్ సగర్వంగా ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. కాంస్య పతక పోరులో దక్షిణ కొరియా ఆతిథ్య జపాన్‌తో తలపడనుంది. మొదటి సెమీఫైనల్‌లో ఆతిథ్య జపాన్‌పై పెనాల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో నెగ్గిన చైనాతో భారత్ స్వర్ణ పతక పోరులో తలపడనుంది. శుక్రవారం జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి నాలుగు దశాబ్దాల పసిడి కల నెరవేర్చుకోవాలని భారత మహిళల జట్టు పట్టుదలతో ఉంది.
