AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక ఉన్న అసలు కథ ఇదే..!

Devaragattu Banni Utsavam 2026: కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రసిద్ధ బన్నీ ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయదశమి సందర్భంగా నిర్వహించే సంప్రదాయ కర్రల సమరం ఈసారి తిథులు, నక్షత్రాల కారణంగా బుధవారం అర్ధరాత్రి జరగనుంది. ఉత్సవం సందర్భంగా సుమారు 1,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్లు, నైట్ విజన్ సీసీ కెమెరాలతో నిఘా ఉంచడంతో పాటు అంబులెన్సులు, ప్రత్యేక వైద్య సదుపాయాలను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక ఉన్న అసలు కథ ఇదే..!
Devaragattu Banni Utsavam 2026
Shaik Madar Saheb
|

Updated on: Oct 21, 2026 | 8:15 AM

Share

దేశవ్యాప్తంగా దసరా పండుగను రావణ దహనాలు, భక్తిశ్రద్ధలతో పూజలు, సాంప్రదాయ వేడుకలతో జరుపుకుంటారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో మాత్రం విజయదశమి పర్వదినం సందర్భంగా ఒక అత్యంత భిన్నమైన, సాహసోపేతమైన సంప్రదాయం కొనసాగుతోంది. అదే ప్రసిద్ధ దేవరగట్టు బన్నీ ఉత్సవం (కర్రల సమరం).. అయితే.. ప్రతి సంవత్సరం దసరా రోజు జరిగే కర్రల సమరంలో చిన్న మార్పు చోటుచేసుకుంది. తిథులు, నక్షత్రాల కారణంగా కర్రల సమరానికి బుధవారం అర్థరాత్రి ముహూర్తం ఫిక్స్‌ చేశారు. దేవరగట్టు బన్నీ ఉత్సవంలో వేలాది మంది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కర్రలతో తలపడే ఈ ప్రత్యేక వేడుక వెనుక ఉన్న పురాణ నేపథ్యం, విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడం కోసం..

వాస్తవానికి, దసరా సందర్భంగా కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు అడవుల్లో కొండపై వెలసిన మాళవి మల్లేశ్వరస్వామి ఉత్సవాల్లో కర్రల సమరం అనాదిగా జరుగుతోంది. దేవతామూర్తులైన మాళమ్మ, మల్లేశ్వరస్వామికి దసరా సందర్భంగా కల్యాణం జరిపిస్తారు. ఆ తర్వాత కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, ఎదురు బసవన్నగుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడం కోసం పలు గ్రామాల ప్రజలు రెండుగా విడిపోయి కర్రలతో తలపడతారు. ఒకవైపు నెరని, నెరని తండ, కొత్తపేట గ్రామాల ప్రజలు.. మరోవైపు ఎల్లార్తి, సులువాయి, ఆదోని, ఆనకైర, నిడ్రవట్టి గ్రామాల ప్రజలు.. ఇలా రెండు వర్గాలుగా ఏర్పడతారు. ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు ఇరువర్గాలవారు కర్రలతో భీకరంగా తలపడతారు.

ఈ సంప్రదాయం వెనుక ఉన్న పురాణగాథ:

ఈ విచిత్రమైన కర్రల పోరు వెనుక స్థానికంగా ఒక బలమైన పురాణ కథ ప్రచారంలో ఉంది. పూర్వం మణి, మల్లాసురులు అనే రాక్షసులు ఆ ప్రాంతంలోని సాధువులను, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండేవారు. ఆ రాక్షస బాధలను భరించలేక ప్రజలు వేడుకోగా.. పరమ శివుడు భైరవ రూపంలో పార్వతీ సమేతంగా వచ్చి ఆ రాక్షసులను సంహరించారని భక్తులు గట్టిగా విశ్వసిస్తారు. చెడుపై దైవం సాధించిన విజయానికి ప్రతీకగా, ఆ చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేసుకుంటూ ఈ ఉత్సవాన్ని అనాదిగా నిర్వహిస్తున్నారు. ఆ నాటి పోరాటాన్ని తలపించేలా భక్తులు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ ఉత్సవ విగ్రహాలను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ ఘర్షణలో గెలిచిన గ్రామానికి స్వామి వారి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని, ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుందని ప్రజల ప్రగాఢ నమ్మకం..

సవాళ్లు – భద్రతా చర్యలు:

అయితే.. కాలక్రమేణ ఈ ఆచారం గ్రామగౌరవాన్ని నిలబెట్టే ప్రతిష్టాత్మక వేడుకగా మారింది. అయితే ఈ కర్రల సమరంలో ప్రతి ఏటా పలువురికి తీవ్ర గాయాలు కావడం సర్వసాధారణంగా మారుతోంది. రక్తం కారుతున్నప్పటికీ భక్తులు వెనకడుగు వేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్సవాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, పోలీసులు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. సంప్రదాయాన్ని గౌరవిస్తూనే, ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం కలగకుండా అధికారులు తగిన భద్రతా చర్యలు చేపడుతున్నారు.

1000 మంది పోలీసులతో బందోబస్తు

అయితే.. కర్రల సమరంపై అధికారులు, పోలీసులు స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. 1000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. SP, పలువురు DSPలు, CIల ఆధ్వర్యంలో పహారా కాస్తున్నారు. నైట్ విజన్ సీసీ కెమెరాలతో బన్నీ ఉత్సవంపై ప్రత్యేక నిఘా ఉంచారు. LED లైట్లు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీడియో కెమెరాలతో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను సైతం ఏర్పాటు చేశారు. దేవరగట్టు దారిలో 5 చెక్‌పోస్ట్‌లు, 10 పికెట్ల ఏర్పాటు చేశామని.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిపైనా ఫోకస్ చేసినట్లు అధికారులు తెలిపారు. పదుల సంఖ్యలో అంబులెన్స్‌లు, 30పడకల ఆరోగ్య కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. అయితే.. కర్రల సమరంపై కర్నూలు కలెక్టర్‌, SP స్థానిక ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఉత్సవం పేరుతో ఘర్షణలకు దిగేతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Follow Us