AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేషన్ కార్డుదారులకు సూపర్ గుడ్ న్యూస్.. తక్కువ ధరలకే మరిన్ని సరుకులు

Telangana Ration Shops: తెలంగాణలో రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్‌, చక్కెర వంటి నిత్యావసరాలను సబ్సిడీ ధరలకు పంపిణీ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదన అమలుకు అయ్యే ఖర్చు, సరుకుల సేకరణ, పంపిణీ విధానంపై అధికారులు అంచనాలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు, రాష్ట్రంలో 3.42 కోట్ల మంది ప్రజల ఆహార భద్రత కోసం 14 నెలలకు సరిపడా నిల్వల సమీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది.

రేషన్ కార్డుదారులకు సూపర్ గుడ్ న్యూస్.. తక్కువ ధరలకే మరిన్ని సరుకులు
Telangana Ration Shops
Rajashekher G
|

Updated on: Oct 21, 2026 | 7:48 AM

Share

తెలంగాణ రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్‌ దుకాణాల ద్వారా పేదలకు బియ్యంతో పాటు మరిన్ని నిత్యావసర సరుకులను సబ్సిడీ ధరలకు అందించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్‌, చక్కెర, చింతపండు, కారం పొడి వంటి సరుకులను ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే ప్రతిపాదనపై పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. నిత్యావసరాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పేద కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించడమే ఈ ప్రతిపాదన లక్ష్యంగా కనిపిస్తోంది.

ఈ అంశంపై పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖల మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సరుకుల సేకరణ, లబ్ధిదారులకు పంపిణీ చేసే పరిమాణాలు, పంపిణీ విధానం, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని సమగ్రంగా అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నివేదికలను పరిశీలించిన తర్వాత నిత్యావసరాల పంపిణీపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

మరోవైపు, రాష్ట్రంలో రేషన్‌ ద్వారా ప్రయోజనం పొందుతున్న 3.42 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత కల్పించేలా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తోంది. వర్షాభావం, ప్రకృతి వైపరీత్యాలు, పంటల దిగుబడి తగ్గడం వంటి పరిస్థితులు ఎదురైనా ప్రజాపంపిణీ వ్యవస్థకు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.

కాగా, రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థతో పాటు సంక్షేమ పథకాలు, మధ్యాహ్న భోజన పథకానికి నెలకు 2.38 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం. అక్టోబర్‌ 16 నాటికి ప్రభుత్వ బఫర్‌ గోదాముల్లో 9.64 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయి. సీఎంఆర్‌, ఇతర వనరుల నుంచి మరో 18.39 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. ఇవన్నీ అందుబాటులోకి వస్తే మొత్తం 28.03 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం లభిస్తుంది. ఈ నిల్వలు సుమారు 11.7 నెలల అవసరాలకు సరిపోతాయని అధికారులు అంచనా వేశారు. బియ్యం సకాలంలో గోదాములకు చేరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

Follow Us